Trisha: 20 ఏళ్ల కెరీర్‌.. ఇప్పటికీ హీరోయిన్‌గానే!

త్రిష నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ఏప్రిల్‌ 28న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె పోషించిన పలు పాత్రలు గుర్తుచేసుకుందాం..

Updated : 28 Apr 2023 12:18 IST

కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతారు. అందం ఉన్నా, ఎంత గొప్పగా నటించినా, ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నా అవకాశాలు అందుకోలేకపోయి ‘తెర’మరుగవుతారు. అలాంటి వాటికి చెక్‌ పెడుతూ కొద్ది మంది మాత్రమే హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఏళ్లపాటు కెరీర్‌ కొనసాగిస్తారు. అలాంటి వారిలో త్రిష (Trisha Krishnan) ఒకరు. తన తాజా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) శుక్రవారం విడుదలకాబోతున్న సందర్భంగా.. ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు..

సహాయనటిగా పరిచయం..

చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌ వైపు వెళ్లిన త్రిష ‘జోడి’ (తమిళ్‌) సినిమాతో 1999లో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్‌ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) సరసన నటించే అవకాశం అందుకున్నారు. హీరోయిన్‌గా ఆమె నటించిన తొలి సినిమా పేరు ‘మౌనం పెసియదే’. ఆ తర్వాత ‘నీ మనసు నాకు తెలుసు’ (Nee Manasu Naaku Telusu)తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

‘వర్షం’ పడితే శైలజ గుర్తొస్తుంది..!

త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం ‘వర్షం’ (Varsham). ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో శైలజ అలియాస్‌ శైలు పాత్రలో కనిపించి మాయ చేశారామె. తండ్రి మాటకు ఎదురుచెప్పలేక ఇష్టంలేకపోయినా సినిమాల్లో నటించే మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా ఆమె ఒదిగిపోయారు. ఆనందమైనా, బాధనైనా శైలు వర్షంతో పంచుకునే సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో నిలిచాయి. వర్షంతో మాటలేకాదు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ పాట పాడి మురిపించారామె. వర్షం వచ్చినప్పుడల్లా సినీ ప్రియులంతా ఆ పాటను, శైలజ పాత్రను గుర్తుచేసుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు ప్రేక్షకుల ప్రశంసలతోపాటు ఉత్తమ నటిగా ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు అందుకున్నారు.

ప్రతినాయికగా..

తెలుగు, తమిళ్‌కు చెందిన దాదాపు అగ్ర హీరోలందరితో ఆడిపాడిన త్రిష ‘కోడి’లో నెగెటివ్‌ రోల్‌లోనూ తన సత్తా చాటారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో లోకల్‌ పొలిటిషియన్‌ రుద్ర పాత్రలో కనిపించి, ప్రేక్షకులు, అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. తెలుగులో ఇదే సినిమా ‘ధర్మయోగి’గా అలరించింది. ‘కెరీర్‌లో నేను చేసిన అతిపెద్ద సాహసం ఇదే’ అంటూ రుద్ర క్యారెక్టర్‌ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

సినిమాల్లోకి రాకముందు..

బ్యాచిలర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పూర్తి చేసిన త్రిష క్రిమినల్‌ సైకాలజిస్ట్‌ కావాలని అనుకునేవారు. పదహారేళ్ల వయసులో ‘మిస్‌ మద్రాస్‌’ టైటిల్‌ గెలుచుకున్నారు. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ వేదికలపై మెరవడంతో ఆమెకు సినీ అవకాశాలు దక్కాయి.

వివాదం..

త్రిష వివాదాల్లో చిక్కుకున్నారంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్‌ చేయడంతో అప్పట్లో దుమారం రేగింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ స్పందించి ఆమెను బాధపెట్టొందంటూ తమిళనాడు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. 2016లో జరిగిందా ఘటన.

అమ్మంటే ప్రేమ..

త్రిషకు అమ్మ ఉమ అంటే ఎంతో ప్రేమ. షూటింగ్స్‌కు ఇద్దరూ కలిసి వెళ్తుంటారు. త్రిష యానిమల్‌ లవర్‌. అందుకే గుడ్‌విల్‌ అనే యానిమల్‌ ఎన్జీవోకు ఆమె అంబాసిడర్‌గా ఉన్నారు.

ఇష్టాలు..

విహార యాత్రలు చేయడంలో ముందుంటుంటారు త్రిష. చెన్నై తర్వాత ఆమెకు బాగా నచ్చిన ప్రదేశం న్యూయార్క్‌. ఇప్పటికే పలు దేశాలు తిరిగొచ్చిన ఆమెకు ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలని కోరిక. త్రిష ముద్దు పేరు హనీ. మెచ్చే నటులు: కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, ఆమిర్‌ఖాన్‌.

కుందవై.. మరోసారి

నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో అన్నయ్యే ప్రపంచంగా బతికే సిరి పాత్రలో త్రిష ఒదిగిన తీరు కట్టిపడేస్తుంది. అలాగే ‘అతడు’లో పూరి పాత్రలో నవ్వులు పంచింది. ఇక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరు’ చిత్రంలో ఆమె నటన యువతను మెప్పించింది. అలాగే ‘కృష్ణ’లోని సంధ్య, ‘బుజ్జిగాడు’లోని మేఘన అలియాస్ చిట్టి, ‘కింగ్‌’లోని శ్రావణి, ‘నమో.. వెంకటేశ’లోని పూజ పాత్రలతో త్రిష విశేషంగా ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో కలిపి సుమారు 60 సినిమాల్లో నటించారు. ఆమె కొంతకాలంగా నేరుగా తెలుగు చిత్రాల్లో నటించకపోయినా డబ్బింగ్‌/పాన్‌ ఇండియా సినిమాలతో ఇక్కడ సందడి చేస్తున్నారు. ఆ క్రమంలోనిదే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ (Ponniyin Selvan 1). ఇందులో ఆమె రాజకుమారి కుందవై పాత్ర పోషించి, ప్రశంసలు పొందారు. తరగని అందంతో రాజసం ఉట్టిపడే పాత్రలో ఒదిగిపోయారు. గతేడాది విడుదలైన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ తెరకెక్కింది. కుందవైగా మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నారు త్రిష.

కెరీర్‌ ప్రారంభమై 20ఏళ్లకుపైగా అయినా కీలక పాత్రలో, అతిథి పాత్రల్లోనో కాకుండా హీరోయిన్‌గా రాణిస్తూ త్రిష వర్ధమాన తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం.. మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్‌ (Mohanlal) సరసన ‘రామ్‌’ (Ram), కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సరసన ‘లియో’ (Leo)లో ఆమె నటిస్తున్నారు. ‘ది రోడ్‌’ అనే నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తున్నారు. ‘‘మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని అభిమానులకు క్రెడిట్‌ ఇచ్చే త్రిషకు ఆల్‌ ది బెస్ట్‌.

- ఇంటర్నెట్‌ డెస్క్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని