Published : 30 Sep 2021 10:59 IST

James bond: జేమ్స్‌బాండ్‌గా పనికిరాడన్నారు.. వేల కోట్లు కురిపిస్తున్నాడు!

డేనియల్ క్రెగ్‌ ఆ పేరు వినగానే  కండలు తిరిగిన దేహంతో, పదునైన చూపుతో,  జేమ్స్‌బాండ్‌ రూపం కళ్లముందు మెదులుతుంది. ‘కాసినో రాయల్‌’తో నయా బాండ్‌గా అవతరించాక నటుడిగా ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. హాలీవుడ్‌లో సంపన్న నటుడిగా విలాసవంతమైన జీవితాన్ని, తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ స్టార్‌డమ్‌ ఒక్కరోజులో వచ్చింది కాదు. పేదరికాన్ని, వైఫల్యాలను, నిద్రకు చోటులేని రాత్రుల్ని దాటొచ్చి  సగర్వంగా నిలబడ్డాడు డేనియల్ క్రెగ్‌.  ఆయన నటించిన ‘నో టైమ్‌ టు డై’ థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా అతను జేమ్స్‌బాండ్‌గా ఎదిగిన తీరుపై ఓ కథనం. 

అమ్మ కలే..తన కళ 

డేనియల్ క్రెగ్‌ 1968, మార్చి 2న ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌ పట్టణంలో జన్మించాడు.  నాలుగేళ్ల పసి వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.  డేనియల్ను, అతని సోదరి తీసుకొని తల్లి ఒలివియా లివర్‌పూల్‌కు వలసొచ్చింది. అక్కడామె ఆర్ట్‌ టీచర్‌గా పనిచేసేది. ఇరుకింట్లో ముగ్గురితో బహు కష్టమైన బాల్యాన్ని ఎదుర్కొన్నాడు డేనియల్. ఒలివియాకు నటనంటే మహా ఇష్టం.  తన 18ఏళ్ల వయసులో బ్రిటన్‌లోనే ప్రతిష్టాత్మకమైన రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో చేరేందుకు అర్హత సాధించింది.  కానీ ఆ సమయంలో సరిపడా డబ్బులేని కారణంగా తన కలకు దూరమైంది.  తన బిడ్డ విషయంలో ఇలాంటి తప్పు జరగకూడదని బలంగా నిశ్చయించుకుంది.   అందుకే చిన్నతనంలోనే లివర్‌పూల్‌లోని  ఎవ్రీమ్యాన్‌ థియేటర్‌లో క్రెగ్‌ను చేర్పించింది. చదువులో అంతంత మాత్రంగా ఉండే డేనియల్ నాటకాల్లో మాత్రం అదరగొట్టేవాడు.  ఆరేళ్ల నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఒలివియా స్నేహితులు కూడా నటులు కావడంతో నటనలో మరింత మెరుగయ్యాడు.  నాటకాల్లో, నటనలో దినదినాభివృద్ధి చెందుతుంటే తన తల్లి అక్కడే నిల్చొని ఆనందబాష్పాలు రాల్చేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు  క్రెగ్‌.   రోమియో జూలియట్‌, సిండ్రెల్లా లాంటి షేక్‌స్పియర్‌ నాటకాలతో టీనేజీలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.   నటనే జీవితంగా చేసుకోవాలని బలంగా నిర్ణయించుకొని  చదువుకు మధ్యలోనే స్వస్తి పలికాడు. 

లివర్‌పూల్‌ నుంచి లండన్‌ పయనం

తనకిష్టమైన నటనారంగంలో ఎలాగైన నెగ్గుకు రావాలనే లక్ష్యంతో 16 ఏళ్ల వయసులోనే లండన్‌లో అడుగుపెట్టాడు క్రెగ్‌. అక్కడ నేషనల్ యూత్‌ థియేటర్‌లో కష్టపడి ప్రవేశం దక్కించుకున్నాడు. షేక్‌స్పియర్‌ నాటకాలు వేయడమంటే అతడికి బాగా ఇష్టం. ఆ థియేటర్‌ బృందం తరఫున స్పెయిన్‌, రష్యా దేశాలకు వెళ్లి నాటకాల్లో ప్రదర్శనలిచ్చాడు.  దాదాపు ఆరేళ్ల పాటు వారితోనే కలిసి నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే డిగ్రీపట్టా కోసం  గిల్డ్‌హాల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్రామా కళాశాలలో చేరాడు. ఆర్థికంగా ఇబ్బందులు వెంటాడాయి. చదువు, జీవితం, నాటకాలు సాఫీగా సాగడానికి చిన్నాచితకా ఉద్యోగాలు చేయక తప్పలేదు. డబ్బుల కోసం రెస్టారెంట్లు, హోటళ్లలో పనిచేశాడు.  ఉండేందుకు చోటులేక లండన్‌లోని పార్క్‌ బెంచీలపైనే పడుకున్న సందర్భాలున్నాయి. అలా తొలినాళ్లలో నటుడిగా నిలదొక్కుకునేందుకు ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఎప్పటికైనా మంచి నటుడవుతాననే లక్ష్యంతో విరామమెరగకుండా ప్రయత్నాలు చేస్తుండేవాడు.   

 సినిమాల్లోకి ప్రవేశం

ఓ వైపు నాటకాలు వేస్తూనే సినిమా అవకాశాల కోసం శక్తిమేర ప్రయత్నాలు కొనసాగించాడు. గ్రాడ్యూయేషన్‌ పూర్తయ్యాక మూడేళ్లపాటు ఎలాంటి అవకాశం తలుపుతట్టలేదు.  ‘ది పవర్‌ ఆఫ్ వన్‌’ అనే  సినిమాలో చిన్నపాత్రలో దొరికింది. అయితే అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. టీవీషోల్లోనూ అదృష్టం పరీక్షించుకోవాలని నిర్మాతలను సంప్రదించేవాడు. అలా దొరికిన ఓ టీవీ షో అవకాశం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే బీబీసీ  ‘అవర్‌ ఫ్రెండ్స్‌ ఇన్‌ ది నార్త్‌’ అనే మినీ సిరీస్‌.  అందులోని నటనకు ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌లోని పలు ప్రఖ్యాత సంస్థల నుంచి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. 1998లో ‘లవ్‌ ఈజ్‌ ది డెవిల్‌’ అనే బయోపిక్‌ ద్వారా సినిమాల్లో మంచి బ్రేక్‌ ఇచ్చింది. అదే ఏడాది వచ్చిన ‘ఎలిజబెత్‌’ చారిత్రాత్మక చిత్రంలో చిన్న పాత్రలో మెరిశాడు. ఏంజెలినా జోలీతో కలసి 2001లో నటించిన ‘లారా క్రాఫ్ట్‌: టూంబ్ రైడర్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత మంచి పాత్రలు, సినిమాలు వరుసక ట్టాయి.  ‘రోడ్‌ టు పెర్డిషన్’‌, ‘సిల్వియా’ చిత్రాలతో నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. డేనియల్ క్రెగ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘లేయర్‌ కేక్‌’. డ్రగ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హీరోగా మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే ఏడాది స్టీవెన్‌ స్పీల్‌బర్గ్ డ్రామా ‘మ్యూనిక్‌’లో ఇజ్రాయెల్‌ ఏజెంట్‌గా నటించాడు. జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో నటించే అవకాశం దక్కడానికి ‘లేయర్‌ కేక్‌’లో పోషించిన పాత్రే కీలకంగా మారిందని అంటారు. అందులో డేనియెల్‌ పోషించిన పాత్ర బాండ్‌కు కాస్త దగ్గరగా ఉండటమే అందుకు కారణం. 

బాండ్‌గా అవతారం


పీయర్స్‌ బ్రాసన్ ‘డై అనదర్‌ డే’ను తన చివరి బాండ్‌ చిత్రమని ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చే బాండ్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి కలిగింది. చిత్ర నిర్మాతలు హ్యూజ్‌ జాక్‌మాన్‌ను  సంప్రదించారు. కొన్ని ఇతర కారణాల వల్ల ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. అనంతరం పలువురి హాలీవుడ్‌ స్టార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఓ రోజు డేనియెల్‌ క్రెగ్‌ను తదుపరి బాండ్‌గా ప్రకటించింది చిత్రబృందం. అంతే, బాండ్‌ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సీన్‌ కానరీ, బ్రెస్నన్‌లను చూసిన కళ్లతో డేనియల్ను జేమ్స్‌బాండ్‌గా చూడలేమన్నారు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ జేమ్స్‌బాండ్‌కు క్రెగ్‌కు పోలికలే లేవని విమర్శించారు. ఆరడుగుల ఎత్తు లేడు, రాగిజుట్టుతో, ముడతల మొహంతో బాండ్‌కు ఏ విధంగా సరితూగుతాడని మాటల దాడి జరిగింది.  ఎన్ని విమర్శలొచ్చిన డేనియెల్‌ క్రెగ్‌ మీద నమ్మకముంచారు నిర్మాతలు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బాండ్‌ చరిత్రలోనే కనీవీని ఎరుగని వసూళ్లు సాధించి నిర్మాతలను కాసుల్లో ముంచెత్తాడు. 

వసూళ్ల రారాజు

2006లో వచ్చిన ‘కాసినో రాయల్‌’తో బాండ్‌గా అవతరించిన డేనియెల్‌ క్రెగ్‌ మొత్తం ఐదు జేమ్స్‌బాండ్‌ సినిమాలు చేశాడు. వాటిలో నాలుగు విడుదలయ్యాయి. ‘నో టైమ్‌ టు డై’ ఈరోజు వచ్చింది. సినిమాల చిత్రీకరణ సమయంలో చాలా  సార్లు గాయపడ్డాడు. ప్రమాదకరమైన స్టంట్లు ఉండటం, వాటిని డూప్‌లు లేకుండా నటించాల్సి రావడంతో చిత్రీకరణ ప్రమాదకరంగా ఉండేది. చిత్రీకరణ ఇంత ప్రమాదకరం కాబట్టే తన శరీరానికి ఇన్సూరెన్స్‌ చేయించాడు. అగ్ని ప్రమాదాలు, విమానాల పైనుంచి, ఎత్తైన భవంతులు, క్రేన్‌లపై నుంచి దూకే ప్రమాదకరమైన స్టంట్లు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారాయన. ఆ  కష్టం ఊరికే పోలేదు. వసూళ్ల రూపంలో మిలయన్‌ డాలర్ల వర్షం కురిసింది. స్కైఫాల్‌ సినిమా ద్వారా ఏకంగా 1 బిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించిపెట్టాడు. ‘కాసినో రాయల్‌’, ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలస్’,  ‘స్పెక్టర్’‌,‘ స్కైఫాల్‌’ సినిమాలతో ఏకంగా మూడు బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి బాండ్‌గా పనికిరానన్న వారికి గట్టి సమాధానమిచ్చాడు. ఇప్పుడు మరోసారి వసూళ్ల వేటకు సిద్ధమయ్యాడు. బాండ్‌గా ఐదో చిత్రం ‘నో టైమ్‌ టు డై’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే తన చివరి చిత్రమని ప్రకటించాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని