Sri Vishnu: గిరి గీసుకొని అందులోనే ఉంటానంటే ఎలా!

కొత్త దర్శకుల్ని.. కొత్తదనం నిండిన కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన ‘అల్లూరి’ చిత్రం కోసం తొలిసారిగా ఖాకీ చొక్కా తొడిగారు. ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాని బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. కయ్యదు లోహర్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 16:55 IST

కొత్త దర్శకుల్ని.. కొత్తదనం నిండిన కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన ‘అల్లూరి’ (Alluri) చిత్రం కోసం తొలిసారిగా ఖాకీ చొక్కా తొడిగారు. ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాని బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాల పంచుకున్నారు శ్రీవిష్ణు (Sri Vishnu).  

ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఓ అల్లూరి అదరగొట్టారు. మరి ఈ ‘అల్లూరి’ ఎలా ఉండనుంది?

‘‘ఆయన నిజమైన అల్లూరి. మనం ఆయన నుంచి స్ఫూర్తిగా తీసుకొని చేసిన కథ ఇది (నవ్వుతూ). ‘అల్లూరి సీతారామరాజు’ క్లైమాక్స్‌లో కృష్ణ ఓ డైలాగ్‌ చెబుతారు కదా. ‘ఒక అల్లూరి చనిపోతే వంద మంది అల్లూరిలు పుడతార’ని. ఆ వందలో ఒకడే మా ‘అల్లూరి’. ఇదొక పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌గా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది పోలీస్‌ అధికారుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనలను ఈ కథలో మిళితం చేయడం జరిగింది. పోలీస్‌ వ్యవస్థలో ఉన్న మంచి చెడుల్ని ఇందులో చర్చించాం. అలాగే చెడుకు ఓ పరిష్కారం కూడా చూపిస్తాం’’.

చాలా సౌమ్యంగా కనిపించే మిమ్మల్ని.. ఓ పోలీస్‌ పాత్ర కోసం ఎలా సంప్రదించారు?

‘‘నాకూ అదే అనిపించింది (నవ్వుతూ). నేను కొన్ని పాత్రలు చేయకూడదనుకునే వాడ్ని. అలాంటి వాటిలో ఈ పోలీస్‌ పాత్రలు కూడా ఉన్నాయి. ఈ కథ నాకైతేనే బాగుంటుందని దర్శకుడు సుధీర్‌ వర్మ.. ప్రదీప్‌కు సలహా ఇచ్చారట. అలా ఈ కథ నా దగ్గరకొచ్చింది. ఐదేళ్ల క్రితం తొలిసారి ఈ కథ విన్నా. ఈ స్క్రిప్ట్‌ వినడానికి ముందు వరకు కూడా ‘ఇది కచ్చితంగా చేయకూడదు’ అన్న ఉద్దేశంతోనే ఉన్నా. అదే ఆలోచనతో కథ విన్నా. కానీ, కథ పూర్తయ్యేసరికి నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. పోలీస్‌ వ్యవస్థపై నాకొక సదాభిప్రాయం ఏర్పడింది. వారి పట్ల గౌరవం పెరిగింది. అందుకే కచ్చితంగా ఈ కథ నేనే చేయాలి అని నిర్ణయించుకున్నా. అంత బాగా నచ్చింది ఈ స్క్రిప్ట్‌’’.  

ఈ పోలీస్‌ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు? ఈ పాత్ర మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?  

‘‘ఈ చిత్రం విషయంలో నేను పూర్తిగా కథను అనుసరించే ముందుకెళ్లా. సినిమా చేయడానికి ముందు ఏ ఒక్క పోలీస్‌ అధికారినీ కలవలేదు. కానీ, గత పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పోలీస్‌ అధికారుల్ని కలిశాను. వారి సేవలకు  కృతజ్ఞతలు చెప్పాను. సాధారణంగా నేను సున్నితంగా మాట్లాడతా. చాలా విషయాలకు అంత త్వరగా స్పందించను. ఈ పాత్ర చేసిన తర్వాత నుంచి నా చుట్టూ జరిగే కొన్ని విషయాలపై కాస్త స్వరం పెంచి మాట్లాడుతున్నా. ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా (నవ్వుతూ)’’.

మీ కంఫర్ట్‌ జోన్‌లో చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. కానీ, ఈ చిత్రం కోసం దాన్ని వదిలి రావడానికి కారణమేంటి?

‘‘ఓ గిరి గీసుకొని అందులోనే ఉంటానంటే కొంత కాలానికి బోర్‌ కొట్టేస్తుంది. ఓ మామూలు కథతో పక్కింటి అబ్బాయిలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, అవే సినిమాలు చేస్తూ ఉంటే ఆ ఇమేజ్‌ నుంచి బయటకు రాలేను. ఒక నటుడిగా విభిన్నమైన పాత్రలు చేయలేను. అందుకే ప్రతిసారీ కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. ఓ నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. త్వరలో నా నుంచి రానున్న మూడు చిత్రాలు వేటికవే వైవిధ్యభరితంగా ఉంటాయి’’.

సాధారణంగా మీ చిత్రాల గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ, ఈ చిత్ర విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడానికి కారణమేంటి?

‘‘సినిమా నా మనసుకు నచ్చితే కచ్చితంగా బలంగా చెబుతాను. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’.. ఈ సినిమాలన్నింటికీ చాలా బలంగా చెప్పా. పేపర్‌ మీద చదివిన కథ.. స్క్రీన్‌పైకి సరిగ్గా వచ్చి, ఒక తృప్తిని ఇస్తే నాకు చాలా నిజాయితీగా మాటలు వచ్చేస్తాయి. అంతే కానీ దీనికోసం ప్రత్యేకంగా సిద్ధమై ఏమీ మాట్లాడను’’.


‘‘పాన్‌ ఇండియా.. పాన్‌ వరల్డ్‌ అని చెప్పను కానీ వచ్చే రెండేళ్లలో ఓ యూరోపియన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి ఒక సినిమా చేయబోతున్నా. చాలా మంచి ప్రాజెక్ట్‌ ఇది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో చాలా పెద్ద నటీనటులు ఉంటారు. వాళ్లతో కలిసి నేనూ నటిస్తున్నా. ఈ చిత్రంలో ఒక్కో పాత్ర ఒక్కో భాష మాట్లాడుతుంది. నేను మాత్రం తెలుగులోనే మాట్లాడతా. త్వరలో ఆ చిత్ర వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తా. ప్రస్తుతం నేను మైత్రీ మూవీస్‌లో దర్శకుడు హసిత్‌ గోలితో ఓ చిత్రం చేస్తున్నా. దీని తర్వాత సాయి అనే కొత్త దర్శకుడితో.. ‘హుషారు’ ఫేమ్‌ హర్షతో సినిమాలు చేయనున్నా’’.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని