Sai Pallavi: నటిగా నన్ను స్వీకరిస్తారా అనే భయం ఉండేది: సాయి పల్లవి
నటి సాయి పల్లవి (Sai pallavi) పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. వివిధ సందర్భాల్లో ఆమె పంచుకున్న విశేషాలు.
అందం కాదు.. అభినయం ప్రధానం అనుకుంటుందామె. గ్లామర్ పాత్రలకంటే గ్రామర్ పాత్రలకే ఓటు వేస్తుందామె. ఆ పాజిటివ్ దృక్పథంతోనే మేకప్ లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రలకు ప్రాణం పోసింది. ‘ప్రేక్షకులు నటిగా నన్ను స్వీకరిస్తారా?’ అనే సందేహంతో కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమే సాయి పల్లవి (Sai pallavi). మే 9 ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. వివిధ సందర్భాల్లో ఆమె పంచుకున్న విశేషాలు మీకోసం..
డ్యాన్స్ అంటే ఇష్టం..
‘‘మాది ఊటీకి దగ్గరలో ఉన్న కోటగిరి గ్రామం. కోయంబత్తూర్‌లో చదువుకున్నా. నాన్న సెందామరై కన్నణ్, కస్టమ్స్ అధికారి. అమ్మ రాధ, నాట్యకారిణి. నేనూ చెల్లెలు పూజా కవల పిల్లలం. అమ్మ చేసే నృత్యం చూస్తూ పెరగడంతో మాకూ నాట్యంపై ఆసక్తి పెరిగింది. పాఠశాల రోజుల నుంచే నృత్య కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లం. నా డ్యాన్సు చూసిన ఓ సినిమా ఏజెన్సీ వాళ్లు చిన్న పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. నాకు లెక్కలు అంటే చాలా భయం. ఆ క్లాస్ నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో సినిమా విషయం అమ్మకి చెప్పి ఒప్పించా’’
అందుకే జార్జియాకి వెళ్లాల్సి వచ్చింది..
‘‘అలా తెరపై తొలిసారి ‘ధామ్ ధూమ్’ (తమిళం)లో కంగనా రనౌత్ పక్కన కనిపించాను. మరో తమిళ సినిమాలో మీరా జాస్మిన్ క్లాస్‌మేట్‌గా నటించాను. ఆ తర్వాత నటనకు విరామం ఇచ్చి డ్యాన్సు షోలపై దృష్టి పెట్టాను. తమిళంలో స్టార్ విజయ్, తెలుగులో ఈటీవీ నిర్వహిస్తోన్న రియాలిటీ షోల్లో (ఢీ) అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కోయంబత్తూర్‌లో నేనో వీఐపీని అయిపోయాను. నలుగురు నన్ను అభిమానిస్తుంటే ఆనందంగా ఉండేది. వాళ్ల అభినందల కోసం మరింత కష్టపడేదాన్ని. అప్పుడు నాయికగా చేయమంటూ ఎందరో దర్శకులు అడిగారు. అమ్మానాన్న నో చెప్పారు. ‘నాయికగా కెరీర్ కొన్నాళ్లు బాగానే ఉంటుంది. ఆదరణ తగ్గాక ఏం చేస్తావ్’ అని వాళ్లు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు. నేనిక్కడుంటే మళ్లీ సినిమా అంటానని దానికి దూరంగా ఉండేందుకు జార్జియాలో మెడిసిన్‌లో చేర్పించారు’’
అయినా ఆసక్తి ఊరుకోనిస్తుందా..
‘‘వైద్య విద్యనభ్యసించడంలో నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. నటి అవ్వాలనే ఆసక్తి మాత్రం అలానే ఉంది. ఓ సారి దర్శకుడు అల్ఫోన్స్ తానో కొత్త చిత్రం తెరకెక్కిస్తున్నానని, అందులో నటించాలని మెయిల్ చేశారు. స్కిప్టు నాకు బాగా నచ్చింది. సెలవుల్లో మాత్రమే నటించు అని నాన్న షరతు పెట్టారు. అదే ‘ప్రేమమ్’ (మలయాళం). దాని తర్వాత ‘కలి’ అవకాశం వచ్చింది. మరోవైపు నా మెడిసిన్ కూడా పూర్తయింది. ఆ తర్వాతే తెలుగులో ‘ఫిదా’ చేశాను. అప్పటి నుంచి మీకు తెలిసిందే కదా’’
నా దృష్టిలో గ్లామర్ అంటే..
‘‘గ్లామర్ అనే పదానికి ఒక్కొక్కరూ ఒక్కో అర్థం చెబుతారు. నా దృష్టిలో గ్లామర్ అంటే నేను ఎంపిక చేసుకున్న పాత్ర ప్రేక్షకులకి చేరువవడం. ‘ప్రేమమ్’ సమయంలో ప్రేక్షకులు నన్ను కథానాయికగా స్వీకరిస్తారా, లేదా? అనే భయం ఉండేది. ముఖంపై మొటిమలతో తెరపై ఎలా కనిపిస్తానో అనుకునేదాన్ని. నాకు నేనే నచ్చడం లేదు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారా? అనే ప్రశ్న నన్ను వేధించేది. అన్నింటిని పక్కన పెట్టేసి చివరకు నటించాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాయి పల్లవి హీరోయిన్‌లా కాకుండా మనింటి అమ్మాయిలా కనిపించిందన్నారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నాకే కాదు నాలాంటి అమ్మాయిలకి కూడా. నేను సంతకం చేసిన ప్రతి చిత్ర దర్శకుడు ఒకట్రెండు రోజులు మేకప్ వేసుకోమంటారు. తర్వాత మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించడం లేదు, తీసేయమని చెబుతుంటారు. అందుకే మేకప్‌కి దూరంగా ఉంటూ.. పాత్రకి దగ్గరగా ఉంటా’’
ఆ సందర్భం మరిచిపోలేను..
నేను అల్లు అర్జున్ (Allu arjun) డ్యాన్సుకి పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే ఓ సందర్భంలో ‘ఫిదా’లోని వచ్చిండే పాట ఎన్నో సార్లు చూశానని, నా డ్యాన్సుని ప్రశంసించడం చెప్పలేనంత సంతోషానిచ్చింది.
వ్యాపార ప్రకటనలకు దూరంగా..
మరి ప్రేక్షకుల్లో ఇంత క్రేజ్ ఉన్నా సాయి పల్లవి ఏ వ్యాపార ప్రకటనలో ఎందుకు కనిపించలేదు? అనే సందేహం చాలామందికి రావొచ్చు. దానికి ఇలా సమాధానం చెబుతుందామె.. ‘‘వాణిజ్య ప్రకటనలో నటించడం నాకు ఇష్టం లేదు. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలైతే పారితోషికం తీసుకోకుండా చేశాను. అది చాలా తక్కువ మందికి తెలుసు’’
మరికొన్ని సంగతులు..
* సాయి పల్లవి నటి, డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి హర్డిల్స్ ప్లేయర్.
* నటుడు సూర్య అంటే ఎంతో అభిమానం.
* రన్నింగ్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం. పాత్ర డిమాండ్ చేస్తే రాకెట్ కంటే వేగంగా పరిగెట్టేస్తా అంటుంటుంది.
* హారర్ చిత్రాలు చూడాలంటే పల్లవికి భయం.
* ఖాళీ సమయంలో డ్రైవింగ్ చేస్తుంది. సీతాకోక చిలుకల్ని పట్టుకుని వదిలేస్తుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Niranjan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై విపక్షాలది దుష్ప్రచారం: నిరంజన్‌రెడ్డి
-
Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్