Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
సమయం.. ‘సినిమా రీల్’లా గిర్రున తిరుగుతుంది. ‘రీమిక్స్ సాంగ్’లా మెరుపువేగంతో దూసుకెళ్తోంది. అలా.. చూస్తుండగానే 2022 సగభాగం పూర్తయింది. ఎప్పుడో విడుదల కావాల్సిన క్రేజీ పాన్ ఇండియా చిత్రాలు, భారీ మల్టీస్టారర్ సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీసు బరిలో నిలిచాయి. వాటిలో కొన్ని అద్భుతమనిపించగా మరికొన్ని ఫర్వాలేదు అనిపించాయి. మరి ఈ 6 నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొచ్చి, వినోదం పంచిన చిత్రాల ‘ఫ్లాష్‌బ్యాక్’ చూస్తే..
ఆశ ఎన్‌కౌంటర్‌తో మొదలు.. బంగార్రాజుతో వసూళ్లు
కొవిడ్ ప్రభావం ఈ ఏడాది ఆరంభంలోనూ స్పష్టంగా కనిపించింది. మూడో వేవ్ రాకతో పెద్ద చిత్రాలన్నీ వెనక్కి తగ్గాయి. దాంతో 2022ను చిన్న సినిమాలే స్వాగతించాయి. జనవరి 1న రామ్‌గోపాల్ వర్మ ‘ఆశా ఎన్కౌంటర్’, వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ‘ఇందువదన’ విడుదలవగా, జనవరి 7న రానా ‘1945’, ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’ వచ్చాయి. ఇవేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీసు విషయంలో అతిపెద్ద సీజన్ అంటే సంక్రాంతి అనే చెబుతుంటారు. అలాంటిది.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘రాధేశ్యామ్’వంటి పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడటంతో ఆ అవకాశాన్ని ‘రౌడీబాయ్స్’, ‘సూపర్‌మచ్చి’, ‘హీరో’ తదితర సినిమాలు అందుకున్నాయి. వీటిల్లో ‘హీరో’ మినహా మిగిలినవి అంతగా మెప్పించలేకపోయాయి. వీటితోపాటు నాగార్జున- నాగచైతన్యల ‘బంగార్రాజు’ బరిలో దిగి, అసలైన పండగ వాతావరణాన్ని చూపించింది. మంచి వసూళ్లను సాధించింది. జనవరి ఆఖరిలో కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్‌లక్ సఖి’ వచ్చింది. గుడ్ రిజల్ట్ పొందలేకపోయింది.
భీమ్లాను ఆపేదెవరు.. హిట్ కొట్టిన టిల్లు
కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరిలో సినీ సందడి ఎక్కువగానే కనిపించింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’గా ఫిబ్రవరి 25న విచ్చేసి, తన సత్తా చాటారు. రానా ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన ఈ రీమేక్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అంతకంటమే ముందే చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం అందుకుంది ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ పాత్రలో జీవించి, యువతను తనవైపు తిప్పుకున్నాడు. ఫిబ్రవరి 12న టిల్లు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ (రవితేజ), ‘సెహరి’ (హర్ష్ కనుమిల్లి) పోటీపడగా విజయం ‘సెహరి’కే దక్కింది. మోహన్‌బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలై, ఆశించిన ఫలితం అందుకోలేదు.
మార్చి.. ఆర్ఆర్ఆర్దే
తెలుగు ప్రేక్షకులేకాదు భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలు ‘RRR’, ‘రాధేశ్యామ్’. ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ సినిమాలు ఎట్టకేలకు ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌కి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ, కొవిడ్ కేసులు పెరుగుతుండటం, థియేటర్లలోని సీట్ల సామర్థ్యం తక్కువగా ఉంటడం.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మరోసాయి వాయిదాపడి, మార్చిలో విచ్చేశాయి. అలా.. మార్చి 11న విడుదలైన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అభిమానుల భారీ అంచనాలు అందుకోలేకపోయింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల ‘ఆర్ఆర్ఆర్’ రూ.1200 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే నెలలో విడుదలైన కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’, శర్వానంద్ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ (మార్చి 4), రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ (మార్చి 18) చిత్రాలు పెద్దగా ఆకర్షించలేదు.
సర్కారు వారి మోత..
ఏప్రిల్‌లో విడుదలైన ఏ సినిమా ప్రేక్షకులకు మజానివ్వలేకపోయింది. తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ (ఏప్రిల్ 1) ఫర్వాలేదనిపించుకుంది. వరుణ్‌తేజ్ ‘గని’ (ఏప్రిల్ 8), చిరంజీవి- రామ్‌చరణ్‌ల ‘ఆచార్య’ (ఏప్రిల్ 29) భారీ అంచనాలతో వచ్చి, పరాజయాన్ని చవిచూశాయి. మే నెలలో ముందుగా ప్రేక్షకులను పలకరించిన చిత్రాలు సుమ ‘జయమ్మ పంచాయితీ’, శ్రీవిష్ణు ‘భళా తందనాన’ (మే 6) కొత్త ప్రయత్నమని ఈ సినిమాలను ప్రేక్షకులు ప్రశంసించినా విజయం అందించలేదు. మండు వేసవిలో వినోద వర్షం కురిపించిన సినిమా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (మే 6). పెళ్లి నేపథ్యంలో హాస్యం+ భావోద్వేగం కలబోతగా తెరకెక్కిన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. నటుడిగా విశ్వక్సేన్కు మంచి మార్కులు పడ్డాయి.
మే 12న విడుదలైన మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) వసూళ్ల మోత మోగిచింది. ప్రాంతీయ సినిమాగా విడుదలై, ఓవర్సీస్లోనూ ఘన విజయం అందుకుంది. వివాదాల మధ్య విడుదలైన చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ హీరోగా రూపొందిన ఈ సినిమా మే 20న విడుదలై, కొన్ని రోజుల్లోనే నిలిచిపోయింది. ‘ఎఫ్ 3’ (F3)తో మరోసారి నవ్వుల్లో ముంచెత్తింది వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబో. వీరు గతంలో నటించిన ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాగా సందడి చేసింది.
అంటే.. జూన్!
పాన్ ఇండియా కథలు, క్రేజీ మల్టీస్టారర్లతో సంక్రాంతి, వేసవి సీజన్లు ముగిశాయి. ఉద్విగ్నభరిత ‘మేజర్’తో (Major) జూన్ (3) ప్రారంభమైంది. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల్లో స్ఫూర్తి రగిల్చింది. ముంబయి దాడుల్లో అమరుడైన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన చిత్రమిది. ఆ తర్వాత, ‘అంటే.. సుందరానికీ!’ (Ante Sundaraniki) (జూన్ 10) అంటూ నాని నవ్వులు పూయించారు. ఎన్నాళ్లో వేచిన ‘విరాటపర్వం’ (VirataParvam) ఎట్టకేలకు జూన్ 17న విడుదలైంది. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే రోజు వచ్చిన సత్యదేవ్ ‘గాడ్సే’ (Godse) అంతగా ప్రభావం చూపలేదు. జూన్ 24న కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ (Sammathame), ఆకాశ్ పూరి ‘చోర్ బజార్’ (Chor Bazaar), సుమంత్ అశ్విన్- ఎం.ఎస్. రాజుల ‘7 డేస్ 6 నైట్స్’ (7 Days 6 Nights) సందడి చేస్తున్నాయి.
కేజీయఫ్ హవా.. విక్రమ్ భళా
తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా అనువాద చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి. అలా ఇప్పటి వరకూ విడుదలై, టాలీవుడ్ ఆడియెన్స్ మనసు దోచిన కథలివీ.. ఈ విషయంలో ముందుగా ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) (ఏప్రిల్ 14) గురించి ప్రస్తావించాల్సిందే. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని భాషల వారికీ బాగా దగ్గరై, వసూళ్ల సునామీ సృష్టించింది. కోలీవుడ్.. కమల్‌హాసన్ ‘విక్రమ్’ (Vikram) (జూన్ 3) ఊహించని విజయాన్ని అందుకుంది. విజయ్ ‘బీస్ట్’, అజిత్ ‘వలిమై’, సూర్య ‘ఈటీ’, విశాల్ ‘సామాన్యుడు’పై ఇక్కడి ప్రేక్షకులు అంచనాలు పెంచినా విశేష ప్రభావాన్ని చూపించలేకపోయాయి. హిందీలో తెరకెక్కి, తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా అలియాభట్ ‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) ఒక్కటే నిలిచింది.
ఓటీటీలో నేరుగా..
కొవిడ్/లాక్డౌన్ సమయం నుంచి ఓటీటీకీ మంచి ఆదరణ దక్కడంతో కొందరు దర్శకనిర్మాతలు నేరుగా ఆ ప్లాట్‌ఫామ్‌లపైనే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. అలా వచ్చినవే.. సుమంత్ ‘మళ్లీ మొదలైంది’, ప్రియమణి ‘భామాకలాపం’, నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’ తదితర చిత్రాలు. ఇవేకాదు ‘జనగణ మన’, ‘కశ్మీర్ ఫైల్స్’.. ఇలా మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలై, హిట్ అందుకున్న కొన్ని చిత్రాలు ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.
వసూళ్ల విషయంలో 2022 ప్రథమార్ధం అమోఘమని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’ కలిపి సుమారు రూ. 2 వేల కోట్లపైగానే వ్యాపారం జరిగింది. కొవిడ్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేయడం ఇదే తొలిసారనేది సినీ విశ్లేషకుల మాట. ఈ జోరును కొనసాగించేందుకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్థాయి అనే ట్యాగ్ లైన్ ఉందని, ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించారని, సరైన సమయానికి విడుదలైందనేవి విజయానికి ప్రామాణికం కాదు. కాలానికి తగ్గట్టు ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. రొటీన్ ఫార్ములా కాకుండా సరికొత్త ప్రయోగాలను కోరుకుంటున్నారు. కథ మినహా మిగిలినవేవీ ప్రధానం కాదని చెప్పకనే చెబుతున్నారు. కంటెంట్ బాగుంటే టికెట్ ధరలు ఎక్కువైనా థియేటర్లకు వచ్చి ‘సినిమా’ను కాపాడుతామని నిరూపించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా దర్శకనిర్మాతలు చిత్రాలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తే ఫలితం అద్భుతం.
-ఇంటర్నెట్‌డెస్క్ స్పెషల్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
-
India News
Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!