ఆ సినిమాతోనే రజనీ ‘సూపర్‌స్టార్’
ఆరడుగుల పొడవూ కాదు! కండల వీరుడు అంతకన్నా కాదు. నల్లగా, బట్టతలతో సన్నగా
ఇంటర్నెట్‌డెస్క్, ప్రత్యేకం: ఆరడుగుల పొడవూ కాదు! కండల వీరుడు అంతకన్నా కాదు. నల్లగా, బట్టతలతో సన్నగా సామాన్యుడిలా ఉంటాడు. కానీ ఏదో సమ్మోహనశక్తి. అభిమానులకు ఆయన ఆరాధ్యదైవం.. సూపర్‌స్టార్.. నిర్మాతల పాలిట కామధేనువు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. కానీ శివాజీకి రజనీకాంత్‌కు చాలా తేడా ఉంది. శివాజీ బస్సులో ఈల వేసిన కండక్టర్.. రజనీకాంత్ థియేటర్లలో ఈలలేయించుకున్న సూపర్‌స్టార్. శివాజీ దారి ‘రహదారి’, రజనీది ‘సింహపు దారి’. శివాజీ.. రజనీ అయ్యాడు.. రజనీ ఎప్పుడూ శివాజీని మర్చిపోలేదు. రజనీని దాదాసాహెబ్ వరించిన వేళ ఆయన గురించి ఈనాడు.నెట్ ప్రత్యేక కథనం.
శివాజీ పుట్టాడు... రజనీ కాదు..
శివాజీరావ్ పూర్వీకులది మహారాష్ట్ర. తండ్రి రామోజీరావు గైక్వాడ్. పోలీసు కానిస్టేబుల్. తల్లి రామాబాయి గృహిణి. శివాజీ బెంగళూరులో జన్మించారు. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. దీంతో చిన్నతనం నుంచే కూలి పనులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాథమిక విద్యను బెంగళూరులో పూర్తి చేసిన శివాజీ పదహారేళ్ల వయసులో ఉద్యోగ వేటలో పడ్డారు. 1966-73 మధ్య బెంగళూరు, చెన్నైలలో రకరకాల ఉద్యోగాలు చేశారు. చివరకు బస్సు కండక్టర్ ఉద్యోగంలో చేరారు. అదే శివాజీ జీవితాన్ని మలుపు తిప్పింది.
శివాజీదే ఆ స్టైల్ అంతా!
బాల్యంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే అడపాదడపా నాటకాలు వేసేవారు. వేసిన ప్రతీ నాటకంలో శివాజీకి ఓ ప్రత్యేక శైలి ఉండేది. అదే తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుందని అస్సలు ఊహించలేదు. కండక్టర్‌గా చేరిన తర్వాత విధి నిర్వహణలో ప్రతీది విభిన్నంగా చేసేవారు. బస్సు ఎంత కిక్కిరిసి ప్రయాణీకులు ఉన్నా అందరికీ టిక్కెట్లు 10 నిమిషాల్లో కట్ చేసి ఇచ్చేవారు. అదీ వేగం. ఆ వేగంలో కూడా స్టైల్ మిస్సయ్యేది కాదు. ఓసారి నాటకంలో ‘దుర్యోధనుడి’ వేషం వేయాల్సి వచ్చింది. అప్పటికి ఆ వేషం చాలా మంది వేసి ఉన్నారు. కానీ శివాజీలాగా ఎవరూ హావభావాలు పలికించలేదు. ఇదే అతని స్నేహితుడు రాజ్ బహదూర్ దృష్టిని ప్రధానంగా ఆకర్షించింది. ‘నీలో ఓ చక్కని నటుడు దాగి ఉన్నాడు. కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతే ఆ నటుడు కనుమరుగైపోతాడు’ అంటూ వెన్నుతట్టి డబ్బులిచ్చి మరీ మద్రాసు పంపాడు శివాజీని.
రజనీకాంత్ పుట్టాడు
శివాజీరావ్‌గా మద్రాసులో నటన శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు! కాలే కడుపుతోనే కళామతల్లిని నమ్ముకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. శివాజీని కూడా ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పటికే సినిమాల్లో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీరావ్‌కు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆయన తీసిన సినిమా మేజర్ చంద్రకాంత్‌లో ఓ పాత్ర పేరు రజనీకాంత్. దీంతో ఈ పేరును శివాజీకి పెట్టాలని నిర్ణయించారు. దీంతో శివాజీరావుకు ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామిని ఆరాధించే గురువారం నాడు రజనీకాంత్‌గా నామకరణం చేశారు. తొలి సినిమానే రజనీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
కమల్‌ను చూసి నటించడం నేర్చుకున్న రజనీ
అవును! కమల్‌హాసన్ నటనను చూస్తూ తాను నటుడిగా ఎదిగాను అంటారు రజనీ. అప్పుడు ‘అవరగళ్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. రజనీ బయట ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఈ విషయం తెలిసి బాలచందర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే రజనీకాంత్‌ని సెట్ లోపలకి రమ్మన్నారు. ‘సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లావా? కమల్ నటిస్తున్నాడు జాగ్రత్తగా గమనించు. అలా గమనిస్తే నీ నటన మెరుగుపడుతుంది’ అని మందలించారు. దీంతో అప్పటి నుంచి కమల్ నటనను దగ్గరుండి చూసేవారు రజనీ. అయితే కమల్ ఉన్న పరిశ్రమలో తానూ రాణించాలంటే ఇంకేదో భిన్నంగా చేయాలి, అదే రజనీ చేశారు.
