National Film Awards: అవార్డుల్లో ‘సూరారై పోట్రు’ రికార్డు.. ‘కలర్‌ ఫోటో’ ఎలా ‘క్లిక్‌’ అయిందంటే?

2020లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన కొన్ని చిత్రాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. వీటిల్లో అత్యధికంగా 5 అవార్డులను ‘సూరారై పోట్రు’ చిత్రం గెలుచుకుంది.

Published : 23 Jul 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన కొన్ని చిత్రాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను (National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. వీటిల్లో అత్యధికంగా 5 అవార్డులను ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru) చిత్రం గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ (Colour Photo) సత్తా చాటింది. ఈ సందర్భంగా వాటి కథేంటో ఓసారి గుర్తుచేసుకుందాం..

ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి, అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రమే ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా). కొవిడ్‌ కారణంగా ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) విడుదలైంది. తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎందరిలోనో స్ఫూర్తినింపింది. ‘ఇది థియేటర్లలో విడుదలకావాల్సిన సినిమా’, ‘తప్పకుండా ఈ చిత్రానికి అవార్డులొస్తాయి’ అని విమర్శకులూ ప్రశంసించారు. అంతా అనున్నట్టుగానే ఈ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.

కథ, కథనం, నటులు, సంగీతం, దర్శకత్వం.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ బయోపిక్‌ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. స్వగ్రామంలో చోటుచేసుకున్న కొన్ని పరిస్థితుల వల్ల తండ్రితో గొడవపడి వెళ్లిపోయి, వైమానిక దళంలో చేరడం, అదే సమయంలో పేదవారికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకోవడం, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది సాధించడం.. ఇలా గోపీనాథ్‌ జీవితంలోని ప్రతి దశనూ సూర్య (Suriya) తన నటనతో కళ్లకు కట్టినట్టి చూపించారు. ఆయన భార్యగా అపర్ణా బాలమురళీ (Aparna Balamurali) ఒదిగిపోయారు. అందుకే అప్పుడు ప్రేక్షకుల చప్పట్లు, ప్రశంసలే కాకుండా ఇప్పుడు అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), ఉత్తమ నటి (అపర్ణ)తోపాటు మరో రెండు విభాగాల్లో ఈ సినిమా మెరిసింది. ఉత్తమ నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌ కుమార్‌) (GV Prakash Kumar), ఉత్తమ స్క్రీన్‌ప్లే: సుధా కొంగర, షాలిని ఉషా నయ్యర్‌. ఈ చిత్రం హిందీలో రీమేక్‌ అవుతోంది. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా తెరకెక్కుతున్న రీమేక్‌ను సూర్య నిర్మిస్తున్నారు.

కలర్‌ ఫోటో బాగా ‘క్లిక్‌’ అయింది

2020లో కొవిడ్‌/లాక్‌డౌన్‌తోపాటు ప్రేక్షకులకు ఓటీటీ పరిచయమైన సంగతి తెలిసిందే. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో ‘కలర్‌ ఫోటో’ ఓటీటీ ‘ఆహా’ (Aha) ద్వారా విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాల్లోని సంభాషణలు, ‘తరగతి దాటి’ అనే పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సందీప్‌ రాజ్‌ (Sundeep Raj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్‌, చాందినీచౌదరి కనిపించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలవడంతో చిత్ర బృందం అప్పట్లో నిరాశకు గురైంది. ‘‘ఈ సినిమా విడుదల ముందు వరకు.. ‘ప్రేక్షకులు నన్ను కథానాయకుడిగా ఆదరిస్తారా? వాళ్లని మెప్పించగలుగుతానా? లేదా?’’ అని చాలా భయపడ్డా. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘నువ్వు తెగ ఏడిపించేశావని, నిజాయితీగా తీశార’ని ఫోన్‌ చేసి ప్రశంసిస్తుంటే మాటలు రావట్లేదు. ఈ చిత్రాన్ని వెండితెరపై చూసుకోనుంటే.. ఆ అనుభూతి మరోలా ఉండేది. ఈ సినిమా విషయంలో నాకున్న బాధ ఇదొక్కటే’’ అని సుహాస్‌ ఓ సందర్భంలో తెలిపారు. తర్వాత, సినిమాకు దక్కిన విశేష ప్రేక్షకాదరణ, ఇప్పుడు ప్రకటించిన అవార్డులతో ‘కలర్‌ ఫోటో’ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ఇదీ కథ..

1997లో మచిలీపట్నం దగ్గర ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలోనే పాలమ్ముకుంటూ కష్టపడి ఇంజినీరింగ్‌ చదువుతుంటాడు జయకృష్ణ (సుహాస్‌). బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. తన తండ్రిని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో జీవిస్తుంటాడు. ఓ రోజు కాలేజీలో కల్చరల్‌ రిహార్సల్స్‌లో అమ్మవారి వేషంలో ఉన్న దీప్తి వర్మ (చాందినీ చౌదరి)ను చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. కానీ, అంత అందమైన అమ్మాయి తనలాంటి అబ్బాయిని ప్రేమిస్తుందో లేదో అన్న భయంతో ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. ఆమెను దూరం నుంచి చూస్తూనే ఆరాధిస్తుంటాడు. కానీ, కృష్ణ వ్యక్తిత్వం, ప్రవర్తన నచ్చి తనను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది దీప్తి. ఆమె అన్నయ్య ఇన్‌స్పెక్టర్‌ రామరాజు (సునీల్‌)కు అసలు ప్రేమ అంటేనే గిట్టదు. తన చెల్లికి మంచి అందగాడిని చూసి పెళ్లి చెయ్యాలనుకుంటుంటాడు. తన చెల్లి కృష్ణతో ప్రేమలో ఉన్నట్లు రామరాజుకు తెలుస్తుంది. నలుపంటేనే గిట్టని రామరాజు అదే కారణంతో వాళ్ల ప్రేమకు అడ్డు చెబుతాడు. కృష్ణకు తెలియకుండా దీప్తిని విజయవాడ పంపించి అతనిపై దాడి చేస్తాడు. కృష్ణ, దీప్తి ఒక్కటయ్యారా, లేదా? అనే ఆకస్తికర కథతో, వర్ణ వివక్ష నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మిస్‌ అయి ఉంటే ఓసారి చూసేయండి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని