Sridevi: ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర

అందాలతార శ్రీదేవి (Sridevi) జీవిత చరిత్ర పుస్తకంగా రానుంది. ప్రముఖ రచయిత ధీరజ్‌ కుమార్‌ దీనిని ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్’ (The Life Of A Legend) అనే పేరుతో రచించనున్నారు.

Updated : 09 Feb 2023 12:03 IST

ముంబయి: బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్రహీరోలందరి సరసన నటించింది శ్రీదేవి (Sridevi). తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకొంది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. భారతీయ చిత్రసీమను ఏలిన ఈ అగ్రకథానాయిక జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర (Sridevi's biography) పుస్తక రూపంలో రానుంది.

ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్‌ కుమార్‌ శ్రీదేవి బయోగ్రఫీని ‘‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’’ (The Life Of A Legend) పేరుతో రచించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తన తొలి బయోగ్రఫీ అని అన్నారు. దీనిని రాయడానికి అంగీకరించినందుకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ ‌(Boney Kapoor)కు, ఆమె కుమార్తెలు జాన్వీ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ ‌(Khushi Kapoor)లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పుస్తకంపై బోనీ కపూర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘శ్రీదేవి ఒక అద్భుతం. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం. స్క్రీన్‌పై ఆమె కనిపించినప్పుడు అభిమానుల నుంచి వచ్చే స్పందన చూసి చాలా సంతోషించేది. తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచేది. ధీరజ్‌ ఆమె జీవిత చరిత్రను పుస్తకంగా రాయడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన్ని మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తాం’’ అని అన్నారు.

ఇక శ్రీదేవి కెరీర్‌లో అత్యంత ప్రశంసలు పొందిన చిత్రం ‘‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’’(English Vinglish). ఈ చిత్రాన్ని ఆమె ఐదో వర్ధంతి సందర్భంగా ఈ నెల 24న చైనాలో విడుదల చేయనున్నారు. అక్కడ 6000 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని