Updated : 13 Aug 2022 21:24 IST

Alfred Hitchcock: సస్పెన్స్‌ సినిమాల మంత్రగాడు.. ఆల్ర్ఫెడ్‌ హిచ్‌కాక్

ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌.. మాటల్లేకుండానే తన సినిమాతో భావాలను పలికిస్తాడు. కెమెరా కదలికలను కళ్లతో అన్వయించినట్లు సన్నివేశాన్ని తీర్చిదిద్దుతాడు. ప్రేక్షకుల్ని సీటు చివర్లో కూర్చోబెట్టి.. భయానక దృశ్యాలతో ఉత్కంఠ రేకెత్తిస్తాడు. సినిమా చూసిన ప్రేక్షకుడు కొత్త అనుభూతి పొందేలా తెరపై మాయ చేస్తాడు. అందుకే ‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’ గా సినీ దిగ్గజాలు సైతం ఆయన్ని కీర్తిస్తారు. ఆగస్టు 13న హిచ్‌కాక్‌ జయంతి సందర్భంగా హిచ్‌‘క్రాఫ్ట్‌’కు సంబంధించిన విశేషాలు కొన్ని...

 

 1. ‘సర్‌ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్‌’ 1899, ఆగస్టు13న లండన్‌లో జన్మించారు. టైటిల్‌ కార్డ్‌ డిజైనర్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు.
 2. దర్శకుడిగా హిచ్‌కాక్‌ మొదటి సినిమా ‘నంబర్‌ 13’ (1922). మూకీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ఫిల్మ్‌, ఫొటోలు నేడు అందుబాటులో లేవు. తన తొలి సినిమాపై ప్రేక్షకులకు ఆ మాత్రం ఆసక్తి ఉండాలని తర్వాతి కాలంలో హిచ్‌కాక్‌ వాటన్నంటినీ మాయం చేయించాడని అంటారు.
 3. ఇంగ్లాండ్‌లో తొలి టాకీ సినిమా తీసింది హిచ్‌కాక్‌. ‘బ్లాక్‌మెయిల్‌’ (1929) అనే థ్రిల్లర్‌ చిత్రంతో మొదటి టాకీ సినిమా తీసి ఘన విజయం సాధించాడు. అప్పటికే 11 మూకీ సినిమాలు తీసి థ్రిల్లర్‌, సస్పెన్స్‌ డ్రామాలను తీయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.
 4. 1938లో తీసిన ‘ది లేడీ వానిషెస్‌’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా గొప్పతనాన్ని విశ్లేషిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘అమెరికాలో లేని, ఇంగ్లాండ్‌లో ఉన్న మూడు గొప్ప సంపదలు ఒకటి మాగ్నా కార్టా, రెండు టవర్‌ బ్రిడ్జ్‌, మూడోది ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ అనే ఫిల్మ్‌ మేకర్‌’ అని కొనియాడింది. ఈ సినిమా హిచ్‌కాక్‌ హాలీవుడ్‌ వైపు నడిచేలా చేసింది.
 5. 1939లో అమెరికాకు చేరుకున్న హిచ్‌కాక్‌ అప్పటి హాలీవుడ్‌ ప్రముఖ ప్రొడ్యూసర్‌ డేవిడ్‌ సెల్జినిక్‌తో 7 సంవత్సరాల ఒప్పందం చేసుకున్నారు. సినిమాకి నలభై వేల డాలర్ల పారితోషికం తీసుకున్న హిచ్‌కాక్‌ అప్పట్లో చాప్లిన్‌ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే ఫిల్మ్‌ మేకర్‌గా నిలిచారు. ఆ సమయంలోనే ఆస్కార్‌ అకాడమీ బెస్ట్‌ పిక్చర్‌గా నిలిచిన ‘రెబెక్కా’(1940)ని ఈయనే చిత్రీకరించారు.
 6. సినిమా తీయడంలో ప్రత్యేక శైలిని చూపించే హిచ్‌కాక్‌ తన స్క్రిప్టుని పక్కాగా సిద్ధం చేసుకునేవారట. ఒక హిట్‌ సినిమా తీయడానికి దర్శకుడికి కావల్సిన ప్రధాన అంశం స్క్రిప్టేనని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు. సన్నివేశానికి తగినట్లు కెమెరాని ఎలా కదిలించాలి? అనే అంశం మీద దృష్టిపెట్టిన మొదటి దర్శకుడిగా సినీపండితులు హిచ్‌కాక్‌ పేరే చెబుతారు.
 7. హిచ్‌కాక్‌ ఎక్కువగా నవలలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీసేవారు. సస్పెన్స్‌ నవలలను మరింత ఉత్కంఠభరితంగా మలిచేవారు. కానీ, ఒక్కసారి ఆ హక్కులు పొందాక ఒక్క నవల కూడా ముద్రితమవ్వకుండా జాగ్రత్త పడేవారట. అలా చాలాసార్లు తాను చిత్రిస్తూ, అప్పటికి అందుబాటులో ఉన్న నవలలను తగలబెట్టించారని హిచ్‌కాక్‌పై ఒక వదంతు ప్రచారంలో ఉంది.
 8. హిచ్‌కాక్‌ సినిమాల్లో హీరోయిన్‌లు అంతా గ్రే కలర్‌ జుట్టులో కనిపిస్తారు. అది పాజిటివిటీకి నిదర్శనంగా ఈయన నమ్మేవారట. అలాగే బ్లాక్‌ హెయిర్‌ని భయానక సన్నివేశాలకు తార్కాణంగా చూపేవారు. అందుకే ఆయన సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించిన వ్యక్తులు ఎక్కువగా నలుపు జుట్టుతో కనిపిస్తారు.
 9. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలకు ఆద్యుడిగా పేరుపొందిన హిచ్‌కాక్‌కు కోడిగుడ్లంటే చాలా భయమట. చాలా సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. చిన్న గుడ్డులో ఒక ప్రాణి ఉందన్న విషయమే తనను ఎక్కువ భయపడేలా చేసేదని అనేవారు. ఆయన సినిమాల్లో సైతం గుడ్లు లేకుండా జాగ్రత్తపడేవారు.
 10. హిచ్‌కాక్‌ తెరకెక్కించిన సినిమాల్లో పోలీసులు వెంటాడే సీన్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అంశాన్ని ఆయన తన జీవితం నుంచే తీసుకున్నారట. చిన్నతనంలో ఒకసారి అల్లరి చేశాడని హిచ్‌కాక్‌ తండ్రి ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి భయపెట్టారట. అప్పట్నుంచి పోలీసులంటే భయమని అందుకనే వారు వెంటాడే సీన్లను ప్రత్యేకంగా చూపిస్తానని ఆయన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ది రాంగ్‌ మ్యాన్‌(1956), వెర్టిగో(1958), సైకో(1960)లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఈ అంశాన్ని మనం గమనించవచ్చు.
 11. 1960 వరకు హాలీవుడ్‌ సినిమాల్లో బాత్రూమ్స్‌ని చూపించడం నేరం. అటువంటి సీన్లను సెన్సార్‌ వాళ్లు తొలగించేవారు. కానీ, హిచ్‌కాక్‌ సైకో(1960)తో ఆ నిబంధనని ఉల్లంఘించారు. హీరోయిన్‌ హత్య జరిగే సీన్‌ని బాత్రూంలో చిత్రీకరించింది, దాని ప్రచారం కోసం తానే ఒక ప్రత్యేక సీన్‌లో నటించారు. అది కూడా బాత్రూమ్‌ సీనే. ఈ సినిమా తరువాత బాత్రూమ్‌లో హత్య ఉన్న సీన్లు హాలీవుడ్‌ సినిమాలలో సాధారణం అయిపోయాయి.
 12. మార్చి12న ‘ఆల్ఫ్రెడ్‌ హిచ్‌ కాక్‌ డే’గా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజుని ‘సస్పెన్స్‌ హాలీడే’గా నిర్ధారించింది. ప్రపంచంలో ఏ దర్శకుడికి దక్కని గౌరవం ఇది. కానీ ఆ రోజునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. అదే హిచ్‌కాక్‌ స్పెషల్‌ అని ఆ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు.
 13. ఉత్తమ దర్శకుడిగా అయిదు సార్లు అస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ఒక్కసారి ఆ అవార్డును అందుకోలేకపోయారు. 1968లో అస్కార్‌ ప్రత్యేక అవార్డును పొందిన ఈయన ‘థాంక్యూ వెరీమచ్ ఇండీడ్’ అని తన ప్రసంగాన్ని ముగించారు. ఆస్కార్‌ చరిత్రలోనే తక్కువ నిడివి ఉన్న ప్రసంగంగా ఇది నిలిచిపోయింది.
 14. దాదాపు 60 సినిమాలు తీసిన హిచ్‌కాక్‌ దర్శకుడిగా ఆరు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. 1980లో ఇంగ్లాండ్‌ బహుకరించే అత్యున్నత అవార్డు ‘నైట్‌హుడ్‌’ని హిచ్‌కాక్‌ అందుకున్నారు. ఆ ప్రదానోత్సవంలో విలేకర్లు ‘ఇంత ఆలస్యంగా ఈ అవార్డుని అందుకోవడానికి కారణమేంటి?’ అని ప్రశ్నించగా ‘ఆమెకు(ఇంగ్లాండ్‌ రాణి) నేను గుర్తు రాలేదేమో’ అని చమత్కరించారు.
 15. ఇంటర్నేషనల్‌ మూవీ డేటాబేస్‌(ఐ.ఎం.డీ.బి) ఎంపిక చేసిన ‘ఆల్‌ టైం గ్రేట్ డైరెక్టర్స్‌’ జాబితాలో ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. 20వ శతాబ్దపు వంద ఉత్తమ చిత్రాల్లో ఎనిమిది హిచ్‌కాక్‌ సినిమాలే. ఇంకా ఎన్నో అంతర్జాతీయ సర్వేల్లో గొప్ప దర్శకుల జాబితాలోనూ హిచ్‌కాక్‌ నిలిచారు. ప్రముఖ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లు సైతం ఆయన సినిమాలను తమ కోర్సుల్లో భాగం చేసుకున్నాయి. ఆయన ప్రత్యేక శైలి సినిమాల తీసే విధానంలో నూతన ఒరవడిని సృష్టించింది. హిచ్‌కాక్‌ లేకపోతే ఆధునిక సినిమా పోకడ వేరేలా ఉండేదని ఎందరో గొప్ప దర్శకులు అభిప్రాయపడ్డారు.
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని