Sarath Babu: ఆమదాల వలస అందగాడు... సిక్కోలు చిన్నోడు

మనోహరమైన రూపం... ప్రత్యేకమైన స్వరంతో... ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయి వాటికి సహజత్వాన్ని తీసుకొచ్చిన ప్రతిభాశాలి... ప్రముఖ నటుడు శరత్‌బాబు.

Updated : 23 May 2023 14:24 IST

మనోహరమైన రూపం... ప్రత్యేకమైన స్వరంతో... ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయి వాటికి సహజత్వాన్ని తీసుకొచ్చిన ప్రతిభాశాలి... ప్రముఖ నటుడు శరత్‌బాబు.

‘ఇది కథ కాదు’ భరణి...

‘సాగర సంగమం’ రఘు

‘సితార’ జమిందార్‌...

‘జీవనజ్యోతి’ శ్రీధర్‌

‘కాంచన గంగ’లో జయసింహ

‘సంసారం ఒక చదరంగం’లో ప్రకాశ్‌..

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని ఇలాంటి పాత్రలెన్నో చేసి మెప్పించారు శరత్‌బాబు. తరాలు మారుతున్నా నిత్య నూతనం అనిపించేలా తన నటనతో ఆయా పాత్రల్ని సజీవంగా నిలిపిన ఘనత ఆయనది.  1970, 80, 90, 2000 దశకాల్లో భాషతో సంబంధం లేకుండా బలమైన పాత్రల్ని తన భుజాన వేసుకుని రక్తి కట్టించిన నటుడు.  తనకి మాత్రమే ప్రత్యేకం అనిపించేలా హుందాతనం ప్రదర్శిస్తూ... తనదైన అనుభవాన్ని రంగరిస్తూ పాత్రలపై ప్రభావం చూపించారాయన. స్నేహితుడు, ప్రేమికుడు, సోదరుడు, అధికారి, మనలో ఒకడు, ప్రతినాయకుడు... ఇలా ఎన్నో పాత్రలపై తనదైన ముద్ర వేశారు. ఆమదాల వలస అందగాడు... సిక్కోలు చిన్నోడు అంటూ ఆయన్ని ముద్దుగా పిలుచుకునేవారు తెలుగు ప్రేక్షకులు.

కాలేజీ చదువులతోపాటు... ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు శరత్‌బాబు. కాలేజీలో చదువుకునేటప్పుడే భమిడిపాటి రాధాకృష్ణ ‘దొంగాటకం’ నాటికలో నటించాక... ‘నీలో నటుడు ఉన్నాడ’ని అధ్యాపకులు భుజం తట్టారట. ఆయన రూపం చూసి స్నేహితులు కూడా సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఒక పక్క పోలీస్‌ అధికారి కావాలనే కోరిక... మరోవైపు ఆమదాల వలసలో కుటుంబానికున్న హోటల్‌ బాధ్యతలు తనపై ఉన్నప్పటికీ డిగ్రీ పూర్తి కాగానే స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు శరత్‌బాబు.

‘రామరాజ్యం’తో పరిచయం...

చిత్ర పరిశ్రమలో తెలిసినవాళ్లెవరూ లేరు. అక్కడికి వెళ్లినా ఎలా నెగ్గుకురావాలో తెలియదు. అందుకే కొత్త నటుల్ని పరిచయం చేసే ఆదుర్తి సుబ్బారావుకి ఫొటోలు పంపించారు. ఆయన స్పందించి ఇంటర్వ్యూకి పిలవడంతో మద్రాస్‌ రైలెక్కారు. అక్కడికి వెళ్లాక ‘నేను హిందీ సినిమా చిత్రీకరణలో ఉన్నాను. మళ్లీ పిలుస్తాను, అప్పుడు వచ్చి కలవండి’ అని చెప్పి వెళ్లిపోయారట. వచ్చాం కదా అని...నటుల్నైనా చూసి వెళ్దామనుకుని మద్రాస్‌లోనే ఉండగా రామావిజేత ప్రొడక్షన్స్‌ వారి కొత్తహీరోల ప్రకటనని చూసి మరో ఇంటర్వ్యూకి హాజరయ్యారు. బాబూరావు, ప్రభాకర్‌ ఆ చిత్రానికి దర్శకనిర్మాతలు. ఇంటర్వ్యూలో చివరికి మిగిలిన ముగ్గురిలో శరత్‌బాబు ఒకరు. స్క్రీన్‌ టెస్ట్‌ తర్వాత శరత్‌బాబు ఎంపికయ్యారు. అలా ‘రామరాజ్యం’తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావు, జగ్గయ్య, సావిత్రి, చంద్రకళ, చంద్రమోహన్‌, రోజారమణితో కలిసి నటించారు. 1973లో విడుదలైన ఆ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. కథానాయకుడిగా ప్రయాణం మొదలైనా ‘నోము’, ‘అభిమానవతి’ తదితర చిత్రాల్లో వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రల్ని పోషించారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘నిళిల్‌ నిజమా గిరదు’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. అందులో కమల్‌హాసన్‌, అనంత్‌, శరత్‌బాబు హీరోలు. ఆ తర్వాత బాలచందర్‌ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలన్నింటిలోనూ శరత్‌బాబు కీలక పాత్రలు పోషించారు. ‘సీతాకోక చిలుక’, ‘సితార’, ‘సాగరసంగమం’, ‘కాంచనగంగ’, ‘అనురాగబంధం’, ‘స్వాతిముత్యం’, ‘రాధాకళ్యాణం’, ‘పెళ్ళీడు పిల్లలు’, ‘శిక్ష’, ‘అభినందన’, ‘అయ్యప్పస్వామి మహాత్మ్యం’... ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. కె.విశ్వనాథ్‌, బాపు, భారతిరాజా, మహేంద్రన్‌, మణిరత్నం తదితర అగ్ర దర్శకుల చిత్రాల్లో శరత్‌బాబు నటించారు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణికం... ఇలా భిన్న రకాల చిత్రాలు చేసి మెప్పించారు. కొన్నేళ్లుగా ఆయన ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చారు. 2021లో ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించారు. అందులో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా పాత్రపై తనదైన ముద్రవేశారు. ఈ నెల 26న విడుదల కానున్న ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ పాత్రని పోషించారు శరత్‌బాబు. అదే ఆయన చివరిగా చేసిన పాత్ర.


సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో... 

నిర్మాతగానూ గుర్తుండిపోయే చిత్రాల్ని రూపొందించారు. ‘గాంధీనగర్‌ రెండోవీధి’, ‘ఆగస్టు 15 రాత్రి’, ‘వింత ఇల్లు’, ‘సొంతగోల’ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. నటుడిగా, నిర్మాతగా  ఏడు నంది పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహనటుడిగా ‘సీతాకోక చిలుక’, ‘ఓ భార్య కథ’, ‘నీరాజనం’ చిత్రాలకిగానూ పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సహనటుడిగా ‘మలయన్‌’ సినిమాకి పురస్కారం అందుకున్నారు.


బుల్లితెరపైనా...

వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా ఆయన తనదైన ప్రభావం చూపించారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’ ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ‘ఎండమావులు’, ‘జనని’, ‘అగ్నిగుండాలు’ తదితర ధారావాహికల్లోనూ నటించి ఇంటింటికీ చేరువయ్యారు. ‘గాంధర్వమాల’ అనే ధారావాహికని స్వయంగా నిర్మించారు.


ఖాకీ దుస్తులు.. ఉద్విగ్న క్షణాలు

విద్యార్థి దశలో ఐపీఎస్‌ కావాలని కలలు కనేవారు శరత్‌బాబు. కానీ సినిమా రంగంలోకి ప్రవేశించారు. నిజ జీవితంలో పోలీస్‌ కావాలన్న కల నెరవేరకపోయినా..  సినిమాల్లో మాత్రం పోలీస్‌ పాత్రలో మెరిశారు. పాత్ర కోసం ఖాకీ ధరించిన ప్రతిసారీ ఉద్విగ్నంగా ఉండేదని చెప్పేవారు శరత్‌బాబు. చిరంజీవితో కలిసి నటించిన ‘యమకింకరుడు’లో తొలిసారిగా పోలీస్‌ దుస్తులు ధరించానని ఆయన ఇదివరకు ‘ఈనాడు’తో గుర్తు చేసుకున్నారు.


వెండితెర ‘జమిందార్‌’

సీనియర్‌ నటుడు శరత్‌బాబు ఇక లేరన్న విషయం చిత్రసీమలో విషాదాన్ని నింపింది. దాదాపు ఐదు దశాబ్ధాలు నట ప్రస్థానాన్ని కొనసాగించిన శరత్‌బాబుకి దక్షిణాదిలోని చిత్ర పరిశ్రమలన్నిటితోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతో కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్న తమ సన్నిహితుడు శరత్‌బాబు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.


‘అందం, హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శరత్‌బాబుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. పలు చిత్రాల్లో ఆయన నా సహ నటుడు. వెండితెర ‘జమిందార్‌’, ప్రముఖ నటుడు శరత్‌బాబు మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకి, అభిమానులకి నా ప్రగాఢ సంతాపం’’.

 చిరంజీవి


చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు శరత్‌బాబు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. క్రమశిక్షణ, అంకితభావం గల నటుడు. ఆయనతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. శరత్‌బాబు మరణం పరిశ్రమకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.

 నందమూరి బాలకృష్ణ


‘‘భారతీయ సినిమాకి శరత్‌బాబు చేసిన సేవలు ఎప్పటికీ  గుర్తుండిపోతాయి. ఆయన ఇక లేరన్న విషయం ఎంతో బాధాకరం.  ఆయన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి నా సానుభూతి’’.

 ఎన్టీఆర్‌


‘‘సున్నిత హృదయులు, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మంచి మనిషి శరత్‌బాబు. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి’’.

 రవితేజ


రత్‌బాబు గాత్రం, ఆయన నటన, తెరపై  కనిపించే విధానం ఎన్నటికీ మరపురానిది.

 నాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు