village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్‌ కొట్టేట్టు!

ఊరి నేపథ్యంలో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న సినిమాలు.. అదే ఇతివృత్తంతో రాబోతున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా థీమ్‌ ఏంటంటే?

Updated : 06 Jun 2023 13:31 IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు పల్లెటూరి కథలు విరివిగా తెరకెక్కేవి. కొన్నాళ్లుగా పూర్తిస్థాయిలో కాకుండా అడపాదడపా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కనిపించింది. రియలిస్టిక్‌ స్టోరీలకు ఆదరణ పెరుగుతుండడంతో మళ్లీ ఊరి కథలు తెరపైకి వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వచ్చిన ‘రంగస్థలం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ తదితర చిత్రాలు అలా వచ్చి విజయం సాధించినవే. ప్రతీకార గాథలు, కుటుంబ అనుబంధాలు... ఇలా ఈ ఏడాది ఒక్కో అంశంతో ఒక్కో చిత్రం పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కి హిట్‌ అందుకున్నాయి. ఇంకొన్ని రాబోతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దామా..

అనుబంధాలే బలం.. బలగం

చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకున్న చిత్రం.. ‘బలగం’ (Balagam). తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో జరిగే ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. కుటుంబ బంధాలే ప్రధానంగా రూపొందిన ఈ కథ.. ఎంతోమందిలో మార్పు తీసుకొచ్చింది. పలు కారణాలతో మాట్లాడుకోని సోదరులను, బావ- బావమరిదిలను కలిపింది. ఎంతోమందితో కన్నీళ్లు పెట్టించిన ఈ స్టోరీ మంచి వసూళ్లతోపాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ‘ఇది మన కథ’ అని ఫీలైన కొందరు తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరీ ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ప్రియదర్శి (Priyadarshi Pulikonda), కావ్య కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyan Ram), మురళీధర్‌ గౌడ్‌, సుధాకర్‌ రెడ్డి, రూపా లక్ష్మి, జయరాం, విజయ్‌ లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ వేణు ఎల్దండి (Venu Yeldandi) తెరకెక్కించారు. మార్చి 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (amazon prime video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


వీర్లపల్లిలో దసరా..

సింగరేణి సమీపంలోని వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన చిత్రం.. ‘దసరా’ (dasara). నాని (nani), కీర్తిసురేశ్‌ (keerthy suresh), దీక్షిత్‌ శెట్టి (Dheekshith Shetty) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించారు. వీర్లపల్లిలో రాజకీయం, మద్యపాన నిషేధం, ప్రతినాయకుడు హీరోయిన్‌పై మోజు పడడం, విలన్‌పై హీరో ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమాలో కనిపిస్తాయి. వీటితోపాటు ధరణి (నాని), సూరి (దీక్షిత్‌శెట్టి), వెన్నెల (కీర్తిసురేశ్‌) స్నేహాన్ని, వారి మధ్య ప్రేమని చూడొచ్చు. వీర్లపల్లి వాతావరణానికి ప్రభావితులైన ప్రేక్షకులు సినిమాకి మంచి విజయాన్ని అందించారు. మార్చి 30న బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లకిపైగా వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (netflix)లో సందడి చేస్తోంది.


థ్రిల్‌ పంచిన విరూపాక్ష

థ్రిల్లర్‌/హారర్‌ జానర్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. ఆ నేపథ్యంలో రూపొంది, ఏప్రిల్‌ 21న విడుదలైన ‘విరూపాక్ష’ (virupaksha) చిత్రం ఆ అంచనాల్ని అందుకుంది. ఆడియన్స్‌ను భయపెట్టి.. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తాంత్రిక శ‌క్తుల కాన్సెప్ట్‌తో రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. క్షుద్ర పూజలతో తమ చిన్నారుల్ని బలిస్తున్నారనే ఆరోపణలతో రుద్రవనం గ్రామస్థులు దంపతులను సజీవ దహనం చేయడం, మంటల్లో కాలుతూ ప్రాణం విడుస్తూ ఆ జంట ఊరిని శపించడం, వారి నోటి నుంచి ఏ మాటైతే వచ్చిందో 12 ఏళ్ల తర్వాత అది రుజువవడం, దాని వెనక ఉన్న గుట్టును హీరో రట్టు చేయడం.. ఇదీ ఈ సినిమా సారాంశం. సాయి ధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) హీరోగా దర్శకుడు కార్తీక్‌ దండు (Karthik Varma Dandu) తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త (samyuktha) కథానాయిక. ఈ సినిమా  ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (netflix)లో అందుబాటులో ఉంది.


2012లో బెదురులంకలో ఏం జరిగింది?

కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా దర్శకుడు క్లాక్స్‌ ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేహాశెట్టి (neha shetty) కథానాయిక. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా కథ బెదురులంక నేపథ్యంలో సాగుతుంది. వినోదం, భావోద్వేగాలే ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మనసుకు నచ్చినట్టు జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. మరి, 2012లో ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఆ నాలుగు పేజీలే.. భైరవకోన

సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ తెరకెక్కిస్తున్న సినిమా.. ‘ఊరి పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), కావ్యా థాపర్‌ (Kavya Thapar) కథానాయికలు. సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథ భైరవ కోన అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. వినోదాత్మక అంశాలూ ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో వినిపించిన ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’ అనే డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి, ఆ కథేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

  • కొన్ని రోజుల క్రితం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోన్న ‘మేమ్‌ ఫేమస్‌’, ‘పరేషాన్‌’ తదితర చిత్రాలూ పల్లె నేపథ్యంలోనే రూపొందాయి. మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా సైతం ఊరితో ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ కొరటాల తెరకెక్కిస్తున్న ‘దేవర’.. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని