Balagam: మట్టి పరిమళాలు.. గట్టి బంధాలు.
స్టార్‌లు లేరు...అయినా సినిమా ఆడుతోంది... భారీ పోరాటాలు, ఒంపు సొంపుల వయ్యారాల పాటలు లేవు....అయినా సినిమాని జనం చూస్తున్నారు.. రూ.వందల కోట్ల బడ్జెట్ అసలే కాదు....అయినా సినిమా బాగా వచ్చింది... మరి ఏముందని సినిమా హిట్టయ్యింది? బలమైన కథ ఉంది...భావోద్వేగాల మనసు తడి ఉంది... అదే మన మూలాల్ని బలంగా ఆవిష్కరించిన ‘బలగం’ సినిమా.
మన మూలాల బాటలో తెలుగు సినిమా పయనం
తాజా విజయం ‘బలగం’
తెలంగాణ పల్లెజీవనాన్ని ఆవిష్కరించిన చిత్రం
కొత్త దర్శకులకు స్ఫూర్తి మార్గం
స్టార్‌లు లేరు...అయినా సినిమా ఆడుతోంది... భారీ పోరాటాలు, ఒంపు సొంపుల వయ్యారాల పాటలు లేవు....అయినా సినిమాని జనం చూస్తున్నారు.. రూ.వందల కోట్ల బడ్జెట్ అసలే కాదు....అయినా సినిమా బాగా వచ్చింది... మరి ఏముందని సినిమా హిట్టయ్యింది? బలమైన కథ ఉంది...భావోద్వేగాల మనసు తడి ఉంది... అదే మన మూలాల్ని బలంగా ఆవిష్కరించిన ‘బలగం’ సినిమా.
ఊరు ఊరంతా రచ్చబండ దగ్గర చేరి సినిమా చూసి ఎంత కాలమైందీ?
చిన్న పెద్ద ఆడ మగా అనే తేడా లేకుండా... ‘ఇది మన కథ’ అని చెప్పుకున్న సినిమా వచ్చి ఎంతకాలమైందీ? ఇది ఓటీటీ జమానా. చేతిలోని సెల్‌ఫోన్ చూస్తూ వినోదాన్ని ఆస్వాదిస్తున్న తరం. ఇంట్లో కూర్చునైన... ప్రయాణాల్లోనైనా కోరుకున్న సినిమాని కోరినప్పుడు చూసేస్తున్నాం. పక్కనే థియేటర్లు... ఇంకొన్ని రోజులు ఓపిక పడితే టెలివిజన్‌లోకి సినిమా. ఇలా ఎన్ని ఉన్నా సరే... ఓ సినిమా మాత్రం ఊరు ఊరంతటినీ రచ్చబండ దగ్గరికి చేర్చింది. నవ్వించింది... ఏడిపించింది. మన బంధాల గొప్పతనాన్ని... మన సంస్కృతి సంప్రదాయాల్ని ఘనంగా చాటి అందరితోనూ ‘ఇది మన సినిమా’ అని ఒప్పుకునేలా చేసింది. అదే... ‘బలగం’. మన బలగం మెచ్చిన సినిమా.
ట్రెండ్... ట్రెండ్... ట్రెండ్
మన సినీ పరిశ్రమకి ఈ మాటే శాసనం. ప్రేక్షకులు ఇవే చూస్తున్నారు కాబట్టి ఇవే తీయాలన్నట్టుగా ఓ ఒరవడి కొనసాగుతూ ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాలు ప్రభావం చూపిస్తున్న ట్రెండ్ ఇది. రూ. వందల కోట్లు ఖర్చుతో సినిమాల్ని తెరకెక్కిస్తున్న ట్రెండ్ ఇది. గ్రాఫిక్స్ మాయాజాలం... మానవాతీతమైన హీరోయిజం... బలమైన తారాగణం.. సాంకేతిక బృందాల కలయికలతో రూపొందుతున్న సినిమాల ట్రెండ్ ఇది. ఈ దశలో ఎవరైనా మన బంధాలు.. భావోద్వేగాల కథ అంటూ సినిమా తీస్తారా? ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకొచ్చే ఆకర్షణ శక్తి ఏమాత్రం లేని నటులతో సినిమా తీస్తారా? అలా తీస్తే వాళ్లు సాహసం చేస్తున్నట్టే లెక్క. అలాంటి ప్రయత్నాల్ని ఓ ప్రయోగంలా లెక్కగట్టి పక్కన పెట్టేస్తున్న కాలం ఇది. కానీ ఓ యువ బృందం మాత్రం అలాంటి లెక్కల్ని పక్కనపెట్టింది. మన మట్టి పరిమళాన్ని... మనవైన బంధాల్ని... మన సంస్కృతిని నమ్మింది. ఆ నమ్మకమే... ‘బలగం’.
చుట్టూ ఎన్నో కథలు
‘‘పిల్లలు ఒక మంచి సినిమా తీశారనే పేరొస్తుందనైతే అనుకున్నాం. మేం తీస్తున్నది ఓ మంచి కథ అని మాకు తెలుసు. కానీ ఈ స్థాయి స్పందనని మాత్రం ఊహించలేదు. మా అంచనాలకి అందని స్పందన ఇది. ఈ రోజుకీ మంచి వసూళ్లు వస్తున్నాయి. మన మూలాల్లోని కథ ఇది. మన చుట్టూనే కథలు ఉన్నాయి. లోకల్ కాన్సెప్టులే ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మెప్పు పొందుతున్నాయి. కొన్నేళ్లుగా ఆ విషయాన్ని చాలా సినిమాలే నిరూపిస్తున్నాయి. అలా మన మూలాల్లోని ఈ కథని, అంతే నిజాయతీగా తెరపైకి తీసుకు రావాలనుకున్నాం. ఆ ప్రయత్నంలో విజయం సాధించాం. దిల్‌రాజు, శిరీష్ సలహాలు, వాళ్ల అనుభవాలు మాకు మేలు చేశాయి. కథ విషయంలోనైనా, నిర్మాణం పరంగానైనా మేం చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. నమ్మిన విషయంపై మరింత ధైర్యంగా ముందుకెళ్లొచ్చనే ఆత్మవిశ్వాసాన్నిచ్చింది ఈ విజయం’’.
హర్షిత్‌రెడ్డి, హన్షిత, ‘బలగం’ నిర్మాతలు
ఊరంతా ఒక్క చోట చేరేలా..!
వారం వారం కొత్త సినిమాలొస్తుంటాయి, పోతుంటాయి. వాటిలోనూ కథ ఉంటుంది, పాత్రలుంటాయి. వినోదం, భావోద్వేగాలు, ఆట పాటలు... ఇలా అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల్లోని పాత్రలే మనల్ని కొన్నాళ్లపాటు వెంటాడుతుంటాయి. ఆ పాత్రలే మనల్ని మనం చూసుకుంటున్న అనుభూతిని కలగజేస్తాయి. అవి పంచే భావోద్వేగాలు హృదయాల్ని తడి చేస్తాయి. పదే పదే గుర్తుకొస్తూ కొన్నాళ్లపాటు ఆ తడిని ఆరకుండా చేస్తాయి. ‘బలగం’ అచ్చం అలాంటి పాత్రలతో రూపొందిన సినిమానే. అగ్ర నటులు... దర్శకులు కలసి చేసిన సినిమాలైనా సరే వారం పది రోజులకి మించి సందడి ఉండదు. కానీ ‘బలగం’ విడుదలై దగ్గర దగ్గర నెల రోజులవుతున్నా... అందులోని కొమురయ్య కుటుంబం ముచ్చట్లు ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. మనిళ్లల్లో కూడా అదే కథ గదనే అంటూ ఆ కుటుంబంతో పోల్చి చూసుకుంటున్నారు ప్రేక్షకులు. ఒక పక్క థియేటర్లలోనూ... మరోపక్క ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది సినిమా. పల్లెటూళ్లల్లోనూ పాత రోజుల్ని గుర్తు చేస్తూ ఊరు ఊరంతా కలిసి ఓ చోట చేరి సినిమాని చూస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల నిండా కనిపిస్తున్నాయి. మంచి సినిమాకున్న శక్తి ఇదీ అని చెప్పకనే చాటి చెబుతోంది.
