Keerthy Suresh: అప్పుడు సావిత్రి.. ఇప్పుడు వెన్నెల.. కీర్తి సురేశ్‌ సాహసమిది!

ప్రముఖ నటి కీర్తిసురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘దసరా’. నాని హీరోగా రూపొందిన ఈ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కీర్తి ప్రయాణాన్ని చూద్దాం..

Updated : 29 Mar 2023 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమె ‘చిన్ని’గా భయపెట్టగలదు.. ‘కళావతి’గా కనువిందు చేయగలదు. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌  సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఆవిడే ఈతరం ‘మహానటి’ (Mahanati) కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). తన కొత్త చిత్రం ‘దసరా’ (Dasara) మార్చి 30న విడుదలకానున్న సందర్భంగా.. ఇప్పటి వరకు ఆమె కెరీర్‌ ఎలా సాగిందో గుర్తుచేసుకుందాం..

అలా ‘మహానటి’ అవకాశం..

‘‘అందం ఉంటే చాలదు, నటన వస్తే సరిపోదు. మంచి పాత్రలు రావాలి. అప్పుడే కథానాయికలు స్టార్లవుతారు’’ అని ఓ సందర్భంలో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. కీర్తి కెరీర్‌కు ఆ మాటలు బాగా వర్తిస్తాయి. 2018 వరకు 12 సినిమాల్లో నటించి.. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్‌, మలయాళం ప్రేక్షకులను అలరించిన ఆమె కెరీర్‌ని మార్చిన చిత్రం ‘మహానటి’. అదే ఆమెను పెద్ద స్టార్‌ని చేసింది. జాతీయ అవార్డు అందించింది. ఒకవేళ ఆ సినిమాలో ఆమె నటించకపోయుంటే? ఇప్పుడు ఆ విషయం ఎందుకంటారా? తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సావిత్రి జీవితగాథలో నటింపజేసేందుకు చిత్ర బృందం ముందుగా మరో హీరోయిన్‌ నిత్య మేనన్‌ను సంప్రదించిందట. కారణమేంటోగానీ నటించేందుకు ఆమె తిరస్కరించింది. తర్వాత, ఆ పాత్ర కీర్తిని వరించింది. అందుకే.. ‘‘మనం ఏదైనా గొప్ప పని చేయాలనుకుంటున్నప్పుడు దేని కోసం వెతకాల్సిన అవసరం లేదు. ప్రకృతే అందిస్తుంది. మహానటి వేషం వేసేందుకు కీర్తి సురేశ్‌ విషయంలో అదే జరిగింది. ఇలాంటి పాత్రలో నటించడం సాహసం’ అని ఓ వేదికపై ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ చెప్పడం విశేషం.

సవాలుగా స్వీకరించి..

తనకు వచ్చిన ఆ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి, ‘సావిత్రే తిరిగి వచ్చిందా’ అని అనుకునేంతగా పాత్రలో ఒదిగిపోయింది. ఆ క్రమంలో నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది. దాని ఫలితం ఏంటో తెలుసుకునే ముందు ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ గురించి చూద్దాం. సినీ నేపథ్య కుటుంబంకావడంతో బాల్యంలోనే తెరంగేట్రం చేసిన కీర్తి.. మలయాళ సినిమా ‘గీతాంజలి’తో కథానాయికగా మారింది. అనంతరం అదే పరిశ్రమలో మరో సినిమా, తమిళ్‌లో ఓ చిత్రంలో సందడి చేసి, ‘నేను శైలజ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అందులో శైలజగా కనిపించి యువతను కట్టిపడేసింది. తర్వాత, కోలీవుడ్‌లో బాగా బిజీ అయి ‘నేను లోకల్‌’తో మళ్లీ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో కీర్తిగా నటించి గిలిగింతలు పెట్టింది. తెలుగులో చేసిన రెండు సినిమాలు హిట్టుకావడంతో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సరసన నటించే ఛాన్స్‌ అందుకుంది. అలా ఈ కాంబోలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత మరో తమిళ్‌ చిత్రంలో నటించి, ‘మహానటి’తో మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.

ఆ ప్రభావం ఉంది..

ఓ నేపథ్యానికి సంబంధించిన కథలు హిట్‌ అయితే అదే బాటలో మరిన్ని కథలురావడం సినీ పరిశ్రమలో సహజం. వెంటనే కాదుగానీ ఆ ఎఫెక్ట్‌ కీర్తి కెరీర్‌పై పడింది. ‘మహానటి’లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత కీర్తి ఎలాంటి చిత్రాల్లో నటిస్తుంది? అని అంతటా ఆసక్తి నెలకొనగా ఆమె తమిళ్‌లో ‘సామి స్వ్కేర్‌’, ‘సందకోళి 2’ తదితర కమర్షియల్‌ ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంది. అలా కొనసాగుతూనే ‘మహానటి’ ఇచ్చిన ధైర్యంతో లేడీ ఓరియెండెట్‌ స్టోరీలు ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’తో అదృష్టాన్ని పరీక్షించుకుంది. నిరాశే ఎదురైంది. అయినా అక్కడితో ఆగిపోకుండా ‘ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతకాలి’ అన్న చందంగా మరో నాయికా ప్రాధాన్య చిత్రం చేసి శభాష్‌ అనిపించుకుంది. ఆ సినిమానే ‘చిన్ని’. అందులో డీ గ్లామర్‌ రోల్‌ పోషించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమెలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. అందులో ఆమె ప్లే చేసిన కళావతి రోల్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్రలో ఒదిగిపోయేందుకు తానెప్పుడూ ముందుంటుందనేది ‘కళావతి’ పాత్ర తెలియజేస్తుంది. ‘రంగ్‌ దే’లో రొమాంటిక్‌గా, ‘అన్నాత్తే’లో రజనీకాంత్‌కి సోదరిగా, ‘మన్మథుడు 2’, ‘జాతి రత్నాలు’లో అతిథిగా కనిపించి మెప్పించింది.

వెన్నెల.. మరోసారి వావ్‌ అనిపించేలా

‘చిన్ని’ తర్వాత ఇప్పుడు ‘దసరా’తో మరోసారి డీ గ్లామర్‌ రోల్‌లో తన సత్తా చూపించేందుకు సిద్ధమైంది. నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల రూపొందిన ఆ సినిమాలో కీర్తి.. వెన్నెలగా కనిపించనుంది. యాక్షన్‌ ఎడ్వెంచర్‌గా పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రంలో తానెంత వైవిధ్యం ప్రదర్శించిందో ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు తెలియజేశాయి. ఆ పాత్ర కోసం ఆమె తెలంగాణ యాస నేర్చుకుని, స్వయంగా డబ్బింగ్‌ చెప్పింది. మేకప్ వేయడానికి, తీయడానికి కొన్ని గంటల సమయం పట్టినా.. పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయేందుకు ఓపికతో ఉండేదట కీర్తి. ‘‘మహానటి’లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్‌ అవుతాయి. ‘దసరా’ ఆ జాబితాలోనే నిలుస్తుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేసిన కీర్తి సురేశ్‌కి ఆల్‌ ది బెస్ట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని