Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!

‘ఊ అంటావా మావా’ పాటతో సమంత ఇటీవల ఎంత మత్తెక్కించిందో ఇప్పుడు ‘నా పేరు సీసా’ అంటూ అన్వేషి జైన్‌  అంతే కిక్కేక్కిస్తోంది. ‘సీకాకుళం సారంగి’గా తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగిస్తోంది.

Updated : 05 Jul 2022 10:04 IST

ఎన్నో అవరోధాలు దాటి.. కోట్లమంది హృదయాలు గెలిచి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఊ అంటావా మావా’ పాటతో సమంత ఇటీవల ఎంత మత్తెక్కించిందో ఇప్పుడు ‘నా పేరు సీసా’ (Naa Peru Seesa) అంటూ అన్వేషి జైన్‌ (Anveshi Jain) అంతే కిక్కేక్కిస్తోంది. ‘సీకాకుళం సారంగి’గా తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగిస్తోంది. ఒకే ఒక్క పాటతో తన గురించి తెలుసుకునేలా చేస్తోంది. ఈ క్రమంలో అన్వేషి పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. తెరపై కనిపిస్తున్న ఆమె హుషారైన డ్యాన్స్‌ వెనక చాలామందికి తెలియని ఎన్నో విషాద సంఘటనలు దాగున్నాయి. ఓ సందర్భంలో అన్వేషి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారిలా..

పాఠాలు చెప్పాల్సినవాడు తప్పు చేశాడు

‘‘చాలామంది ఆడపిల్లల్లా నేనూ బాల్యంలోనే శారీరక వేధింపులకు గురయ్యా. నా శరీరాన్ని చూసి కొందరు దుర్భాషలాడేవారు. అప్పుడు నాకేం తెలియదు కాబట్టి వారిని ఏమీ అనలేకపోయా. యవ్వనంలోనూ ఇదే పరిస్థితి. పదో తరగతి చదివే రోజుల్లో జెంటిల్‌మ్యాన్‌లా కనిపించే ఓ వ్యక్తి.. ‘నిన్ను ఎక్కడ తాకాలి?’ అంటూ నా(Anveshi Jain) బుగ్గపై, నడుముపై చేతులేశాడు. అప్పుడతడ్ని నేను కొట్టొచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. కానీ, నేనలా చేయలేదు. పేదవాడు కాబట్టి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో నా పేరెంట్స్‌ అతని దగ్గరకు ట్యూషన్‌కు పంపించేవారు. ‘మీ బంధువు దగ్గరకు నేను ట్యూషన్‌కు వెళ్లను’ అని జరిగిన సంగతి అమ్మానాన్నలకు వివరించాలనుకున్నా. అదీ చేయలేదు. తన కుటుంబం గురించి ఆలోచించి, క్షమించేశా’’

నయంకాని వ్యాధితో..

‘‘కాలం గడిచే కొద్దీ నా(Anveshi Jain) శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2012లో నా రొమ్ములో పెద్ద గడ్డ ఏర్పడింది. వైద్యుల్ని సంప్రదిస్తే ఇదో వ్యాధి అని చెప్పారు. మరో రొమ్ముకూ అది వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ సమస్య చాలామంది మహిళల్లో కనిపించేదే. కానీ, నయంకానిది. అప్పటి నుంచీ ప్రతి ఆర్నెల్లకు ఆస్పత్రికి వెళ్లి క్యాన్సర్‌ కణాలు ఏమైనా వృద్ధి చెందుతున్నాయేమోనని పరీక్ష చేయించుకునేదాన్ని. ఈ విషయం తెలియని వారు ఏవేవో ఊహించుకుంటూ బాడీపై కామెంట్‌ చేసేవారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు’’

ఇల్లు దగ్ధమైంది

‘‘ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కొన్నాళ్లు కొన్ని ఈవెంట్లకు హోస్ట్‌(Anveshi Jain)గా వ్యవహరించా. 2014 ఫిబ్రవరి 14న నేను ఓ సంగీత్‌ వేడుకను హోస్ట్‌ చేస్తున్న సమయంలో నా రూమ్‌మేట్‌ నుంచి కాల్‌ వచ్చింది. బిజీగా ఉండటం వల్ల ఫోన్‌ చెక్‌ చేసుకోలేదు. ఫంక్షన్‌ పూర్తయ్యాక చూస్తే 22 మిస్డ్‌కాల్స్‌ ఉన్నాయి. నేను కాల్‌బ్యాక్‌ చేసేలోపు తనే మళ్లీ చేసింది. ‘అన్వేషీ మీ ఇంటికి మంటలు వ్యాపించి, కాలిపోయింది’ అని తను చెప్పగానే షాకయ్యా’’

ముంబయి చేరుకున్నా..

‘‘ఇల్లు దగ్ధమవడంతో ఓ హోటల్‌లో తలదాచుకుందామని నా స్నేహితులు, తెలిసిన వారికి ఫోన్‌ చేసి డబ్బు కావాలని అడిగా. ఫలితం లేదు. ఏటీఎమ్‌కు వెళ్లి రూ.3 వేలు డ్రా చేసేందుకు ప్రయత్నించా. ఎంతకీ మనీ రాలేదు. కారణం నా(Anveshi Jain) ఖాతాలో రూ.850 మాత్రమే ఉండటం. ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని రూ. 850ని తీసుకుని, మా ఇంటికి చేరుకున్నా. ఆ కాలిపోయిన ఇంటి ముందే నిల్చొని, నవ్వుతూ ఓ ఫొటోకి పోజిచ్చా. నేనెందుకు అలా చేశానో అప్పుడు అక్కడున్న ఎవ్వరికీ అర్థంకాలేదు. ‘ఇప్పుడు చేస్తున్న పని సరిపోదు. జీవితంలో ఏదో సాధించాలి’ అనుకుని ఇల్లు విడిచి ముంబయి వెళ్లిపోయా’’

నేనేంటో తెలుసుకున్నా..

‘‘నా జీవితంలోని ఓ కొత్త అధ్యాయానికి ముంబయి నాంది పలికింది. ముందుగా ఆ నగరంలోని ఓ చిన్న ఇంట్లో మూడు నెలలు అద్దెకున్నా. అదే నివాసంలో ఉండే కొందరు నన్ను ప్రోత్సహించారు. ప్రతి విషయంలోనూ తోడుగా నిలిచారు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వెళ్లాలని అక్కడే నిశ్చయించుకున్నా(Anveshi Jain). కానీ, మనం అనుకున్నంత తేలికగా ఏదీ జరగదు కదా. ముంబయికి వెళ్లిన కొన్ని నెలల్లో బరువు పెరిగా. కాస్త బొద్దుగా కనిపిస్తున్నానంటూ 700లకు పైగా ఆడిషన్స్‌లో తిరస్కరించారు. ప్రారంభంలో బాధపడినా తర్వాత దాన్నుంచి తేరుకున్నా. అన్నింటి కంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమైందని తెలుసుకున్నా’’

ప్రేమ పేరుతో మోసపోయా..

‘‘తర్వాతర్వాత మనిషి సైకాలజీని చదవడం ప్రారంభించా. కానీ, ప్రేమ పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసాన్ని పసిగట్టలేకపోయా. ఓ అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి డేటింగ్‌ చేస్తే చివరకు నన్ను వదిలేశాడు. ఆ బాధ వర్ణనాతీతం. పదే పదే దాని గురించే ఆలోచనలు వస్తుంటే వాటిని తట్టుకోలేక మానసిక వైద్యురాలిని కలిశా. తీవ్ర ఒత్తిడి గురవుతున్నానని విశ్రాంతితోపాటు మందులు వాడాలని ఆమె సూచించారు. ‘మేడమ్‌ మిమ్మల్ని నెల రోజుల్లో మళ్లీ కలుస్తా’ అని చెప్పి మెడిసిన్‌ తీసుకోకుండా వెళ్లిపోయా. ఆత్మ పరిశీలన చేసుకున్నా. అద్దంలో నా(Anveshi Jain) రూపాన్ని చూసుకుంటూ ‘నువ్వో అద్భుతం. నిన్ను చూసి నేను గర్వపడుతున్నా. తెలిసో తెలియకో నువ్వు చేసిన తప్పుల్ని మన్నిస్తున్నా. జరిగింది మర్చిపో. ఇకపై ఏం చేయాలో దాని గురించే ఆలోచించు’ అని జీవితంలో మరో ముందడుగేశా. తర్వాత, ఆ డాక్టర్‌ను కలిసే అవకాశం రాలేదు’’

నమ్మకం పెరిగింది..

‘‘ప్రేమ, ఇతర కారణాల వల్ల మనసు గాయపడిన వారిలో ఉత్సాహం నింపేలా వీడియో బ్లాగింగ్‌ మొదలుపెట్టా. అలా నా(Anveshi Jain) ఫేస్‌బుక్‌ ఖాతా సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రత్యక్షంగా వందలమందిలో, పరోక్షంగా కోట్ల మందిలో మార్పు తీసుకొచ్చినందుకు నాపై నాకు నమ్మకం పెరిగింది. మరోవైపు, 90 రోజుల స్వీయ ఛాలెంజ్‌ను స్వీకరించి, కఠోర వ్యాయామాలు చేసి బరువు తగ్గా. మళ్లీ సినీ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఓరోజు బాలీవుడ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ బాలాజీ సింగ్‌ కాల్‌చేసి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిగా ఎంపికయ్యానని చెప్పారు. అంతే, అనుకున్న గమ్యం చేరుకోవడంతో నా ఆనందం అంబరాన్నంటింది. ఆ సిరీసే మీరెంతగానో ఆదరించిన ‘గందీ బాత్‌ -2’’ (Gandii Baat 2) అంటూ తన జీవితంలోని ఊహించని మలుపుల గురించి చెబుతారు అన్వేషి జైన్‌.


అన్వేషి నటనకు ఫిదా అయిన వారంతా వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అలా.. గూగుల్‌లో (2019) ఎక్కువ మంది అన్వేషించిన మహిళగా(Anveshi Jain) నిలిచారు. 1991 జూన్‌ 1న మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జన్మించిన అన్వేషి భోపాల్‌లోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ‘గందీ బాత్‌’ తర్వాత ‘హూజ్‌ యువర్‌ డాడీ’, ‘బాస్‌: బాప్‌ ఆఫ్‌ స్పెషల్‌ సర్వీసెస్‌’ తదితర సిరీస్‌లతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ‘జి: ది ఫిల్మ్‌’ అనే గుజరాతీ చిత్రంలోనూ నటించారు. ‘కమిట్‌మెంట్‌’ అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ‘సీసా’ సాంగ్‌తో మరింత దగ్గరయ్యారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty) చిత్రంలోని గీతమిది. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 29న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని