అలా మొదలు పెట్టి.. ఇలా హీరోలయ్యారు!

ఒకప్పుడు వీళ్లంతా సెకన్ల, నిమిషాల వ్యవధిగల పాత్రలకే పరిమితం అయ్యారు. ఇతర కథానాయకుల సినిమాల్లో సహాయ నటులుగానూ సాగారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు సోలో హీరోలుగా మారి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

Updated : 19 Apr 2021 11:42 IST

ఒకప్పుడు వీళ్లంతా సెకన్ల, నిమిషాల వ్యవధి గల పాత్రలకే పరిమితమయ్యారు. తర్వాత సహాయ నటులుగానూ నటించారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు సోలో హీరోలుగా మారి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎవరా నటులు? వాళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఏ చిత్రంతో తమదైన ముద్ర చేశారు? తెలుసుకుందాం..


విజయ్‌ దేవరకొండ

వెండి తెరపై విజయ్‌ దేవరకొండ మెరిసిన తొలి చిత్రం ‘నువ్విలా’. రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో బృందంలో ఒకడిగా దర్శనమిచ్చాడు. నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో సహాయ నటుడి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్‌ పూర్తి స్థాయి నటుడిగా తనని తాను ప్రేక్షకులకి పరిచయం చేసేందుకు సుమారు ఐదేళ్లు పట్టింది. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఆ అవకాశం అందుకున్నాడు విజయ్‌‌. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నటుడిగా విజయ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత చేసిన ‘ద్వారక’ చిత్రం ఆశించిన ఫలితం అందించలేదు. దాని తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ అవకాశం అందుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయ్‌ని మరో స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్‌.


నిఖిల్‌

‘సంబరం’ చిత్రంలో తొలిసారి తెరపై మెరిశాడు నిఖిల్‌. ఆ తర్వాత వచ్చిన ‘హైదరాబాద్‌ నవాబ్స్’, ‘హ్యాపీ డేస్’, ‘అంకిత్‌, పల్లవి అండ్‌ ఫ్రెండ్స్‌’ చిత్రాల్లో బృందంలో ఒకడిగా కనిపించాడు. ‘యువత’తో సోలో హీరోగా మారాడు. నిఖిల్‌ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘స్వామి రారా’. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసి సస్పెన్స్‌ కథలకు కేరాఫ్‌గా మారాడు. ‘కార్తికేయ’, ‘సూర్య VS సూర్య’, ‘శంకరాభరణం’, ‘ఎక్కడికి పోతావు చిన్నివాడా’, ‘కేశవ’, ‘అర్జున్‌ సురవరం’ సినిమాలతో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్‌’లతో బిజీగా ఉన్నాడు.


అడివి శేష్‌

ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా వచ్చిన ‘సొంతం’ చిత్రంతో తొలిసారి వెండి తెరపై దర్శనమిచ్చిన అడివి శేష్‌ ‘కర్మ’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం శేష్‌దే. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘పంజా’ చిత్రంలో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’, ‘బాహుబలి ది బిగినింగ్‌’, ‘దొంగాట’, ‘సైజ్‌ జీరో’ చిత్రాల్లో పోషించింది చిన్న పాత్రలైనా తన ప్రతిభ చూపాడు. ‘క్షణం’ చిత్రం అడివి శేష్‌ కెరీర్‌ని మలుపుతిప్పింది. అలా ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సినిమాల్లో నటించి థ్రిల్లర్‌ నేపథ్యంలో కొత్త ఒరవడి సృష్టించాడు. ప్రస్తుతం ‘మేజర్‌’ ,‘హిట్‌ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు శేష్‌.


శర్వానంద్

‘ఐదో తారీఖు’ చిత్రంతో తెరంగ్రేటం చేశాడు శర్వానంద్‌. ‘యువసేన’, ‘గౌరి’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘సంక్రాంతి’, ‘వెన్నెల’, ‘లక్ష్మీ’, ‘క్లాస్‌ మేట్స్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అమ్మ చెప్పింది’, ‘వీధి’ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. శర్వా కెరీర్‌ని మార్చిన చిత్రంగా ‘గమ్యం’. ఆ తర్వాత జయాపజయాలు లెక్కచేయకుండా మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో సాగుతున్నాడు. ప్రస్తుతం ‘మహా సముద్రం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తున్నాడు.


నవీన్‌ పొలిశెట్టి

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడిగా మారాడు నవీన్‌ పొలిశెట్టి. ‘డీ ఫర్‌ దోపిడి’, ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో కథానాయకుడిగా మారి ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచాడు. ఈ సినిమాతో నవీన్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. ఆ వెంటనే ‘చిచ్చోరే’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇటీవలే ‘జాతి రత్నాలు’ సినిమాతో సందడి చేశాడు.


సత్యదేవ్‌

నటుడిగా సత్యదేవ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మైనే ప్యార్‌ కియా’, ‘ముకుంద’, ‘అసుర’, ‘జ్యోతి లక్ష్మి’, ‘క్షణం’, ‘మన ఊరి రామాయణం’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘ఘాజీ’, ‘రోగ్‌’, ‘ఆక్సిజన్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రంలో కథానాయకుడిగా కనిపించి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’తో ఫీల్‌గుడ్‌ మూవీ అందించాడు. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.


సందీప్‌ కిషన్‌

‘ప్రస్థానం’ చిత్రంతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించాడు సందీప్‌ కిషన్. తర్వాత ‘స్నేహ గీతం’లో కీలక పాత్ర పోషించాడు. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’తో హీరోగా మారాడు. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో సహాయ నటుడిగా కనిపించి మెప్పించాడు. ఆ సమయంలోనే హిందీ, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. సందీప్‌ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’. ఈ చిత్రం ప్రశంసలతోపాటు మంచి వసూళ్లని సాధించింది. ప్రస్తుతం ‘గల్లీ రౌడీ’లో హీరోగా.. ‘వివాహ భోజనంబు’ చిత్రంలో అతిథిగా కనిపించనున్నాడు సందీప్‌.


నాగశౌర్య

నాగశౌర్య తెరంగ్రేటం చేసిన చిత్రం ‘క్రికెట్‌ గర్ల్స్‌ అండ్‌ బీర్‌’. ఆ తర్వాత ‘చందమామ కథలు’ సినిమాలో కనిపించాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషించాడు. ‘లక్ష్మీరావే మా ఇంటికి’ సినిమాతో  పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాడు. శౌర్య మంచి కమర్షియల్‌ హిట్‌ అందుకున్న చిత్రం ‘ఛలో’. ప్రస్తుతం ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.


శ్రీ విష్ణు

‘బాణం’, ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్‌’, ‘నా ఇష్టం’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్’, ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అసుర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాల్లో ముఖ్య భూమిక పోషించి ఆకట్టుకున్నాడు శ్రీ విష్ణు. హీరోగా విష్ణు చేసిన తొలి సినిమా ‘మా అబ్బాయి’. ఆ తర్వాత సహాయ నటుడిగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో కనిపించాడు. ‘మెంటల్‌ మెదిలో’ సినిమాతో మళ్లీ హీరో పాత్ర పోషించి మంచి విజయం అందుకున్నాడు. ‘నీది నాది ఒకే కథ’తో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం ‘భళా తందనాన’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని