Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల

రామ్‌, శ్రీలీల జంటగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’. ఈ సినిమా గురువారం విడుదలకానున్న నేపథ్యంలో శ్రీలీల పలు విశేషాలు పంచుకుంది.

Published : 27 Sep 2023 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela). ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ‘ధమాకా’లోని డ్యాన్స్‌తో ఉర్రూతలూగించింది. మరికొన్ని గంటల్లో ‘స్కంద’ (Skanda) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ (Ram Pothineni) సరసన ఆమె నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. శ్రీకాంత్‌, ఇంద్రజ, సయీ మంజ్రేకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురువారం విడుదలకానున్న సందర్భంగా శ్రీలీల ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్‌

కొత్తగా ట్రై చేశా..

‘‘ధమాకా’ తర్వాత ‘స్కంద’ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతుండడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు చూపించే ప్రేమాభిమానాలకు థాంక్స్‌. వారిని మంచి చిత్రాలతో అలరించడమనేదే నా ప్రయత్నం. ఈ సినిమాలో నేను రూల్స్‌ పాటించే అమ్మాయిగా నటించా. ఓ వైపు మాస్‌ మరోవైపు క్లాస్‌గా కనిపిస్తా. ఇందులోని కొన్ని సన్నివేశాలు నా జీవితానికి దగ్గరగా ఉంటాయి. నటించేటప్పుడే కాదు డబ్బింగ్‌ సమయంలోనూ ఎంజాయ్‌ చేశా. రామ్‌తో నా కెమిస్ట్రీ బాగుంటుంది. అయితే, ఆయనలా డ్యాన్స్‌ చేయడం కష్టం. డ్యాన్స్‌ విషయంలో ఈసారి కొత్తగా ట్రై చేశా. నటన, డ్యాన్స్‌ పరంగా రామ్‌ కొన్ని సలహాలిచ్చారు’’

ఇష్టం పెరిగింది..

‘‘ధమాకా’లోని నా డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నేను అనుకోలేదు. ‘స్కంద’లోనూ అదే స్థాయిలో ఉంటుంది. మాస్‌, వెస్ట్రన్‌.. ఇలా రెండు రకాలుగా డ్యాన్స్‌ చేసే అవకాశం వచ్చిందీ సినిమాతో. ఈ చిత్రంతో యాక్షన్‌ కథలపై మరింత ఇష్టం పెరిగింది. మాస్‌ అంశాలు, పోరాట సన్నివేశాలను అద్భుతంగా చూపించడంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక శైలి. ఇలాంటి జానర్‌లో నటించడం నాకు కొత్త. దాంతో, దర్శకుడు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ మేరకు నటించా’’ అని వివరించింది.

వరుస సినిమాలు చేస్తుండడంపై స్పందిస్తూ.. నా తొలి చిత్రం ‘పెళ్లిసందD’ తర్వాత ‘స్కంద’కు సైన్‌ చేశా. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు అంగీకరించా. అవన్నీ ఇప్పుడు వస్తుండడంతో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నేను కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటా’’ అని తెలిపింది. మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’, పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, నితిన్‌ ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌’లో హీరోయిన్‌గా.. బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’లో ఓ కీలక పాత్రలో శ్రీలీల కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని