Pawan Kalyan: పుస్తక పఠనం.. మారిన జీవితం.. పవన్‌ కల్యాణ్‌ ఏమంటారంటే?

పవన్‌ కల్యాణ్‌ మెచ్చిన పుస్తకాల విశేషాలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం..

Updated : 02 Sep 2022 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటులను ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తుంటారు. ‘రంగుల ప్రపంచంలో బతికేవారు కదా ఖాళీ సమయంలో ఏ పబ్‌కో, పార్టీకో వెళ్తుంటారు’, ‘బాగా డబ్బుంటుంది కదా విదేశాలు చుట్టొస్తుంటారు’ అని అనుకుంటుంటారు. కానీ, వంటింట్లో అమ్మకు సాయపడేవారు.. సేవా కార్యక్రమాలు చేసేవారు.. పుస్తకాలు చదివే స్టార్‌లూ ఉన్నారు. టాలీవుడ్‌ హీరోల్లో పుస్తకాలు చదివే విషయంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందుంటారు. సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ప్రభావితం చేసిన, ఆయన చదవమని సూచించిన కొన్ని పుస్తకాలేంటో ఓ సారి చూద్దాం.. (HBD Pawan Kalyan)

అవేంటో తెలుసుకునే ముందు, పుస్తకాల గురించి పవన్‌ ఏమన్నారో తెలుసుకుందాం. ‘‘పుస్తకాలు నా స్నేహితులు. జీవితం గురించి అవి విపులీకరించి చెప్పాయి. నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ‘అతడు అడవిని జయించాడు’ ఒకటి.  జీవనాధారం కోల్పోయినప్పుడు మనిషి పడే ఆవేదనను కళ్లకు కట్టారు రచయిత కేశవరెడ్డి. దానికి ప్రభావితమయ్యాను కాబట్టే రైతులు, చేనేత కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులు నా సాయం కోరగానే స్పందించా’’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

పవన్‌ చిన్నప్పుడు బడికి వెళ్తుంటే ఓ గోడ మీద ‘తాకట్టులో భారతదేశం’ అనే టైటిల్‌ కనిపించిందట. అప్పుడే దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. ఇంటర్‌లో ఉండగా వాళ్ల నాన్న దగ్గర నుంచి ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకాన్ని తీసుకొని చదివారు. ఆ పుస్తకంలో చర్చించిన అంశాలు, అందులోని సారాంశం తనపై చాలా ప్రభావం చూపిందని చెబుతుంటారు పవన్‌. ఈ సమాజాన్ని ఆ పుస్తక రచయిత తరిమెల నాగిరెడ్డి విశ్లేషించిన తీరు ఆలోచింపజేసిందని చెప్పారు. అందులో చర్చించిన అంశాలు ఈనాటికీ వర్తిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త మసనోబు. పురుగుల మందులు, రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేయడం కన్నా సహజ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించొచ్చని నిరూపించారాయన. ఆయన చేసిన పరిశోధనలు, అభిప్రాయాలను ‘గడ్డి పరకతో విప్లవం’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఇది కూడా పవన్‌కు ఇష్టమైన పుస్తకమే. అందుకే ఈ పుస్తకాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

స్వేచ్ఛ కోసం 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు నెల్సన్‌ మండేలా. ఆయన రాసిన ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’.. పవన్‌ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ‘బద్రి’ సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని పవన్‌ స్వయంగా వెళ్లి చూశారు. మండేలా పోరాట పటిమ తనలో స్ఫూర్తి నింపిందంటుంటారు పవన్‌.

అవి ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రీకరణ జరుపుకొంటున్న రోజులు. ‘వనవాసి’ పుస్తకం చదవాలని పవన్‌కు ఆసక్తి కలిగింది. కానీ, వెతికితే ఆ పుస్తకం దొరకలేదు. ఈ విషయాన్ని తనికెళ్ల భరణికి చెప్పారు. చివరకు ఆ బుక్‌ పవన్‌ చేతుల్లోకి చేరింది. గబ్బర్‌ సింగ్‌.. సాధించిన విజయం కన్నా ‘వనవాసి’ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న క్షణాల్లోనే ఎక్కువ ఆనందం పొందానని ఓ సందర్భంలో పవన్‌ చెప్పారు. 

అందరూ తప్పకుండా చదవాల్సిన వాటిలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పుస్తకాలు కూడా ఉన్నాయంటారు. 

ఒక విధంగా నేటి యువతకు గుంటూరు శేషంద్ర శర్మను పరిచయం చేసింది పవన్‌ కళ్యాణ్‌ అని చెప్పొచ్చు. ఆయన ఉపన్యాసాల్లో తరచూ వినిపించే కవిత్వం శేషేంద్రశర్మదే. ఆధునిక మహాభారతం, జనవంశం పుస్తకాలు పట్టుకుని పవన్‌ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన కుమారుడి కోరిక మేరకు కొన్ని పుస్తకాలను మళ్లీ ముద్రించేందుకు పూనుకొని శేషేంద్రపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts