Published : 11 May 2022 01:48 IST

Mahesh Babu: ‘పోకిరి’తో మొదలై.. 15 ఏళ్లకు అలానే కనిపించి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సినిమాపై.. పాటలతో అంచనాలు పెరగొచ్చు, టీజర్‌- ట్రైలర్లతో ఆసక్తి కలగొచ్చుగానీ ప్రీ లుక్‌తోనే విశేష స్పందన రావడం అరుదు. ఇలాంటి జాబితాలో నిలిచిన వాటిలో ‘సర్కారు వారి పాట’ ఒకటి. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh Babu) పొడవాటి జుట్టు, లైట్‌ గడ్డంతో కనిపించడమే ఇందుకు కారణం. ఎప్పుడూ సింపుల్‌ హెయిర్‌ స్టైయిల్‌, క్లీన్‌ షేవ్‌నే ఇష్టపడే ఆయన లాంగ్‌ హెయిర్‌, కాస్త గడ్డంతోపాటు మెడపై రూపాయి నాణెం టాటూ, చెవికి పోగు పెట్టుకుని సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించారు. అలా ప్రీ లుక్‌తోనే భారీ అంచనాలు నమోదు చేసిన ‘సర్కారు..’ (Sarkaru Vaari Paata) ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మహేశ్‌ గతంలో ఏ ఏ సినిమాల్లో పొడవాటి జుట్టుతో నటించాడో చూద్దాం..

తొలిసారి పోకిరి కోసం

తాను హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘పోకిరి’కి ముందు వరకూ మహేశ్‌బాబు చేసిన అన్ని సినిమాల్లోని లుక్‌ దాదాపు ఒకేలా ఉండేది. లైట్‌ హెయిర్‌, క్లీన్‌ షేవ్‌తో బాలీవుడ్‌ హీరోలా క్లాస్‌గా కనిపించేవారు. కథ, కథానాయకుడి పాత్ర దృష్ట్యా మహేశ్‌ను జట్టు పెంచాలని, లైట్‌గా మీసం, గడ్డంతో ఉండాలని చెప్పారట పూరీ. దీనికి సరేనన్న మహేశ్‌ నాలుగు నెలలు తన జుట్టును కత్తిరించుకోకుండా పొడవుగా పెంచి, సరికొత్త లుక్‌లోకి మారారు. అదే ‘పోకిరి’లో మనం చూసిన ‘పండుగాడు’ గెటప్‌. ఆ హెయిర్‌, డ్రెస్సింగ్‌ స్టైల్‌, చేతికి కర్చీఫ్‌ కట్టుకోవడం.. ఇలా ప్రతి అంశంలోనూ మహేశ్‌ను చాలా కొత్తగా చూశారు ప్రేక్షకులు. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే.


అదే ఏడాది మరొకటి

‘పోకిరి’ విడుదలైన సంవత్సరం 2006లోనే ‘సైనికుడు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు మహేశ్‌. సిద్ధార్థ్‌ అనే పాత్ర పోషించిన ఈ చిత్రంలోనూ ఆయన  పొడవాటి జుట్టుతో కనిపించారు. ఈ ప్రాజెక్టును దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించారు.


అతిథితో మరోసారి

లాంగ్‌ హెయిర్‌తో మహేశ్‌ వరుసగా మూడోసారి నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ 2007లో విడుదలైంది. ఇందులోని మహేశ్‌ లుక్‌ ‘పోకిరి’, ‘సైనికుడు’లోని గెటప్‌కు పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఇందులోని ఆయన జుట్టు పొడవు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.


మళ్లీ 15 ఏళ్లకు

అలా రెండేళ్లలో మూడు చిత్రాల్లో లాంగ్‌ హెయిర్‌లో నటించిన మహేశ్‌ సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ‘అతిథి’ తర్వాత 12 చిత్రాల్లో షార్ట్‌ హెయిర్‌తో ఆకట్టుకున్న ఆయన ‘సర్కారు వారి పాట’లో వాటన్నింటికీ భిన్నంగా కనిపించనున్నారు. జుట్టు, గడ్డమే కాకుండా టాటూ, చెవి పోగు విషయంలోనూ ట్రెండ్‌ సెట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించింది. సముద్రఖని, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని