K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించి సినీ ప్రియుల మదిలో చెరగని ముద్రను వేశారు సినీ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath). గురువారం ఆయన మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో జాతీయ అవార్డును అందుకున్న ఐదు అద్భుత సినిమాలకు సంబంధించిన విశేషాలు
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (కె.విశ్వనాథ్) (K Viswanath).. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.. లోతైన మాటలు.. వీనుల విందైన సంగీతంతో ఆయన తెరకెక్కించే చిత్రాలు ప్రతి సినీ ప్రియుడి మదిలో చెరగని ముద్రను వేశాయి. కళలకు జీవం పోస్తూ ఆయన తీసిన చిత్రాలు అజరామరం. అందులోనూ ఆయన రచించి, తెరకెక్కించిన ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’.. ఈ ఐదు చిత్రాలు అంతటా ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది.
శంకరాభరణం
ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం సంగీత ప్రధానంగా తెరకెక్కి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అపురూప కావ్యం ‘శంకరాభరణం’ (Sankarabharanam). జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రధారిగా తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఇందులోని పాత్రలు, పాటలు, మాటలు.. ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే, ఈ చిత్రాన్ని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డులను ‘శంకరాభరణం’ సొంతం చేసుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ (స్వర్ణ కమలం.. రూ.2 లక్షల నగదు), ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్ (రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్ (రజత కమలం.. రూ.50 వేలు) అందుకున్నారు.
సప్తపది
మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని చాటి చెప్పిన అద్భుత చిత్రం ‘సప్తపది’ (Saptapadi). జె.వి.సోమయాజులు, సబితా భమిడిపాటి, రవిశంకర్, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంగా కె.విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివాహం నేపథ్యంలో సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సమాజంలో పేరుకుపోయిన కులవ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది. 1981లో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘నర్గీస్‌దత్త్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్’ (రజత కమలం.. రూ.50 వేలు) అవార్డు వరించింది.
స్వాతిముత్యం
కె.విశ్వనాథ్ కలం నుంచి జాలువారిన మరో అపురూప చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam). చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రమిది. కమల్‌హాసన్‌లోని నటనా కౌశలానికి అద్దం పట్టిన మరపురాని చిత్రాల్లో ఇదీ ఒకటి. అమాయకుడిగా కమల్‌హాసన్, భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ప్రముఖుల ప్రశంసలు సైతం సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా (రజత కమలం రూ.50 వేలు నగదు) జాతీయ అవార్డు అందుకుంది.
సూత్రధారులు
అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని చాటి చెప్పిన చిత్రం ‘సూత్రధారులు’ (Sutradharulu). అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, భానుచందర్, రమ్యకృష్ణ, సత్యనారాయణ నటించిన ఈ సినిమా 1989లో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును పొందింది.
స్వరాభిషేకం
సమాజం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తోన్న వేళ.. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతోన్న రోజుల్లో విడుదలైన సంగీత ప్రధాన చిత్రం ‘స్వరాభిషేకం’. సంగీత ద్వయంగా విశ్వనాథ్, శ్రీకాంత్ నటించి అలరించారు. లయ కీలకపాత్ర పోషించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను అందుకుంది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకుంది. అలాగే, ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో కె.విశ్వనాథ్ ఖ్యాతి అజరామరం. ఎంతోమంది సినీ ప్రముఖులకు గురువైన ఆయన.. రానున్నతరాల వారికీ స్ఫూర్తిప్రదాత. ఇకపై ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ, మనసుని హత్తుకునే అద్భుత చిత్రాల రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Farzi: ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్ ‘ఫర్జీ’..!
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది