Raj-Koti: రాజ్‌-కోటి.. కాలమే కలిపింది.. కాలమే విడదీసింది

సంగీత దర్శకుడు రాజ్‌(Raj)కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు.

Updated : 21 May 2023 20:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజ్‌ - కోటి (Raj - Koti).. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఈ బ్రాండ్‌కు ఉన్న ఆదరణ వేరు. పోస్టర్‌పై ఈ సంగీత ద్వయం పేరు పడిందంటే.. ఆ సినిమా తప్పకుండా మ్యూజికల్‌ హిట్‌ అయ్యేది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లపాటు దూరంగా ఉన్నారు. మనస్పర్థలు మర్చిపోయి కలిసినప్పటికీ.. వర్క్‌ పరంగా వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఆదివారం రాజ్‌ మరణంతో సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్‌-కోటి బ్రాండ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు.

అలా మొదలై..!

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు తోటకూర వెంకటరాజు కుమారుడే సోమరాజు అలియాస్‌ రాజ్‌. రాజమండ్రికి చెందిన వెంకటరాజు వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. దీంతో రాజ్‌ పుట్టి, పెరిగినదంతా చెన్నైలోనే. చదువులో చురుగ్గా ఉండే రాజ్‌ బీకామ్‌ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంగీతంపై ఆసక్తి పెరిగింది. దీంతో బీకామ్‌ను పక్కనపెట్టి సంగీత సాధనపై మనసు పెట్టారు. వెస్ట్రన్‌, క్లాసికల్‌ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు.

కాలం కలిపిందిలా..!

అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద రాజ్‌, కోటి అసిస్టెంట్స్‌గా ఎంతోకాలం పాటు పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. తరచూ సంగీతం గురించే చర్చించుకునేవాళ్లు. 1982లో తెరకెక్కిన ‘ప్రళయగర్జన’ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం రాజ్‌కు దక్కింది. తన స్నేహితుడు కోటితో కలిసి సంగీత ద్వయంగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావించారు. అలా, వీరిద్దరూ కలిసి ఆ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా విజయం అందుకోవడంతో కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది టాలీవుడ్‌ స్టార్స్‌ చిత్రాలకు వీళ్లు పనిచేశారు.

అప్పుడే అర్థమైంది...!

‘ప్రళయ గర్జన’ చిత్రానికి విభిన్నంగా మ్యూజిక్‌ అందించాలని భావించిన రాజ్‌-కోటి.. యువతను దృష్టిలో పెట్టుకుని రాక్‌ మ్యూజిక్‌ అందించారు. సినిమా రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో చూడటం కోసం నెల్లూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ప్రేక్షకులందరూ.. ‘మ్యూజిక్‌ అదిరిపోయింది’ అని మాట్లాడుకోవడం విని ఎంతో ఆనందించారు. అలా, వీళ్లు ప్రేక్షకుల నాడీని పట్టుకున్నారు.

సూపర్‌ హిట్స్‌..!

మొదటి సినిమా విజయంతో వీరిద్దరూ కెరీర్‌లో దూసుకెళ్లారు. స్టార్‌హీరోల సినిమాల కోసం పనిచేశారు. వీరి కాంబోలో వచ్చిన ‘యముడికి మొగుడు’, ‘కొండవీటి రౌడీ’, ‘కొదమ సింహం’, ‘కర్తవ్యం’, ‘పెద్దరికం’, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘ముఠా మేస్త్రీ’, ‘హలో బ్రదర్‌’ వంటి ఆల్బమ్స్‌ మంచి సక్సెస్‌ అందుకున్నాయి. సుమారు 180 సినిమాల కోసం వీళ్లు కలిసి పనిచేశారు. ఒకప్పుడు ఏడాదిలో 25 సినిమాలకు వీళ్లు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. రెహమాన్‌, తమన్‌, యువన్‌ శంకర్‌ రాజా వంటి సంగీత దర్శకులు అప్పట్లో వీళ్ల దగ్గర వర్క్‌ చేశారు.

కాలం విడదీసింది..!

ఎన్నో ఏళ్ల పాటు కలిసి పనిచేసిన రాజ్‌ - కోటి అనుకోని కారణాలతో విడిపోయారు. ఇదే విషయంపై గతంలో ఓ ఇంటర్వ్యూలో కోటి మాట్లాడుతూ.. కాలమే తమని కలిపిందని, కాల ప్రభావంతోనే తాము విడిపోయామని అన్నారు. ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం. ఎప్పుడూ సంగీతం గురించే చర్చించుకునేవాళ్లం. రాజ్‌కు మొదటిసారి సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చినప్పుడు.. కలిసి చేద్దామా? అని అడిగాడు. అలా, మేమిద్దరం కలిసి మ్యూజిక్‌ కంపోజింగ్‌ చేయడం మొదలుపెట్టాక సుమారు పదేళ్ల పాటు ఎన్నో సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చాం. మాకు మంచి పేరు వచ్చింది. అనుకోని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది. ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్‌, ఇతర విషయాలన్నీ రాజ్‌ చూసుకునేవారు. చిత్రబృందాలతో నేను టీమ్‌ అప్‌ అయ్యేవాడిని. ఆ విషయంలో కొంతమంది వ్యక్తులు చెప్పిన మాటలు విని ఓసారి రాజ్‌ నా వద్దకు వచ్చి విడిపోదాం అని చెప్పారు. నేను వద్దని చెప్పాను. కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించాం. కాకపోతే అది సాధ్యపడలేదు. దాంతో విడిపోయాం. విడిపోయినా మేము స్నేహితులగానే ఉన్నాం. మేము విడిపోయిన సమయంలో బాల సుబ్రహ్మణ్యం ఎక్కువగా బాధపడ్డారు. మమ్మల్ని మళ్లీ కలిసి వర్క్‌ చేయమని ఎప్పుడూ చెబుతుండేవారు. అలా, ఓసారి మా సంగీత దర్శకులందరూ కలిసి చెన్నైలో ఓ కార్యక్రమం పెట్టారు. మమ్మల్ని కలిపారు. మేము కలిసి వర్క్‌ చేయాలనుకున్నాం. కాకపోతే ప్రాజెక్ట్‌లు రాలేదు’’ అని చెప్పారు.

సినిమాల్లోకి వచ్చారు..!

కోటి నుంచి విడిపోయిన తర్వాత రాజ్‌ కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అంతేకాకుండా, పలు సినిమాల్లో అతిథిపాత్రలో కనిపించారు. ‘టక్కరి దొంగ’, ‘ఆడుతూ పాడుతూ’ సినిమాల్లో ఆయన కనిపించారు.Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు