Tollywood: వారసుల తోడుగా.. వినోదాల పండగ

తెరపై ఇద్దరు కథానాయకులు కనిపిస్తున్నారంటేనే.. ఈల చేసి గోల చేయడానికి ప్రేక్షకులంతా థియేటర్ల ముందు బారులు కట్టేస్తారు. అదే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారలు కలిసి నటిస్తున్నారంటే బాక్సాఫీస్‌ ముందు కనిపించే సందడి మరోస్థాయిలో ఉంటుంది.

Updated : 19 Mar 2023 07:17 IST

తెరపై ఇద్దరు కథానాయకులు కనిపిస్తున్నారంటేనే.. ఈల చేసి గోల చేయడానికి ప్రేక్షకులంతా థియేటర్ల ముందు బారులు కట్టేస్తారు. అదే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారలు కలిసి నటిస్తున్నారంటే బాక్సాఫీస్‌ ముందు కనిపించే సందడి మరోస్థాయిలో ఉంటుంది. ఊర్లో జరగాల్సిన జాతర థియేటర్ల ముందుకొచ్చినట్లే అనిపిస్తుంది. అయితే ఈ తరహా కథలు, కలయికల్ని సిద్ధం చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఇలాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నా.. అరుదుగా మాత్రమే ఇందుకు తగ్గ కథలు కుదురుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి అపురూప కలయికల్లో తెలుగులో పలు  సినిమాలు సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

థానాయకుడు పవన్‌ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తే చూడాలన్నది మెగా అభిమానుల కోరికే కాదు.. సగటు సినీప్రియుల కోరిక కూడా. ఇప్పుడది ‘వినోదాయ సిథం’ రీమేక్‌ ద్వారా కార్యరూపంలోకి వచ్చింది. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో పునర్నిర్మిస్తోంది. మాతృకను తెరకెక్కించిన సముద్రఖని ఈ తెలుగు వెర్షన్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వినూత్నమైన ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్‌ దేవుడిగా కనిపించనుండగా.. ఆయన భక్తుడిగా సాయితేజ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నాగార్జున.. ఆయన పెద్ద తనయుడు నాగచైతన్య ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కానీ, చిన్న కొడుకు అఖిల్‌తో నాగ్‌ ఇంత వరకు కలిసి పని చేయలేదు. అయితే ఇప్పుడీ కలయికలో ఓ సినిమా సిద్ధమవుతోంది. ఇందుకోసం దర్శకుడు మోహన్‌ రాజా కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని నాగ్‌, మోహన్‌ రాజా ఇద్దరూ ధృవీకరించారు. నాగార్జున 100వ సినిమాగా ఇది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌ ప్రస్తుతం ప్రసన్న కుమార్‌ బెజవాడతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే అఖిల్‌తో చేయనున్న చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. నటుడు మంచు మోహన్‌బాబు.. ఆయన తనయులు విష్ణు, మనోజ్‌ ఇప్పటికే పలు చిత్రాల్లో కలిసి సందడి చేశారు. కానీ, మోహన్‌బాబు తన కూతురు లక్ష్మీ ప్రసన్నతో ఇంత వరకు తెర పంచుకోలేదు. ఇప్పుడా లోటు ‘అగ్ని నక్షత్రం’తో తీరనుంది. వంశీకృష్ణ మళ్ల తెరకెక్కిస్తున్న చిత్రమిది. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


అదే అసలు సవాల్‌..

సాధారణంగా మల్టీస్టారర్‌ కథలు సిద్ధం చేయడమంటేనే ఎంతో సవాల్‌తో కూడిన వ్యవహారం. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ సిద్ధం చేయడమంటే అది కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కలయికల్ని ఆయా తారల కుటుంబాలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా చూస్తుంటాయో.. ప్రేక్షకులు అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంటారు. ఆయా స్టార్ల ఇమేజ్‌.. ఆ కుటుంబ అభిమానుల్లో ఉండే అంచనాలు.. మార్కెట్‌ లెక్కలు.. ఇలా బోలెడన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్స్‌ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఫలితం ఏమాత్రం అటు ఇటైనా ఆ చిత్రం ఆ స్టార్‌ ఫ్యామిలీకి చేదు జ్ఞాపకంగా మిగలడమే కాక ప్రేక్షకుల్ని తీవ్ర వేదనకు గురిచేస్తుంది.


అందరి కళ్లు ఇటు వైపే..

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. అయితే బాలకృష్ణ తన తనయుణ్ని ‘ఆదిత్య999 మ్యాక్స్‌’తో తెరకు పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇందుకోసం తానే ఓ కథ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ‘ఆదిత్య369’కు సీక్వెల్‌గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది పట్టాలెక్కించనున్నట్లు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానుల్లోనూ.. అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన కథానాయకులు సూర్య, కార్తి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలన్నది ప్రేక్షకుల ఎన్నో ఏళ్ల కోరిక. ఇది ‘ఖైదీ2’తో నెరవేరే అవకాశముందని తమిళ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ తొలి భాగం కథను ‘విక్రమ్‌’తో ముడిపెట్టిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌.. అందులో సూర్యను రోలెక్స్‌గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాత్ర ‘ఖైదీ’ రెండో భాగంలోనూ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘ఖైదీ’ చిత్రంలో కార్తి పదేళ్లు జైలులో ఉండి విడుదలైనట్లు చూపించారు కానీ, తనెందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది చూపించలేదు. అయితే దీనికి రోలెక్స్‌ పాత్రకు సంబంధం ఉంటుందని.. దీన్ని రాబోయే ‘ఖైదీ2’లో చూపించనున్నారని ప్రచారం వినిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు