HBD Pawan Kalyan: ఒకట్రెండు కాదు ఏడు.. పవన్ లోని విభిన్న కోణాలివీ!

నటుడిగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సెట్‌ చేసిన ట్రెండ్‌ గురించి అందరికీ తెలుసు. సినిమాకి సంబంధించిన ఇతర విభాగాల్లోనూ ఆయనకు

Updated : 02 Sep 2022 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడిగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సెట్‌ చేసిన ట్రెండ్‌ గురించి అందరికీ తెలుసు. అయితే.. సినిమాకు సంబంధించిన ఇతర విభాగాల్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉందనే సంగతి కొందరికే తెలుసు. నేడు పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం..

మెగాఫోన్‌ పట్టుకుని..!

‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’.. ఇలా తన కెరీర్‌ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పవన్‌ అనూహ్యంగా మెగాఫోన్‌ పట్టారు. కేవలం 7 సినిమాల ప్రయాణంతోనే దర్శకత్వ విభాగంపైనా పట్టుసాధించారు. అలా తన 8వ సినిమాకు తానే డైరెక్షన్‌ చేశారు. అదే మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘జానీ’. 2003లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేపోయినా.. పవన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలోని సంభాషణలను లైవ్‌లోనే రికార్డు చేయటం ఓ ప్రయోగమని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. పవన్‌ స్టైలిష్‌ టేకింగ్‌ చూడాలని ఆయన అభిమానులంతా కోరుకున్నా.. ఆయన దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు.

రాసిన కథలు..!

పవన్‌కు కథను తెరకెక్కించటమే కాదు.. వాటిని రాయటమూ వచ్చు. స్వీయ దర్శకత్వంలో నటించిన ‘జానీ’, బాబీ డైరెక్షన్‌లో యాక్ట్‌ చేసిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాలకు కథనందించింది పవనే. స్టోరీలు చెప్పటమే కాదు.. వాటిని ఎలా నడిపించాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఆ ప్రతిభతోనే ‘గుడుంబా శంకర్‌’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు.

చెప్పిన కథ..!

కథ రాయటం, కథను తెరపైకి తీసుకురావటమే కాదు.. సినిమా కథను వాయిస్‌ ఓవర్‌ రూపంలో పరిచయం చేయటంలోనూ పవన్‌ తనదైన మార్క్‌ చూపించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘సైరా’కు పవన్‌ పవర్‌ఫుల్‌గా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

పోరాటాల్లో పవర్‌..!

మిగతా సినిమాలకు భిన్నంగా పోరాట సన్నివేశాలుండేలా చూసుకుంటారు పవన్‌ కల్యాణ్.  ఆ క్రమంలో ఆయనే  కొన్ని సినిమాల్లో ఫైట్స్‌ని రూపొందిస్తుంటారు. పవన్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సినిమాల్లో ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తదితర చిత్రాలున్నాయి. ‘జానీ’ సినిమాలో ఆయన రూపొందించిన ఫైట్స్‌ టాలీవుడ్‌లోనే ప్రత్యేకంగా నిలిచాయి. పవన్‌ పోరాట సన్నివేశాలు సినిమాటిక్‌గా కాకుండా సహజసిద్ధంగా ఉండటంతో.. యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పవన్‌ పాడితే లోకమే ఆడదా..!

పవన్‌ టచ్‌ చేసిన విభాగాల్లో నేపథ్య గానమూ ఉంది. ఆయన పాడిన ప్రతి పాటా శ్రోతలను ఉర్రూతలూగించింది. యూట్యూబ్‌లో రికార్డులే రికార్డులు. ‘తమ్ముడు’ సినిమాతో గాయకుడిగా మారిన పవన్‌ ఇప్పటి వరకు 9 పాటలు (తాడి చెట్టు, బంగారు రమణమ్మలాంటి బిట్‌ సాంగ్స్‌సహా) పాడారు. అగ్ర కథానాయకుడిగా కొనసాగుతూ ఇన్ని పాటలు ఆలపించటం విశేషం.

పవన్‌ పాడితే.. హిట్టే!

క్రియేటివ్‌ వర్క్‌..!

పవన్‌ నిర్మాతగానూ వ్యవహరించారు. పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఛల్‌ మోహన్‌రంగ’ సినిమాలను నిర్మించారు.

సాంగ్స్ విజువ‌లైజ‌ర్‌గా..!

కొరియోగ్రఫీపైనా ప‌వ‌న్‌కు ఆస‌క్తి ఉంది. ఆయా పాట‌ల బీట్‌కు త‌గ్గట్టు ఎలాంటి స్టెప్పులు ఉంటే బాగుంటుందన్న విష‌యాన్ని కొరియోగ్రాఫ‌ర్‌ల‌కు చెప్తుంటారు. సాంగ్స్ విజువ‌లైజ‌ర్‌గా ప‌వ‌న్ చేసిన పాట‌లివీ.. గుడుంబా శంక‌ర్ చిత్రంలోని అన్ని పాట‌లు, అమ్మాయే స‌న్నగా, గ‌జ్జ ఘ‌ల్లుమ‌న్నాదిరో మినహా ‘ఖుషి’ సినిమాలోని అన్ని పాట‌లు, ‘పంజా’ టైటిల్ సాంగ్‌.

బ‌ల‌మైన పాత్రలు, స్ఫూర్తినిచ్చే పాటలు..!

వెంట‌వెంట‌నే సినిమాలు చేసేయాల‌నే ఆలోచ‌న ప‌వ‌న్‌కు ఉండ‌దు. త‌న వ్యక్తిత్వానికి ద‌గ్గర‌గా ఉండే పాత్రలు, అభిమానులను మెప్పించేగ‌లిగే ప‌వ‌ర్‌ఫుల్‌ రోల్స్‌, సందేశాత్మకమైన క‌థ‌ల‌నే ఎంపిక చేసుకుంటుంటారు. అందుకే.. 26 ఏళ్ల ప్రస్థానంలో ప‌వ‌న్ న‌టించిన సినిమాల సంఖ్య 26. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప‌వ‌న్ ప్రతి సినిమాలోని క్యారెక్టర్ క్యాచీగా ఉంటుంది. బ‌ద్రినాథ్‌, సిద్ధార్థ్‌రాయ్‌, గ‌ని, సంజ‌య్ సాహు, అర్జున్ పాల్వాయ్‌, మైఖేల్ వేలాయుదం, గ‌బ్బర్‌సింగ్‌.. ఇలా ఆయ‌న ఎంపిక చేసుకున్న పాత్రల పేర్లన్నీ ప్రేక్షకుల‌పై మంచి ప్రభావం చూపాయి. ప‌వ‌న్ సినిమాల్లోని పాట‌లూ ఓ రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా క‌థానాయ‌కుడి ప‌రిచ‌య గీతాలు, టైటిల్స్ సాంగ్స్ ఉర్రూత‌లూగిస్తూనే స్ఫూర్తినింపుతుంటాయి. అదే ప‌వ‌న్ స్పెషాలిటీ. ఇంతే ఇంతింతే (బాలు), లే లే లేలే (గుడుంబా శంక‌ర్‌), పంజా టైటిల్ సాంగ్, చ‌లొరే  చ‌లొరే (జ‌ల్సా) కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts