Vijay Deverakonda: వారు లేకపోతే నేను ఎక్కడో ఉండేవాణ్ని: విజయ్ దేవరకొండ
ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..
చాలామంది నటుల్లానే తానూ ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ‘హీరోగానే చేస్తా’ అని భీష్మించుకుని కూర్చోకుండా.. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చిన్న పాత్రల్లో నటించాడు. కట్ చేస్తే, కెరీర్ ప్రారంభమైన త్వరలోనే ‘స్టార్’ డమ్ సొంతం చేసుకున్నాడు. నేటి యువతకు బ్రాండ్‌గా మారాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విశేష క్రేజ్‌తో దూసుకెళ్తోన్న ఆ ‘డియర్ కామ్రేడ్’ మరెవరో కాదు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). నేడు అతడి పుట్టినరోజు (1989 మే 9) సందర్భంగా ఆ ప్రయాణాన్ని గుర్తుచేసుకుందాం (Happy Birthday Vijay Deverakonda)..
నాన్న కల నెరవేర్చేలా..
విజయ్ దేవరకొండ స్వస్థలం అచ్చంపేట దగ్గర తుమ్మన్‌పేట. నటనపై ఉన్న అమితాసక్తితో విజయ్ తండ్రి గోవర్ధన్‌రావు సొంతూరు వదిలి హైదరాబాద్ చేరుకున్నారు. హీరో అవకాశాల కోసం ప్రయత్నించి చివరకు టెలివిజన్ డైరెక్టరుగా పనిచేశారు. నటనపై తనకున్న ఇష్టంతోనే.. ఒకానొక సమయంలో విజయ్ సినీ రంగంలోకి వెళ్తానంటే ఆయన అడ్డుచెప్పలేదు. అయితే, తండ్రికి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని కారణంగా చూపించి చదువును దూరం చేయలేదు విజయ్. డిగ్రీ పూర్తయ్యాకే నటనపై దృష్టిపెట్టాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి నాన్న కలని తాను నిజం చేశాడు.
తొలి సినిమా ‘నువ్విలా’
కాచిగూడ (హైదరాబాద్)లోని బద్రుకా కళాశాలలో బీకామ్ పూర్తి చేసిన విజయ్‌ని గోవర్ధన్‌రావు ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించారు. అక్కడ ఎక్కువగా నాటకాలు ప్రదర్శిస్తుండే విజయ్‌ని ‘‘ఇంకెన్నాళ్లు ఇలా? సినిమాల్లోకి వెళ్లవా?’’ అని తండ్రి ప్రశ్నించగా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్విలా’ చిత్రంలో విష్ణుగా కనిపించాడు. అదే సమయంలో శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని, ఆడిషన్ ఇచ్చి ఆ చిత్రంలో అజయ్ పాత్రకు ఎంపికయ్యాడు.
పెళ్లిచూపులు.. కెరీర్‌లో మలుపులు
తొలి రెండు సినిమాల్లోని క్యారెక్టర్లు విజయ్‌కి అంతగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ, నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్రతో చిత్ర పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. అంతమాత్రాన అతడికి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ‘పెళ్లి చూపులు’ చిత్రం కోసం విజయ్ కథానాయకుడిగా ఫిక్స్ అయ్యారు. అయితే, అతణ్ని హీరోగా పెట్టి సినిమాని నిర్మించేందుకు చాలామంది నిర్మాతలు అనాసక్తి కనబరిచారు. చివరకు రాజ్ కందుకూరి.. విజయ్‌ని నమ్మి నిర్మించిన ఆ సినిమా విశేష ప్రేక్షకాదరణతోపాటు జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత విజయ్ నటించిన ‘ద్వారక’ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అర్జున్‌రెడ్డి.. రౌడీ హీరో
‘ఫలానా పాత్ర ఫలానా వారి కోసమే పుడుతుంది. అది ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది’ అనే మాటలు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తుంటాయి. విజయ్ విషయంలో ఆ మాట నిజమే అనిపిస్తుంది. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమా అందుకు నిదర్శనం. తమకు ఆ కథ నప్పదని ఇద్దరు ప్రముఖ హీరోలు ‘అర్జున్‌రెడ్డి’ని తిరస్కరిస్తే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. విజయ్‌ను సంప్రదించారు. దేనికైనా రెడీ అనే విజయ్.. అర్జున్‌రెడ్డిగా జీవించాడు. తనదైన యాటిట్యూడ్‌తో యువతను బాగా ఆకర్షించాడు. రౌడీ హీరో ఇమేజ్, స్టార్ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
పడుతూ.. లేస్తూ
‘అర్జున్‌రెడ్డి’తో ఊహించని విజయాన్ని అందుకున్న విజయ్‌ను వరుస అవకాశాలు వరించాయి. ‘ఏ మంత్రం వేసావె’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలకు మిశ్రమ స్పందన రాగా.. ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’, కీలక పాత్ర పోషించిన ‘మహానటి’ సూపర్ హిట్‌గా నిలిచాయి. భారీ అంచనాలతో గతేడాది విడుదలైన ‘లైగర్’ (Liger) విజయ్ అభిమానుల్ని సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ ప్రభావం తన తదుపరి చిత్రం ‘జనగణమన (జేజీఎం)’పైనా పడింది. ‘లైగర్’ విడుదలకు ముందే ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్.. విజయ్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జేజీఎంను ప్రకటించారు. చిత్రీకరణ ప్రారంభమైనా లైగర్ రిజల్ట్‌తో దాన్ని నిలిపివేశారు. దీంతో విజయ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ‘ఖుషి’ (Kushi)లో నటిస్తున్న అతడు.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేయనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో గతంలోనే ఓ చిత్రం ఖరారైనా దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు.
అందుకే నిర్మాతగా..
కెరీర్ ప్రారంభంలో తాను పడిన ఇబ్బందులు ఇతర నటులు పడకూడదనే ఆలోచనతో విజయ్ నిర్మాతగా మారాడు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థను నెలకొల్పాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘పుష్పక విమానం’ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. ‘నన్ను నమ్మి కొందరు నిర్మాతలు నాతో సినిమాలు తీయకపోతే ఎక్కడో ఉండేవాణ్ని. అందుకే రిస్క్‌తో కూడిన పనైనా మరికొందరికి అవకాశం కల్పించేందుకు ప్రొడ్యూసర్‌ని అయ్యా’ అని అంటాడు. వ్యాపారంలోనూ అడుగుపెట్టి తనదైన ముద్ర వేశాడు. ‘రౌడీ’ పేరుతో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందం నింపాడు. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై అప్పుడప్పుడూ తన గళం వినిపిస్తూనే ఉంటాడు.
విమర్శలూ ఎక్కువే.. ఇన్‌స్టాలో అరుదైన రికార్డు
తన సినిమాలు, యాటిట్యూడ్‌తో ప్రశంసలు పొందే విజయ్ అదే స్థాయిలో విమర్శలూ ఎదుర్కొంటుంటాడు. ‘‘నాపై చేసే విమర్శల్ని కూడా నేను ఇష్టపడతా. ఓ వ్యక్తి నన్ను ఎంతగా ఇష్టపడితే ట్రోల్ చేస్తాడో కదా. అయితే అవి రొటీన్‌గా ఉంటే మాత్రం నేను పట్టించుకోను’’ అని అంటుంటాడు. ఓవర్‌నైట్ స్టార్ అనే మాట గురించి ఓ సందర్భంలో అడిగితే.. ‘నా సినీ కష్టాలన్నీ తెరవెనక పడ్డా. నేనెవరో తెలియని సమయంలో అవన్నీ ఎదుర్కొన్నా. నా తొలి ఐదు సినిమాలకు ముందు ఎంతో కష్టపడ్డా. ఆ కష్టమే ఇంతటి పేరు, ఇంతమంది అభిమానుల్ని అందించింది’ అని సమాధానమిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన్ను అనుసరిస్తోన్న వారి సంఖ్య 18.2 మిలియన్లకి పైగానే.
ఇష్టాలు.. ముద్దుపేరు
విజయ్‌కు మహేశ్‌బాబు, రణ్‌బీర్ కపూర్‌ల నటన బాగా ఇష్టం. ఫేవరెట్ కథానాయికలు.. దీపికా పదుకొణె, అలియా భట్. కాలక్షేపానికి పుస్తకాలు చదువుతాడు. హైదరాబాదీ దమ్ బిర్యానీ, బర్గర్లకి పెద్ద ఫ్యాన్. ముద్దు పేరు చిన్ను. కుటుంబానికే తొలి ప్రాధాన్యం. నచ్చే ఆటలు: వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్.
ఏదీ అసాధ్యం కాదు..
అనతి కాలంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకోవడంపై ఓ సందర్భంలో స్పందిస్తూ.. ‘‘నా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే కొన్నిసార్లు భయమేస్తుంది. అప్పుడప్పుడు గర్వంగా ఉంటుంది. ‘అప్పుడు ఇలా ఉండేవాడివి రా.. ఇలా మాట్లాడేవాడివి రా’ అని నా స్నేహితులు గత జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడు తెలియని భావోద్వేగానికి లోనవుతా. ఏదీ అసాధ్యం కాదు. మంచి నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టు శ్రమిస్తే ఏదైనా జరిగి తీరుతుంది. నా జీవితమే అందుకు ఉదాహరణ’’ అని యువతకు స్ఫూర్తినిచ్చే విజయ్‌కు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం
-
Mainampally: భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!