చావుతో ముడిపెట్టి... మనసుని మెలిపెట్టి
అణువణువూ మట్టి పరిమళాన్ని అద్దుకున్న కథ... ‘బలగం’. తెలంగాణ ప్రాంతం ఈ కథకి నేపథ్యమైనా... దాదాపు తెలుగు లోగిళ్లల్లో ఇంటి మనిషి మరణం మొదలుకొని కర్మలు పూర్తయ్యేవరకు నిర్వహించే ఆచారాలే ప్రధానంగా సాగే కథ ఇది. పిండాన్ని కాకి తినడంతో ముడిపెట్టి... బంధాల చుట్టూ అల్లిన కథ. కొమురయ్య ఇంటి కథ. చిన్న చిన్న కారణాలతోనే విడిపోయి ఎవరికివారు ఒంటరిగా బతుకున్న తన పిల్లలంతా మళ్లీ కలవాలని... ఒకప్పటిలా ప్రేమాభిమానాలతో మెలగాలని ఎదురుచూసిన కొమురయ్య ఆశ నెరవేరిందా లేదా? అనేది ఈ కథ. స్వార్థం, సంకుచిత మనస్తత్వం బంధాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తూనే... మన బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పవో ఈ కథ చాటి చెబుతుంది. తెలంగాణ పల్లెజీవనం, యాసని అచ్చంగా తెరపైన ఆవిష్కరించిన సినిమా. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్, సుధాకర్‌రెడ్డి, జయరామ్, మురళీధర్ గౌడ్, రూపాలక్ష్మి, కృష్ణ తేజ, వేణు ఎల్దండి, స్వరూప, మైమ్ మధు, రచ్చ రవి, రోహిణి, విద్యాసాగర్ తదితరులు నటించారు. ఇందులో పాత్రలే తప్ప నటులెక్కడా కనిపించరు. అంతగా ఒదిగిపోయారు. బీభత్సమైన పోరాటాలు, డ్యాన్యులు ఉండవు. జానపదంలోని గొప్పదనం అడుగడుగునా కనిపిస్తుంది. పల్లె సొగసు, పల్లె జీవితాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో సినిమా ఆరంభంలోని తన పాటతో చాటి చెప్పారు గేయ రచయిత కాసర్ల శ్యాం. హాస్య నటుడిగా 200కిపైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తనయ హన్షిత రెడ్డి, ఆయన సోదరుడి తనయుడు హర్షిత్‌రెడ్డి కలిసి దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. పరిమిత వ్యయంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అద్భుతాలే చేసింది. ఓటీటీలో సినిమా అందుబాటులో ఉన్నా ఇప్పటికీ మంచి వసూళ్లని రాబడుతోంది
పొరుగు భాషలూ మాట్లాడుకుంటున్నాయి
‘‘తెలంగాణ ఆచారాల్లో నోరు చేదు అనేది ఉంది. ఇంట్లో ఒకరు చనిపోతే, ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రక్రియ అది. మా పెదనాన్న చనిపోయినప్పుడు బాధలో ఉన్న మా అన్నయ్యని కలిసేందుకు నేనూ వెళ్లా. మా నాన్న చనిపోయాక కుటుంబ సభ్యులంతా కలవడం, అక్కడ ఏడుపులు, ఓదార్పులు, తాగడాలు, తినడాలు ఇదంతా నాకే కొత్తగా అనిపించింది. ఆ దృశ్యాలన్నీ నా మనసులో అలా నాటుకుపోయాయి. అదే ‘బలగం’ కథకి స్ఫూర్తి. ఈ ఆలోచనపైనే రెండున్నరేళ్లు కష్టపడి కథ తయారు చేసుకున్నా. సినిమాలో కొమురయ్య పాత్ర మా పెదనాన్నని పోలి ఉంటుంది. అదే రుమాలు, అదే తరహా జుబ్బాలో కనిపించేవారు. సిరిసిల్లలో పుట్టి పెరిగినవాణ్ని. ఈ కథని అక్కడే, అదే వాతావరణంలోనే తీయాలనుకున్నా. 57 రోజులు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేశాం. తీస్తున్నప్పుడు కచ్చితంగా ఇదొక విలువైన సినిమా అని ప్రేక్షకులు, పరిశ్రమ నన్ను మెచ్చుకుంటుందని నమ్మా. కానీ ఈ స్థాయి స్పందనని ఊహించలేదు. విడుదలైన తర్వాత రోజు నుంచి మొదలైన ఫోన్ కాల్స్ ఉధృతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఓటీటీలో విడుదలయ్యాక మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చాక ఊళ్లల్లో అందరూ కలిసి చూస్తున్నారు. అది చూస్తున్నప్పుడు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. మా సినిమా ఇలా ఊరంతా కలిసి చూస్తుందా అనే సంతోషం ఉంది. ఇలా చూడటం తప్పు కదా, ఇదే కుటుంబాలు కలిసి థియేటర్‌కి వెళితే నిర్మాతకి మేలు జరుగుతుంది కదా అనేది నా అభిప్రాయం’’.
వేణు యెల్దండి, ‘బలగం’ దర్శకుడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!