KGF Chapter 2: రాకీకి సవాల్‌ విసిరేది ఎవరు? కేజీయఫ్‌-2లో వార్‌ వీరితోనేనా?

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’.. 2018 డిసెంబరులో విడుదలై ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఇందులోని కథ, హీరోయిజం, విలనిజం.. ఇలా ప్రతిదీ అన్ని చిత్ర పరిశ్రమల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’..

Published : 11 Apr 2022 10:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’.. 2018 డిసెంబరులో విడుదలై ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఇందులోని కథ, హీరోయిజం, విలనిజం, సంగీతం.. ఇలా ప్రతిదీ అన్ని చిత్ర పరిశ్రమల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’.. ఏప్రిల్‌ 14 నుంచి సందడి చేయనుంది. ఈ సందర్భంగా రెండో అధ్యాయంలో కీలక పాత్ర పోషించిన వారి గురించి తెలుసుకుందాం.. 

తొలి అధ్యాయంలో..

రాకీ (హీరో యశ్‌) ప్రధాన విలన్‌ గరుడ (రామచంద్రరాజు)ను దారుణంగా హత్య చేసే సన్నివేశంతో ఛాప్టర్‌ 1 ముగిసిన విషయం తెలిసిందే. ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’ పేరిట బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి కోట్లు గడించిన గరుడ తండ్రి సూర్యవర్ధన్‌ (రమేశ్‌ ఇందిర) పాత్రా ఛాప్టర్‌ 1తోనే పూర్తయింది. గరుడను చంపించిన వారి తదుపరి ప్రణాళికేంటి? చనిపోయాడనుకున్న సూర్య వర్ధన్‌ సోదరుడు అధీరా ఎలా తిరిగొచ్చాడు? ప్రధాన మంత్రి తీసుకొన్న నిర్ణయమేంటి? తదితర విషయాలు ఛాప్టర్‌-2పై ఆసక్తిని రేకెత్తించాయి.


ఆ ప్రధాని ఈమెనే

ప్రధాన మంత్రి.. హీరోపై డెత్‌ వారెంట్‌ జారీ చేసే సన్నివేశంతో ఛాప్టర్‌ 1 మొదలవుతుంది. అందులో ఈ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ కనిపించదు కానీ వినిపిస్తుంది. ఛాప్టర్‌ 2లో నట విశ్వరూపం చూపించబోతోందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా’ అనే డైలాగ్‌.. వ్యక్తిగతంగా ప్రధాన మంత్రీ కేజీయఫ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరి రాకీను మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా పరిగణించిన ప్రభుత్వం ఏం చేసింది? అనేది తెలియాల్సి ఉంది. రమికా సేన్‌ అనే ఈ పాత్రకు జీవం పోసింది బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రధసారథి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలతో అలరించింది.


భయంకర అధీరా

ఛాప్టర్‌ 1లో గాత్రం వినిపించి, ముఖం కనిపించని పాత్రల్లో మరొకటి అధీరా. తొలి భాగంలో ఈ భయంకర పాత్ర మరణించినట్టు చూపిస్తారు. కానీ, రెండో పార్ట్‌లో ఆ పాత్ర సజీవంగానే ఉందని ట్రైలర్‌లో చూపించారు. అదెలా అనేదానికి పార్ట్‌-2నే సమాధానం. ‘కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు ఉద్ధరించడానికి’ అని ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌ను బట్టి ‘నరాచీ..’ను తాను సొంతం చేసుకునేందుకు పక్కా ప్రణాళిక రచించినట్టు అర్థమవుతోంది. ‘అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి.. కావాలంటే రాబందులను అడుగు’ అని విరుచుకుపడే ఈ పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ కనిపిస్తారు. గతంలో ఈయన తెలుగు చిత్రం ‘చంద్రలేఖ’లో అతిథిగా మెరిసిన సంగతి తెలిసిందే.


సీబీఐ అధికారిగా..

గరుడ హత్య వెనక ఎవరున్నారు? అసలు ‘నరాచీ..’ రహస్యమేంటి? తదితర వివరాలు సేకరించే సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సీబీఐ) అధికారిగా రావు రమేశ్‌ కనిపించనున్నారు. కన్నెగంటి రాఘవన్‌ పేరుతో ఆయన వైవిధ్యం చూపించబోతున్నారు.


ఈయన స్థానంలో ప్రకాశ్‌..?

‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’.. పేరిట జరుగుతున్న హింసను ప్రపంచానికి తెలియజేసేందుకు ‘ఎల్‌ డొరాడో’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత, జర్నలిస్టు ఆనంద్‌ వాసిరాజ్‌గా పార్ట్‌- 1లో అనంత్‌ నాగ్‌ కనిపించారు. ఈ పాత్రకు శుభలేఖ సుధాకర్‌ గాత్రదానం చేశారు. దీంతో ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే, ఛాప్టర్‌ 2 ట్రైలర్‌లో అనంత్‌ నాగ్‌ కనిపించరు. అదే తరహా లుక్‌లో ప్రకాశ్‌రాజ్‌ సంభాషణలు చెప్పడంతో అనంత్‌ నాగ్‌ సీక్వెల్‌లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, అనంత్‌ నాగ్‌ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ నటించారని ఓవైపు.. అనంత్‌నాగ్‌తోపాటు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఉన్నారని కొన్ని రోజులుగా నెట్టింట చర్చ సాగుతూనే ఉంది. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది’ అని కేజీయఫ్‌ రెండో అధ్యాయాన్ని ప్రకాశ్‌రాజ్‌ వివరించడం ట్రైలర్‌లో కనిపించింది. రెండో అధ్యాయంలో ఇద్దరూ ఉంటారా? కేవలం ప్రకాశ్‌ రాజే కనిపిస్తారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


రహస్యం ఎందుకో?

ఛాప్టర్‌ 2లో ఎవరెవరు ఏ ఏ పాత్రల్లో కనిపిస్తారో పోస్టర్లు, ట్రైలర్‌ ద్వారా హింట్‌ ఇచ్చిన చిత్ర బృందం ఈశ్వరీరావు వివరాలను మాత్రం బయటపెట్టలేదు. ప్రచార చిత్రంలో ఈ పాత్ర అలా కనిపించి ఇలా వెళ్లిపోతుంది. ఆమె ఎలాంటి పాత్ర పోషించారు? ఎందుకంతా రహస్యంగా ఉంచారు? ఎలాంటి ట్విస్ట్‌ ఇవ్వబోతున్నారు? ‘నరాచీ..’లో ఓ యోధుడిలా మారిన రాకీ అక్కడ బానిసలుగా బతుకుతున్న వారికి విముక్తి కల్పిస్తాడా? తిరిగి ముంబయి వెళ్లిపోతాడా? కేజీయఫ్‌కు ముగింపు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.

సూర్య వర్ధన్‌, గరుడ మినహా ఛాప్టర్‌ 1లో కనిపించిన పాత్రలన్నీ ఛాప్టర్‌ 2లోనూ ఉన్నాయి. తొలిభాగంలో ఎవరెవరు ఎలా కనిపించారో, అసలు ‘కేజీయఫ్‌’ అంటే ఏంటి? అనే వివరాలు ఈ కింది వార్తల్లో చదవండి...

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts