Balakrishna: అలాంటి చిత్రం తీయాలని.. ఆ పాత్రల్లో నటించాలని..: బాలయ్య బర్త్‌డే స్పెషల్‌

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు...

Updated : 10 Jun 2023 10:07 IST

ఆయన పేరే అభిమానులకు స్లోగన్‌. ఆయన తొడగొడితే సినిమా పక్కా ‘పైసా వసూల్‌’. ‘సాహసమే జీవితం’ అని భావించే ఆయనకు ‘ఆత్మబలం’ ఎక్కువ. ‘సింహా’ పేరంటే ఆయనకు మక్కువ. ఆ ‘నిప్పులాంటి మనిషి’ ఇంకెవ్వరు? నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). శనివారం పుట్టినరోజు వేడుక చేసుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొన్ని విశేషాలు తెలుసుకుందాం (Happy Birthday NBK)..

 • తెరమీద తెర వెనుక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగలిగే అరుదైన తెలుగు నటుల్లో బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక, జానపదం, సాంఘికం, సైన్స్‌ఫిక్షన్‌.. ఇలా అన్ని జానర్లను టచ్‌ చేసిన అగ్ర కథానాయకుడాయనే. చెంఘీజ్‌ఖాన్‌, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది ఆయన చిరకాల కోరిక.
 • ‘తాతమ్మ కల’తో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ప్రస్తుతం 108వ చిత్రం ‘భగవంత్‌ కేసరి’లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఒక్క రీమేక్‌లో కూడా నటించలేదు.
 • అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించిన హీరోగా బాలయ్యకు రికార్డు ఉంది. 17 సినిమాల్లో ఆయన డ్యూయల్‌ రోల్‌ ప్లే చేశారు. ‘అధినాయకుడు’గా త్రిపాత్రాభినయంలో కనిపించారు.
 • 1987లో.. బాలయ్య సినిమాలు 8 విడుదలవడం ఓ విశేషమైతే.. అవన్నీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టడం మరో విశేషం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో నటించారాయన. తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో కనిపించారు.
 • లక్ష్మీనరసింహ స్వామి  అంటే ఆయనకు అమితమైన భక్తి. సింహా.. పేరు ఆయనకు సెంటిమెంట్‌ అని చెప్పొచ్చు. సింహా పేరు కలిగి.. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రాలన్నీ (సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా, వీరసింహారెడ్డి) సూపర్‌హిట్‌గా నిలిచాయి.
 • 43వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (గోవా) వేడుకకు టాలీవుడ్‌ తరఫున అతిథి హోదాలో వెళ్లిన నటుడాయనే.
 • ‘రూలర్‌’ సినిమాలో బాలయ్య ఫ్రెంచ్‌కట్‌ గడ్డం లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆ గెటప్‌ వెనుక ఆసక్తికర స్టోరీ ఉంది. (Happy Birthday NBK) హాలీవుడ్‌ స్టార్‌ స్టిల్‌ని ఓ అభిమాని ఆయనకు పంపాడు. ‘మిమ్మల్ని ఈ గెటప్‌లో చూడాలని ఉంది’ అని ఆ ఫ్యాన్‌ మనసులో మాట తెలుసుకున్న బాలకృష్ణ.. ‘రూలర్‌’ కోసం విభిన్న గెటప్పులు వేయాలనే ప్రస్తావనరాగా దర్శకుడికి ఫ్రెంచ్‌కట్‌ గురించి చెప్పారు. దీన్ని బట్టి బాలయ్య తన అభిమానుల్ని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు.
 • కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే బాలకృష్ణ.. తన తండ్రిలానే తెల్లవారుజామునే నిద్ర లేచి, పూజ చేయనిదే ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లరు.
 • బాలయ్య భవిష్యత్తులో దర్శకుడిగా మారనున్నారు. ‘ఆదిత్య 999’ కథతో తన కల నెరవేర్చుకోనున్నారు. గతంలో తాను నటించిన ‘ఆదిత్య 369’ని తలపించే ఆ ప్రయోగాత్మక కథాలోచన ఓ రాత్రి తట్టిందట. అంతే తెల్లారేసరికి స్టోరీ సిద్ధమైంది. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ సినిమాలతో ఆయన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలనుకున్నా, సాధ్యపడలేదు.
 • ఓ అగ్ర హీరోతో.. ‘రైతు’ పేరుతో సినిమా తీయాలనుకున్నారు బాలకృష్ణ. సదరు హీరో డేట్స్‌ సర్దుబాటు కాలేదు. (Happy Birthday NBK) ఆయన లేకపోతే సినిమా చేయడం అనవసరం అనిపించి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ‘నర్తనశాల’ విషయంలోనూ అంతే. ఆ కథకు తాను అనుకున్న నటీనటులు ఆ సమయంలో లేకపోవడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారు.
 • నటనతోకాదు తన సింగింగ్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారాయన. ‘పైసా వసూల్‌’ సినిమాలో ‘మామా ఏక్‌ పెగ్‌ లా’ పాటను తనదైన శైలిలో ఆలపించి, అభిమానులను అలరించారు. ఆయనలో మంచి వ్యాఖ్యాత ఉన్నాడని ‘అన్‌స్టాపబుల్‌’ షోతో అందరికీ తెలిసింది. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ సినిమా సమయం నుంచే నిర్మాతగా వ్యవహరించాలనుకున్నా బాలయ్య కోరిక ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రాలతో తీరింది. రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల మన్ననలు పొందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని