Tollywood Actress: ఇక్కడ ఆరంభించారు.. అక్కడ అదరగొడుతున్నారు!
టాలీవుడ్‌లోనే సినీ జీవితాన్ని మొదలుపెట్టి, కోలీవుడ్‌లో సక్సెస్ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు కొంతమంది హీరోయిన్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ జీవితాన్ని మొదలుపెట్టి, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు కొందరు హీరోయిన్లు. కోలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కిన తర్వాత తిరిగి తెలుగులోనూ నటించి మెప్పిస్తున్నవారు కొందరైతే, తమిళ పరిశ్రమకే పరిమితమైనవారు మరికొందరు. ఈ మధ్యే సోడాల శ్రీదేవిగా అలరించిన ఆనంది, దివ్యగా మెప్పించిన సునైనలు తిరిగి మొదటి అడుగులు పడిన చోటుకి వచ్చినవారే. అలా కోలీవుడ్‌లో తమదైన ముద్రేసిన భామలెవరున్నారో ఓ సారి చూద్దాం.
మన సోడాల శ్రీదేవీ.. అక్కడ సూపర్‌హిట్
సుధీర్ బాబు సరసన సోడాల శ్రీదేవిగా ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది ఆనంది. ఈ ఏడాదే వచ్చిన ‘జాంబిరెడ్డి’లోనూ ఆమే హీరోయిన్. కోలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిందామె. తమిళనాట ‘కయల్’తో తమిళ ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత విశారణై(విచారణ), ‘పరియెరుం పెరుమాళ్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆనందిని నటిగా తొలి అడుగులు పడింది మాత్రం టాలీవుడ్‌లోనే. ‘ఈ రోజుల్లో’ సినిమాలోని ఓ పాటలో తొలిసారి తెరపై మెరిసిన ఆమె ఆ తర్వాత ‘బస్టాప్’లోని సీమ పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకుంది. రామ్ చరణ్ ‘నాయక్’లోనూ ఓ సన్నివేశంలో కనిపిస్తుంది. అయితే తెలుగులో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో చెన్నై మకాం మార్చి అక్కడ హిట్లు కొట్టింది. ఈ ఏడాదే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలో మలయాళంలో కూడా అరంగేట్రం చేయబోతుంది.
టెన్త్ క్లాస్ భామే..ఈ చోరుడి భార్య
థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ‘రాజ రాజ చోర’లో శ్రీవిష్ణు భార్య విద్యగా నటించింది సునైన. ఆమె నటిగా తొలి పాఠాలు నేర్చింది ఇక్కడే. ‘కుమార్ వర్సెస్ కుమారి’తో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం ‘టెన్త్ క్లాస్’లోనూ సెకండ్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళనాడుకు వెళ్లి పలుచిత్రాల్లో నటించింది. 2019లో వచ్చిన ‘సిల్లు కరుపట్టి’ సినిమాలో సముద్రఖని భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ‘నీర్పరవై’ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ నామినేషన్ దక్కించుకొని కోలీవుడ్ చూపును తనవైపు తిప్పుకొంది. విజయ్ ‘తెరి’, విజయ్ సేతుపతి ‘తొండన్’తో పాటు సుమారు 20 తమిళ చిత్రాల్లో నటించింది. తిరిగి ‘రాజ రాజ చోర’తో తెలుగు ప్రేక్షకులను పలకరించి సూపర్‌హిట్ కొట్టింది.
టాప్ హీరోలతో శ్రీదివ్య
తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్‌గా మారిన అచ్చమైన తెలుగింటి అమ్మాయి శ్రీదివ్య. బాల నటిగా పరిచయమైన శ్రీదివ్య రవిబాబు ‘మనసారా’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ‘బస్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రాలతో హిట్లు కొట్టిన ఆమె ఆ తర్వాత కోలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ టాప్ హీరోలతో ఆడిపాడింది. అక్కడామె చేసిన తొలిచిత్రంతోనే అవార్డులు దక్కడంతో అవకాశాలు వరుస కట్టాయి. మధ్యలో ‘సైజ్ జీరో’, ‘కేరింత’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కానీ ఇక్కడే హీరోయిన్‌గా స్థిరపడలేదు. తిరిగి కోలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోందీ భామ.
స్వాతికి తొలి హిట్ అక్కడే
‘డేంజర్’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన స్వాతికి హీరోయిన్‌గా తొలి హిట్ దక్కింది కోలీవుడ్‌లోనే. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో నటించినప్పటికీ అందులో ఆమెది హీరోయిన్ చెల్లెలి పాత్ర. స్వాతి 2008లో నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. అదే ఏడాది వచ్చిన ‘అష్టాచమ్మా’తో టాలీవుడ్‌లోనూ హిట్ కొట్టింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
కోలీవుడ్‌కే పరిమితమైన బిందుమాధవి
‘ఆవకాయ బిర్యాని’తో హీరోయిన్‌గా అడుగుపెట్టిన తెలుగమ్మాయి బిందుమాధవి. ‘బంపర్ ఆఫర్’, ‘పిల్ల జమిందార్’ లాంటి సూపర్ హిట్లు కొట్టినా హీరోయిన్‌గా ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాలకే పరిమితమైంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న మూడు చిత్రాలూ తమిళంలోవే కావడం విశేషం.
అవకాశాలు రాకపోవడం వల్లేనా?
తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడం కారణంగానే తమిళంలో హీరోయిన్లుగా స్థిరపడ్డామని చెబుతుంటారీ ముద్దుగుమ్మలు. శ్రీ దివ్య, బిందుమాధవి బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించిన సందర్భాలున్నాయి. ‘పెళ్లి చూపులు’తో సెన్సేషనల్ హిట్టు కొట్టిన రీతూ వర్మకు కూడా తెలుగునాట తగిన అవకాశాలు దొరలేదు. ధనుష్, దుల్కర్, విక్రమ్ ఇలా ఇతర పరిశ్రమల్లోని స్టార్‌హీరోల సరసన మాత్రమే అవకాశాలు అందిపుచ్చుకుంది, తెలుగుకు వచ్చే సరికి కొన్ని చిత్రాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రీతూవర్మ రెండు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నాని హీరోగా ఆమె చేసిన ‘టక్ జగదీష్’ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్ కానుండగా, నాగశౌర్యతో చేసిన ‘వరుడు కావలెను’ కూడా త్వరలో విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక
-
Sports News
Cricket: ఫుల్ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్
-
Movies News
Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య
-
Politics News
BRS: రైతుల తుపాన్ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్