Heroines: 75 సినిమాలతో షాక్‌ ఇచ్చిన నయనతార.. అనుష్క, సమంత ఎన్ని చేశారంటే?

కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి, ఓ మైలు రాయిని చేరుకుంటారు. ఈ జాబితాలో నిలిచిన అతి తక్కువ మందిలో నయనతార ఒకరు.

Updated : 19 Jul 2022 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి, ఓ మైలు రాయిని చేరుకుంటారు. ఈ జాబితాలో నిలిచిన అతి తక్కువ మందిలో నయనతార ఒకరు. నటిగా రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఆమె ఇటీవల తన 75వ చిత్రాన్ని ఖరారు చేశారు. ఆ సంఖ్య చూడగానే ‘ఈ రోజుల్లో.. హీరోయిన్‌ ఇన్ని సినిమాలు చేయడమా?’ అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే కొందరు అగ్ర హీరోలూ ఆ మార్క్‌ను చేరుకోకపోవడమే కారణం. నయనతార 75 అయితే అనుష్క, సమంత తదితరులు ఎన్ని సినిమాల్లో నటించారో చూద్దాం..

నయన్‌ @2003

‘మానస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో తెరంగేట్రం చేశారు నయనతార (Nayanthara). ‘చంద్రముఖి’, ‘వల్లభ’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ‘లక్ష్మీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శీను’, ‘తులసి’, ‘బిల్లా’, ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘గ్రీకు వీరుడు’ తదితర సినిమాల్లోని విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఓవైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూ మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ లేడీ సూపర్‌ స్టార్‌గా మారారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్’ (God Father), షారుఖ్‌ఖాన్‌ సరసన ‘జవాన్‌’తోపాటు (Jawan) కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. నయన్‌ 75వ చిత్రాన్ని నీలేశ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు.


హీరోయిన్‌ స్నేహితురాలిగా..

హీరోయిన్‌ స్నేహితురాలి పాత్రతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు త్రిష (Trisha). ప్రశాంత్‌, సిమ్రన్‌ జంటగా తెరకెక్కిన ‘జోడి’ చిత్రంతో ఆమె ప్రయాణం 1999లో మొదలైంది. ‘మౌనం పెసియాదే’ అనే తమిళ సినిమాతో నాయికగా మారిన త్రిష ‘వర్షం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే ఘన విజయం అందుకోవడంతో త్రిషకు వరుస అవకాశాలు దక్కాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘అల్లరి బుల్లోడు’, ‘ఆరు’, ‘పౌర్ణమి’, ‘స్టాలిన్‌’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘కృష్ణ’, ‘బుజ్జిగాడు’, ‘తీన్‌మార్‌’, ‘దమ్ము’, ‘పవర్‌’, ‘96’, ‘హే జూద్‌’.. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 56 చిత్రాలు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) సెప్టెంబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా పార్ట్‌ 2, ‘రామ్‌’ (మలయాళం), ‘ది రోడ్‌’ (తమిళ్‌) ఆమె ఖాతాలో ఉన్నాయి.


బాలీవుడ్‌ టు టాలీవుడ్‌

‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’ అనే బాలీవుడ్‌ సినిమాతో 2005లో తెరంగేట్రం చేశారు తమన్నా. అదే ఏడాది ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమమ్యారు. ‘హ్యాపీడేస్‌’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్‌’, ‘బద్రినాథ్‌’, ‘రచ్చ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘రెబల్‌’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘తడాఖా’, ‘ఆగడు’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘ఊపిరి’, ‘అభినేత్రి’, ‘బాహుబలి’, ‘సీటీమార్’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇప్పటి వరకూ తమన్నా 54 సినిమాల్లో కనిపించారు. ‘ఆబక్‌’ అనే మరాఠీ చిత్రంలో అతిథిగా, కన్నడ సినిమాలు ‘జాగ్వార్‌’, ‘కేజీయఫ్‌ 1’లలో ప్రత్యేక గీతాలతో సందడి చేశారు. సత్యదేవ్‌ సరసన తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) త్వరలోనే విడుదలకానుంది. ప్రస్తుతం.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్‌’లో (Bhola Shankar) తమన్నా నటిస్తున్నారు.  ‘ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ’, ‘బబ్లీ బౌన్సర్‌’తో పాటు మరో హిందీ సినిమాతో తమన్నా అలరించనున్నారు.


తొలి ప్రయత్నం ‘సూపర్‌’గా లేకపోయినా

నాగార్జున హీరోగా 2005లో వచ్చిన ‘సూపర్‌’ సినిమాతో అనుష్క శెట్టి (Anushka Shetty) నటిగా కెరీర్‌ ఆరంభించారు. ‘మహానంది’, ‘అస్త్రం’, ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’, ‘డాన్‌’, ‘ఒక్క మగాడు’, ‘స్వాగతం’, ‘చింతకాయల రవి’, ‘బిల్లా’, ‘వేదం’, ‘ఖలేజా’, ‘మిర్చి’, ‘బాహుబలి’.. ఇలా టాలీవుడ్‌ అగ్ర కథానాయకులందరితోనూ ఆమె ఆడిపాడారు. కెరీర్‌ ప్రారంభంలోనే చిరంజీవి సరసన ఓ ప్రత్యేక గీతంలో (స్టాలిన్‌) నర్తించి, డ్యాన్సర్‌గానూ పేరొందారు. తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకూ అనుష్క నటించిన సినిమాల సంఖ్య: 39. ఇటీవల 40వ సినిమాని ప్రకటించారామె. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం నవీన్‌ పొలిశెట్టి సరసన ఆమె నటిస్తున్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేం మహేశ్‌బాబు.పి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు టైటిల్‌ని వెల్లడించలేదు.


తొలి చూపులోనే మాయ చేసి..

‘ఏమాయ చేసావె’ సినిమాతో 2010లో నటిగా మారిన సమంత (Samantha) తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత, ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అ ఆ’, ‘జనతా గ్యారేజ్‌’, ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’, ‘జాను’, ‘మహానటి’, ‘మజిలీ’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, విశేషంగా మెప్పించారు. ఇటీవల.. ‘శాకుంతలం’ (Shaakuntalam), ‘యశోద’ (Yashoda) అనే పాన్‌ ఇండియా చిత్రాలను పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకానున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’ (Kushi) సినిమాలో నటిస్తున్నారు. ఇది సమంత 41వ చిత్రం. శివ నిర్వాణ దర్శకుడు. ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే విదేశీ చిత్రంలో ఆమె నటించనున్నారు. మరోవైపు, ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కనున్న సినిమాతో ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.


ఝుమ్మంది అందం

2010లో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన అందం తాప్సి (Taapsee Pannu). ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’, ‘సాహసం’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించిన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ ఉన్నారు. ‘బేబీ’, ‘పింక్‌’, ‘రన్నింగ్‌ షాదీ’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’, ‘థప్పడ్‌’, ‘లూప్‌ లపేట’ తదితర హిందీ సినిమాలతో తన ముద్ర వేసిన తాప్సి ఇప్పుడు ‘శభాష్‌ మిథు’తో (Shabaash Mithu) ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇది ఆమె 38వ చిత్రం. ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali Raj) జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ఇది. తాప్సి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘దొబారా’ ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకురానుంది. మరోవైపు, షారుఖ్‌ఖాన్‌ హీరోగా రూపొందుతున్న ‘డంకీ’లో (Dunki) ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ‘ఏలియన్‌’, ‘వో లడ్కీ హై కహాన్‌?’ తదితర ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కథానాయికలు 40, 50 సినిమాలు చేయడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, ఒకప్పుడు 100 మార్క్‌ దాటడం సాధారణమైన విషయం. అలనాటి హీరోయిన్లు.. హీరోలకు సమానంగా అవకాశాలు అందుకుని, తమ సత్తా చాటారు. రాధికా శరత్‌కుమార్‌ (దాదాపు 200), సుహాసిని (200పైగా), విజయశాంతి (180కి పైగా), రోజా (దాదాపు 130), సౌందర్య (సుమారు 110) తదితరులు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. సుహాసిని, రాధిక తదితరులు ఇప్పటికీ తమ నటనను కొనసాగిస్తున్నారు.  వెబ్‌ సిరీస్‌, ధారావాహికలతోపాటు పలు సినిమాల్లోని అమ్మ, అత్త పాత్రలతో సందడి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని