Gabbar Singh: ‘గబ్బర్‌సింగ్‌’ చేయనన్న పవన్‌కల్యాణ్‌.. టైటిల్‌కు స్ఫూర్తి ఆయనే!

పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లోనే కాదు ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే చిత్రం ‘గబ్బర్‌సింగ్’. హిందీ సినిమా ‘దబాంగ్‌’కు రీమేక్‌గా దర్శకుడు హరీష్ శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ సంచలనం.

Published : 12 May 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లోనే కాదు ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే చిత్రం ‘గబ్బర్‌సింగ్’. హిందీ సినిమా ‘దబాంగ్‌’కు రీమేక్‌గా దర్శకుడు హరీష్ శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ సంచలనం. అయితే, ఇందులో నటించేందుకు పవన్‌ అంతగా ఆసక్తి చూపించలేదు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ‘ఎలాగైనా చేయాల్సిందే తప్పదు’ అని అనుకుంటూనే ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఈ సూపర్‌ హిట్‌ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం..

నేను చేయలేనని చెప్పా..

‘‘నేను ‘గబ్బర్ సింగ్‌’ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ‘దబాంగ్‌’ రీమేక్‌ నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2-3 నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు. ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి, యాటిట్యూడ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా, కొత్తదనం ఏముంది..? అని అనిపించి, నేను చేయలేనన్నా. కానీ కొన్ని కారణాలతో తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ‘దబాంగ్‌’ గుర్తొచ్చి మరోసారి చూశా. రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యా. ఈ చిత్రంలోని పోలీసు (కథానాయకుడు) పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేసుకున్నా. ఈ సినిమాలోని హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి. ‘గుడుంబా శంకర్‌’లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా. అందులోని నా స్టైల్‌, వ్యక్తిత్వానికి ‘గబ్బర్‌ సింగ్’లోని పాత్ర దగ్గరగా ఉంటుంది’’ అని ఓ సందర్భంలో పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఆయనే స్ఫూర్తి

‘‘ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు అయినా అందరూ ‘గబ్బర్‌సింగ్‌’ అంటుంటారు. ఈ పేరు పెట్టేందుకు స్ఫూర్తి.. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. అప్పట్లో ఆయన్ని అంతా గబ్బర్‌సింగ్‌ అని పిలిచేవారు. ఆయన్ను నేను చూశా. కానీ, పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది. కొన్ని సినిమాల్లోని పాత్రల్ని చూసినప్పుడు ‘ఫలానా పేరు బాగా సూట్‌ అవుతుంది’ అని అనిపిస్తుంటుంది. అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి ‘గబ్బర్‌సింగ్‌’ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యా’’ అని పవన్‌ వివరించారు.

పవన్‌ స్థానంలో హరీష్‌

ఈ చిత్రంలోని ఓ సీన్‌లో పవన్‌ స్థానంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ కనిపించాడనే విషయం తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ప్రత్యేక గీతం ‘కెవ్వుకేక’ పూర్తవగానే ఓ చెక్‌ పోస్ట్‌ దగ్గర విలన్లను ఆపేందుకు కథానాయకుడు రోడ్డుపై నుంచొనే సీన్‌ అది. రెప్పపాటు కాలం కనిపించే ఆ షాట్‌లో హరీష్‌ కనిపిస్తాడు. తీక్షణంగా పరిశీలిస్తేనేగానీ అక్కడుంది పవనా, హరీషా అని గుర్తించలేం. అంతగా మాయచేశారు.

మరికొన్ని..

* ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీకి చెందిన అంజనా ప్రొడక్షన్స్‌లో చేయాలనుకున్నారు. కానీ, సాధ్యపడలేదు. దాంతో పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌లో రూపొందింది. బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించాడు.

* రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 150 కోట్లు వసూళ్లు చేసిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం 306 కేంద్రాల్లో 50 రోజులకుపైగా, 65 కేంద్రాల్లో 100 రోజులకుపైగా ప్రదర్శితమై, రికార్డు నెలకొల్పింది.

* శ్రుతి హాసన్‌ అందాలు, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని