father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
ఇటీవల.. తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు ఎక్కువగా పోషిస్తున్న నటులపై ప్రత్యేక కథనం. ఎవరెవరు? ఏయే సినిమాలతో అలరించారంటే?
హీరో- హీరోయిన్, వాళ్ల స్నేహితుల తదితర పాత్రలే కాదు కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలూ ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయి. చాలామందికి అవి కనెక్ట్ అవుతాయి. మదిలో నిలిచిపోతాయి. అలా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫాదర్ రోల్స్ పోషించి కాదు.. జీవించిన పలువురు నటులపై ఓ లుక్కేద్దామా..
ఫాదర్ ఆఫ్ ‘డీజే టిల్లు’
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం.. ‘డీజే టిల్లు’ (DJ Tillu). గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ ఎంతగా ఆకట్టుకున్నాయో.. కథానాయకుడి తండ్రి పాత్ర అదే స్థాయిలో అలరించింది. ఆ ‘టిల్లు ఫాదర్’ మరెవరో కాదు మురళీధర్ గౌడ్ (Muralidhar Goud). అంతకు ముందు పలు షార్ట్ ఫిల్మ్‌లు, కొన్ని సినిమాల్లో నిడివి తక్కువ ఉన్న పాత్రలు పోషించిన ఆయన ఈ సినిమాతోనే మంచి గుర్తింపు పొందారు. కొడుకు చేసే పనులు నచ్చని తండ్రిగా నటించి మంచి వినోదం పంచారు. ‘ఫాదర్ క్యారెక్టర్లకు మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అని తెలుగు చిత్ర పరిశ్రమ అనుకునేంతగా ప్రతిభ చూపారు. ‘డీజే టిల్లు’ రేంజ్‌లో ఆయనకు పేరు తెచ్చిన పెట్టిన సినిమా ‘బలగం’. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఇతివృత్తంగా కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఆయన హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ తండ్రిగా జీవించారు. ‘‘ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఫర్వాలేదు ‘డీజే టిల్లు, బలగం’లాంటివి కొన్ని చేసినా చాలు’’ అని చెప్పే మురళీధర్.. ఇటీవల విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’, ‘పరేషాన్’ తదితర సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించారు. నటుడుకాక ముందు ఆయన విద్యుత్తు శాఖలో పనిచేసేవారు. ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్ (కానిస్టేబుల్ రోల్)’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
‘మిడిల్‌క్లాస్’ తండ్రి
థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించి వెండితెరపైకి వచ్చిన నటుడు.. గోపరాజు రమణ (Goparaju Ramana). ఆయన తొలిసారిగా ‘గ్రహణం’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అష్టాచెమ్మా’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే, ఆ పాత్రలు ఆయన ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ (Middle Class Melodies) సినిమాలోని కొండల్ రావు పాత్ర ఆ లోటు భర్తీ చేసి, ఆయన గురించి అటు చిత్ర పరిశ్రమ- ఇటు ప్రేక్షకులు చర్చించుకునేలా చేసింది. అందులో హీరో ఆనంద్ దేవరకొండ ఫాదర్‌గా ఆయన కనిపించారు. అసంతృప్త తండ్రిగా కనిపించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దాని తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ‘ఎఫ్ 3’ లాంటి చిత్రాల్లో తండ్రిగా నటించిన ఆయన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, కార్తికేయ ‘బెదురులంక 2012’ తదితర చిత్రాల్లోని విభిన్న పాత్రలతో సందడి చేయనున్నారు.
సినిమాల్లో.. వెబ్‌సిరీస్‌లో
ఏ పాత్రకైనా వన్నె తీసుకొచ్చే నటుల్లో రాజీవ్ కనకాల (Rajeev Kanakala) ఒకరు. సోదరుడిగా, స్నేహితుడిగా, కోచ్‌గా, పోలీసు అధికారిగా, భర్తగా.. ఇలా ఎన్నో క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన అప్పుడప్పుడు తండ్రి పాత్రలూ పోషిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై, రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘విరూపాక్ష’ (Virupaksha)లో ఆయన రుద్రవనం గ్రామ సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్, హీరోయిన్ తండ్రిగా (కథానాయికని పెంచుకున్న) నటనానుభవం ప్రదర్శించారు. సొంత కూతురుకాకపోయినా తాను చనిపోతుందని తెలియగానే రక్షించుకునేందుకు ఊరి కట్టుబాట్లనే తిరస్కరించేందుకు యత్నించే తండ్రిగా ఒదిగిపోయారు. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో మే లో విడుదలైన ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels) వెబ్‌సిరీస్‌లో ఆయన ఓ ప్రధాన పాత్రధారికి తండ్రిగా కనిపించారు. క్రీడలను ఇష్టపడే వ్యక్తిగా, కొడుకును క్రీడాకారుడిగా చూడాలనుకునే తండ్రిగా ఆకట్టుకున్నారు.
హీరోయిన్ ఫాదర్ రోల్‌కు కేరాఫ్ అడ్రస్
కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్న పాత్రలు పోషిస్తున్న మురళీ శర్మ (Murali Sharma), రావు రమేశ్ (Rao Ramesh) క్రమక్రమంగా హీరోయిన్ ఫాదర్ రోల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘భలేభలే మగాడివోయ్’, ‘మిస్టర్’, ‘నిన్నుకోరి’, ‘మెహబూబా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘పడిపడి లేచె మనసు’, ‘శ్రీకారం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘రాధేశ్యామ్’ వంటి చిత్రాల్లో కథానాయికలకు తండ్రిగా నటించిన మురళీశర్మ.. ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాల్లో హీరోకు తండ్రిగా కనిపించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సైజ్ జీరో’, ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పెళ్లి సందD’, ధమాకా తదితర చిత్రాల్లో హీరోయిన్‌కు ఫాదర్‌గా మెప్పించిన రావు రమేశ్ పలు చిత్రాల్లో హీరో తండ్రిగానూ తనదైన శైలిలో సంభాషణలు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ నటులిద్దరు ఫాదర్ రోల్స్ చేస్తూనే ఇతర క్యారెక్టర్లు పోషిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్ ఇలా.. నరేశ్ అలా
కెరీర్ ప్రారంభం నుంచీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విశేష క్రేజ్ సంపాదించిన ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) పలు భాషల్లో ఎన్నో ‘ఫాదర్ రోల్స్’ ప్లే చేశారు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఆకాశమంత’ వంటి చిత్రాల్లో తండ్రిగా ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోగా మెరిసి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న వారిలో నరేశ్ (Naresh Vijaya Krishna) ఒకరు. ఈయనా ఎక్కువగా తండ్రి పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘హీరో’, ‘రంగరంగ వైభవంగా’, ‘అంటే సుందరానికీ!’ చిత్రాలతోపాటు గతంలో విడుదలైన ‘వరుడు’, ‘చిన్నదాన నీకోసం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘నేను.. శైలజ’, ‘భలేభలే మగాడివోయ్’ తదితర సినిమాల్లో హీరో/హీరోయిన్‌కు తండ్రిగా కనిపించి నవ్వులు పంచారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఇదే పంథాలో కొనసాగుతున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral video: థార్‌లో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు యత్నం.. వీడియో వైరల్!
-
Social Look: అభిమానులను మిస్ అయిన నివేదా.. చాట్ చేసేందుకు నర్గిస్ వెయిటింగ్!
-
Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
-
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్లతో రెడీ
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్