Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
నటులు.. దర్శకులుకావడం, దర్శకులు.. నటులవడం సహజం. ఇటీవల ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. అలా ఎవరెవరు? ఏయే చిత్రాలతో ఆకట్టుకున్నారో చూసేయండి..
నటన, దర్శకత్వం.. వేర్వేరు బాధ్యతలు. ఒకదానితో మరోదానికి సంబంధం ఉండదు. అయినా.. కొందరు డైరెక్షన్ చేస్తూనే నటిస్తుంటారు. కొందరు నటిస్తూనే మెగాఫోన్ పడుతుంటారు. రెండు పడవల మీద ప్రయాణం చేసినా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉన్నదే. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, అలరించిన వారెవరో తెలుసుకుందాం..
కమెడియన్.. ఏడ్పించాడు
ఎన్నో సినిమాల్లోని కామెడీ పాత్రలు, ‘జబర్దస్త్’లాంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకుడు కాబోతున్నారని తెలిసిన సమయంలో చాలామంది షాక్ అయ్యారు. హాస్య నటుడు కాబట్టి తనదైన శైలిలో ఏదైనా కామెడీ మూవీ తీస్తాడనుకున్నారు. కానీ, ఆయన మాత్రం ఎవరూ ఊహించని ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించారు. అదే ‘బలగం’ (Balagam). ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది. ‘కమెడియన్ ఇలాంటి కథని డీల్ చేయడమా?’ అని అనుకునేలా చేసింది. ఈ చిత్రాన్ని చూస్తూ భావోద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్నామని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెప్పడం.. వేణు ప్రతిభకు నిదర్శనం. డైరెక్షన్ పరంగా కొత్తవాడు అనే మాట రాకుండా తెలంగాణ పల్లె జీవితాల్ని, సంస్కృతిని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన వేణు.. ఆ సినిమాలో టైలర్ నర్సిగా కనిపించి నవ్వులు పంచారు. ఓ ఇంటి పెద్ద మరణం చుట్టూ సాగే కథ ఇది. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్‌రెడ్డి, మురళీధర్ గౌడ్, రూపా లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
అప్పుడలా.. ఇప్పుడిలా
నటుడిగా కెరీర్ ప్రారంభించి, దర్శకుడిగా మారిన వారిలో అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘ఆరెంజ్’, ‘పిల్ల జమీందార్’ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన తొలిసారి ‘ఊహలు గుసగుసలాడే’ కోసం మెగాఫోన్ పట్టారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాతా ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు డైరెక్టర్‌గా, రైటర్‌గా పనిచేశారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi).. మార్చి 17న రిలీజ్ అయింది. తన తొలి సినిమా అంతకాకపోయినా ‘ఫ.. ఫ’ యూత్ ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకుంది. ఆ రెండు చిత్రాల్లోనూ హీరో నాగశౌర్య (Naga Shaurya) ప్రధాన పాత్రలో కనిపించగా శ్రీనివాస్ మరో ముఖ్య భూమిక పోషించారు.
దాస్ టు దాస్..
‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది?’.. ఈ రెండు చిత్రాలతో హీరోగా అనుభవం గడించిన విశ్వక్‌సేన్ (Vishwak Sen) మూడో సినిమాకే దర్శకత్వం వహించారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన ఫస్ట్ మూవీ ‘ఫలక్‌నుమా దాస్’ యూత్‌లో విశేష క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా..!’ తదితర సినిమాల్లో కథానాయకుడిగా సందడి చేసిన విశ్వక్.. ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) కోసం మరోసారి దర్శకత్వ బాధ్యత తీసుకున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు పార్వ్శాలున్న పాత్రలో ఒదిగిపోయి అటు నటుడిగా, కథను ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడిగా మంచి మార్కులు పొందారు.
అందరి చూపు రిషబ్ వైపు..
‘కాంతార’ (Kantara)తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక- నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty). కర్ణాటక తుళునాడు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారుల గురించి చాటి చెప్పే ఆ కథ అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకట్టుకుంది. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ. 400 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలోని రిషబ్ నటన అత్యద్భుతం. టేకింగ్ విషయంలోనూ ఆయన ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఆ చిత్రానికి ప్రీక్వెల్ (కాంతార కథ ఎక్కడైతే మొదలైందో దానికి ముందు జరిగిన కథ) ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ‘తుగ్లక్’, ‘లూసియా’తదితర కన్నడ చిత్రాల్లో నటుడిగా కనిపించిన రిషబ్ ‘రిక్కీ’తో తనలోని దర్శకుణ్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించినా అందులో ఆయన నటించలేదు.
చిన్న పాత్రలతో మొదలై..
చిన్న పాత్రలతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన సముద్రఖని (Samuthirakani) దర్శకుడిగానూ కోలీవుడ్, టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఎంత బిజీగా ఉన్నా డైరెక్టర్‌గాను కొన్ని కథల్ని తెరపైకి తీసుకొచ్చారు. ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ తదితర సినిమాలతో డైరెక్టర్‌గా మెప్పించిన ఆయన ప్రస్తుతం #PKSDTని తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో ఆ చిత్రం రూపొందుతోంది. గతంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో నటించిన తమిళ సినిమా ‘వినోదాయ సీతాం’ (Vinodhaya Sitham) రీమేక్‌గా ‘పీకేఎస్‌డీటీ’ రానుంది (ఈ ఏడాది జులై 28న విడుదల).
ఈ దర్శకులకు భలే క్రేజ్
ప్రముఖ హీరో అర్జున్ (Arjun Sarja) 90ల్లోనే పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ డైరెక్టర్‌గా రాణిస్తున్నారాయన. విశ్వక్‌సేన్ హీరోగా ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించగా.. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న విభేదాల వల్ల అది ఆగిపోయింది. మరి, ఈ కథను ఏ హీరోతో తెరకెక్కిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రముఖ కథానాయకుడు మోహన్‌బాబు (Mohan Babu) త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని, అందులో ఆయన పవర్‌ఫుల్ రోల్ ప్లే చేయనున్నారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దానిపై అధికారిక ప్రకటనలేదు. ‘ఖుషి’, ‘నాని’, ‘కొమరం పులి’ తదితర చిత్రాలతో డైరెక్టర్ ఎస్. జె. సూర్య (SJ Surya).. ‘ఘర్ణణ’, ‘ఏమాయ చేశావే’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తదితర సినిమాలతో అలరించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) ప్రస్తుతం నటులుగానూ దూసుకెళ్తున్నారు. వైవిధ్య భరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. విశేష క్రేజ్ సంపాదిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్