శివాజీ ఆశలను నిజం చేసిన రజనీ
నటుడిగా రజనీ అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వచ్చింది చిన్న పాత్రే అయినా తన స్టైల్, మేనరిజమ్స్‌తో అదరగొట్టేస్తున్నారు. ‘పదినారు వయదినిలె’(తెలుగులో పదహారేళ్ల వయసు) కోసం కమల్ చాలా కష్టపడుతున్నారు. సుమారు 60 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. కానీ అందులో రజనీ పాత్ర షూటింగ్ మూడు రోజుల్లో అయిపోయింది. అదీ విలన్ పాత్ర. కానీ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో రజనీకాంత్ డైలాగ్‌లు, మేనరిజమ్స్‌కు చప్పట్లే చప్పట్లు. రజనీ మరో అరుదైన ఘనతనూ దక్కించుకున్నారు. తొలి చిత్రం ‘అపూర్వరాగంగళ్’(తమిళం) కాగా, రెండోది కన్నడలో ‘సంగమ’. మూడోది తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఇలా తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించారు.
రజనీ సూపర్‌స్టార్ అయ్యాడు
తన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్’ అని వేశారు.
శివాజీ అనుకున్నాడు రజనీ చేశాడు!
ఓ రోజు రజనీ, రఘునందన్, బహదూర్ సరదాగా మాట్లాడుకుంటూ బెంగళూరులో రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఒక్కసారిగా రజనీలోని శివాజీ మేల్కొన్నాడు. జేబులో ఐదు వేల రూపాయల కట్ట తీసి రఘుకి ఇచ్చారు. గుడ్డనహళ్లి నుంచి చామరాజ్‌పేట వెళ్లేలోపు ఖర్చుచేయాలి లేకపోతే పదివేలు తిరిగి ఇవ్వాలి.. ఇదీ పందెం. రఘుకి శివాజీ మనసు తెలుసు. మొదట బజ్జీలమ్మే చోటుకు వెళ్లి పక్కనే వాళ్ల చిన్నారి ఆడుకుంటుంటే రూ.500 ఇచ్చారు. వారు రఘుకి నమస్కరిస్తుంటే దూరం నుంచి రజనీ, బహదూర్ నవ్వుతూ చూశారు. అలా తోపుడు బండితో అవస్థపడే వృద్ధుడు, కాగితాలు ఏరుకునే కుర్రాడు, దీనావస్థలో ఉన్న వృద్ధ దంపతులు, అనాథ పిల్లలు ఇలా చాలా మందికి డబ్బు పంచేశారు. డబ్బు కాగితాల కన్నా నిస్సహాయుల కళ్లలో ఆనందాన్ని విలువ కట్టే ఇలాంటి సాయంత్రాలు, పందేలు ఆ స్నేహితులు చేస్తూనే ఉన్నారు. శివాజీలాగా ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి రజనీ సాయం చేసేవారు.
శివాజీకి ఆధ్యాత్మిక దారి చూపిన రజనీ
రజనీకాంత్ అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. రజనీ స్టార్ హోదా అనుభవిస్తున్న సమయంలో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. మనశ్శాంతిని కోల్పోయారు. అప్పుడే అమితాబ్ ఆయనకు ఓ సలహా ఇచ్చారు. ‘స్వామి సచ్చిదానంద ఆశ్రమంలో కొద్దిరోజులు ఉండి చూడండి. మీరు కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందేమో’ అన్నారు. ఆయన మాటతో రజనీ తొలిసారి హిమాలయాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. అక్కడ రోజుల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు.
రజనీకాంత్ ఒక్కరోజులో సూపర్‌స్టార్ అయిపోలేదు. దాని వెనుక ఎన్నో రోజుల కృషి, శ్రమ ఉన్నాయి. సినిమాల్లో సూపర్‌స్టార్ అయిన ఆయన నిజ జీవితంలో చాలా సాదాసీదాగా ఉంటారు. ఆయన కెరీర్లో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. తాజాగా ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో రజనీ అవార్డుల ముత్యాల హారంలో ఓ కలికితురాయి వచ్చి చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్’..?