Bichagadu 2: టైటిల్‌ని విమర్శించారు.. విజయానికి ఆశ్చర్యపోయారు: దటీజ్‌ ‘బిచ్చగాడు’

స్వీయ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం..

Published : 18 May 2023 10:40 IST

‘శ్రీమంతుడు’, ‘అడవి రాముడు’, ‘రాజకుమారుడు’, ‘నరసింహనాయుడు’ ఇలాంటి పేర్లు పెడితే బాగుంటుందిగానీ ‘బిచ్చగాడు’ (Bichagadu) అని సినిమాకి టైటిల్‌ పెట్టడమేంటి?.. 2016 వేసవిలో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రముఖులు, చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయమిది. ‘ఇదేం టైటిల్‌.. ఇలా ఉంది’, ‘సినిమాకి ఇలాంటి పేరు కూడా పెడతారా?’, ‘ఇది ఆడే సినిమా కాదు’.. ఇలా విడుదలకు ముందే ‘బిచ్చగాడు’ చిత్రం విమర్శలు ఎదుర్కొంది.  అలా నెగెటివ్‌ టాక్‌తోనే రిలీజై ఊహించని ప్రభంజనం సృష్టించింది. ఎండల్లో వసూళ్ల వర్షం కురిపించి.. పేరు బాగోలేదన్న వారిని ఆశ్చర్యపరిచింది. ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2).. ఈ శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా ఓసారి గతంలోకి వెళ్లొద్దాం..

చాలామంది హీరోలు చేయలేమన్నారు..!

‘శీను’, ‘రోజాపూలు’ తదితర రొమాంటిక్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శశి (Sasi) 2013 తర్వాత తల్లీకొడుకుల అనుబంధం ఇతివృత్తంగా ఓ కథ రాసుకున్నారు. దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఎందరో హీరోలను సంప్రదించారు. ‘ఈ సినిమాలో మీది కోటీశ్వరుడి పాత్ర. మీరు చిటికేస్తే చాలు మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి’ అనే కథను దర్శకుడు వివరించి ఉంటే అందరూ అంగీకరించేవారేమో. అయితే, ఈ సినిమాలో హీరో బిలీనియరే అయినా తీవ్ర అనారోగ్యం బారిన పడిన తల్లిని కాపాడుకునేందుకు బిచ్చగాడు అవతారంలోకి మారాల్సి వస్తుంది. మరి, బిచ్చగాడుగా కనిపించేందుకు ఏ స్టార్‌ మాత్రం సాహసం చేస్తాడు. ‘నా కథలో నటించేందుకు ఏ హీరో ముందుకు రావట్లేదే. ఇప్పుడేం చేయాలి?’ అని శశి ఆలోచనల్లో తలమునకలవుతుంటే.. నేనున్నానంటూ విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) ధైర్యాన్నిచ్చారు. అంతకు ముందు తాను దర్శకత్వం వహించిన ‘డిష్యుం’ సినిమాతో విజయ్‌ ఆంటోనీని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు శశి. ఆ స్నేహంతోనే ఆయన విజయ్‌కు స్క్రిప్టు వినిపించారు. అది వింటున్నప్పుడే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న విజయ్‌ సినిమాలో తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నారు. తన భార్య ఫాతిమా నిర్మాతగా సినిమాని ప్రారంభించారు.

అక్కడ హిట్‌.. ఇక్కడ సూపర్‌హిట్‌

తన కథను తెరపై నడిపేందుకు హీరో దొరికాడని శశి ఓ వైపు ఆనందంగా ఉన్నా టైటిల్‌ విషయంలో మథనపడుతుండేవారు. బిచ్చగాడు నేపథ్యమే కథకు కీలకం కాబట్టి అదే పేరును పెట్టాలనుకున్నా పలు కోణాల్లో ఆలోచించి భయపడ్డారు. ‘ఏం కాదు సర్‌.. హీరో పాత్రకు తగ్గ టైటిల్‌ కాబట్టి అదే పెడదాం’ అని విజయ్‌.. శశికి సపోర్ట్‌గా నిలిచారు. అలా ‘పిచైక్కారన్’ (Pichaikkaran) పేరుతో ఈ సినిమా రూపొందింది. ఆ పేరు పెట్టడంపై ఇండస్ట్రీ నుంచే చిత్ర బృందానికి వ్యతిరేకత ఎదురైంది. కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు సినిమా ప్రదర్శనకు అంగీకరించలేదు. అయినా వెనకడుగేయకుండా అదే పేరుతో సినిమాని 2016 మార్చి 4న తమిళనాట విడుదల చేసి, ఘన విజయం అందుకున్నారు. మధ్య తరగతి యువకుడైన హీరో ఒక్కపాటలో ధనవంతుడు అయిపోయే కాన్సెప్ట్‌లను ఎన్నో సినిమాల్లో చూసిన ప్రేక్షకులు.. ‘బిచ్చగాడు’లో లెక్కలేనంత ఆస్తి ఉన్న కథానాయకుడు అమ్మ కోసం భిక్షాటన చేయడమన్న అంశానికి ఆశ్చర్యపోయారు. ఆ ఎమోషన్‌కు బాగా కనెక్ట్‌ అయ్యారు.

ఆ అనుభూతిని తెలుగు ఆడియన్స్‌కు పంచేందుకు దాన్ని రీమేక్‌ చేయాలనుకున్నారు. అందుకు శ్రీకాంత్‌లాంటి ప్రముఖ హీరోలతో చర్చలు జరిపారు. కానీ, అవేవీ కార్యరూపం దాల్చలేదు. అందుకే తెలుగులో డబ్‌ చేసి ‘బిచ్చగాడు’ పేరుతో 2016 మే 13న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కోలీవుడ్‌కి మించిన విజయాన్ని ఇక్కడ సొంతం చేసుకుంది. విజయ్‌ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడేలా చేసింది. కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో తెరకెక్కిన సినిమానైనా చూస్తారని రుజువు చేసింది. తమిళ్‌ వెర్షన్‌ రూ. 16 కోట్లు (సుమారు), తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 కోట్ల (సుమారు) వసూళ్లు సాధించింది. అనువాద సినిమా 100 రోజులకిపైగా ప్రదర్శితమై అంత వ్యాపారం చేయడం గొప్ప. కథతోపాటు విజయ్‌ నటన, పాటలూ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోనీనే సంగీతం అందించడం విశేషం. తెలుగు సినిమాలు ‘మహాత్మ’, ‘దరువు’కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆయనే.

అప్పుడు అంచనాలు లేవు.. ఇప్పుడు భారీగా!

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బిచ్చగాడు’ ఎవరూ ఊహించని హిట్‌గా నిలిచింది. దాంతో, ‘బిచ్చగాడు 2’ను విజయ్‌ ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్‌, ట్రైలర్లతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, టైటిల్‌ ఒకటే అయినా ‘బిచ్చగాడు 2’ (Pichaikkaran) సీక్వెల్‌ కాదని తెలిపారు విజయ్‌. రెండింటిలో కొన్ని అంశాలు ఒకేలా ఉన్నా కథలకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. కె. పళని, పాల్‌ ఆంటోనీలతో కలిసి విజయ్‌ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ కథ రాశారు. దర్శకత్వంతోపాటు సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గాను వ్యవహరించారు. ఆయన భార్య ఫాతిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తల్లి సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘బిచ్చగాడు’లో కోటీశ్వరుడు అరుళ్‌గా కనిపించిన విజయ్‌.. చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందిన ‘బిచ్చగాడు 2’లో విజయ్‌ గురుమూర్తి పాత్రలో.. భారత్‌లో 7వ అత్యంత సంపన్నుడిగా కనిపించనున్నారు. యాంటీ బికిలీ, బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంశాల్ని ఇందులో చూపించనున్నారు. కావ్యా థాపర్‌ కథానాయికగా నటించారు (Bichagadu on May 19th).

ప్రమాదపు అంచును దాటుకొని..

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మలేసియాలోని లంకావి ప్రాంతంలో చిత్రీరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విజువల్స్‌ బాగా రావాలనే ఉద్దేశంతో విజయ్‌ జెట్‌ స్కిని (jet ski) ఫుల్‌ స్పీడ్‌లో డ్రైవ్‌ చేయగా దానిపై పట్టు కోల్పోయారు. బోటు గట్టిగా ఆయన ముఖానికి తగలడంతో దవడ భాగం కిందకు జారింది. ముఖానికి తగిలిన గాయాలు కనిపించుకుండా, దవడను సరిచేయడానికి వైద్యులు సుమారు 9 ప్లేట్లు వేశారట. దాంతో, ఆయన నెలన్నరపాటు ద్రవ పదార్థాలే తీసుకున్నారు. దాన్నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రచారం సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 19న ‘బిచ్చగాడు 2’ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు (Bichagadu Release on May 19th). లార్జర్‌ స్కేల్‌లో తెరకెక్కించిన ‘బిచ్చగాడు 2’.. ‘బిచ్చగాడు’లానే ఆకట్టుకుంటుందని విజయ్‌ నమక్మంతో ఉన్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని