sridevi shoban babu review: రివ్యూ: శ్రీదేవి శోభ‌న్‌బాబు

Sridevi Shoban Babu Movie Review: సంతోష్‌ శోభన్‌, గౌరి జంటగా నటించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 18 Feb 2023 15:01 IST

Sridevi Shoban Babu Movie Review; చిత్రం: శ్రీదేవి శోభన్‌బాబు; నటీనటులు: సంతోష్ శోభ‌న్‌, గౌరి జి కిష‌న్‌, నాగ‌బాబు, రోహిణి, మెహ‌బూబ్ బాషా  త‌దిత‌రులు; ఎడిటింగ్‌: శ‌శిధ‌ర్ రెడ్డి; సినిమాటోగ్రఫీ:  సిద్ధార్థ్ రామ‌స్వామి; సంగీతం: క‌మ్రాన్‌; నిర్మాత‌లు: సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌; దర్శకుడు: ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌; సంస్థ‌:  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌; విడుద‌ల‌: 18-02-2023

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్‌శోభ‌న్.  అతడి సినిమాలు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల ముందుకొస్తూనే ఉన్నాయి.  ఓ న‌టుడిగా ప్ర‌తి సినిమాలోనూ త‌న‌దైన ప్ర‌భావం చూపిస్తున్న సంతోష్‌కి విజ‌యాలు మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్క‌డం లేదు. సంక్రాంతికి ‘క‌ళ్యాణం క‌మ‌నీయం’తో సంద‌డి చేశాడు. అతడు న‌టించిన మ‌రో చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ శివ‌రాత్రి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. చిరంజీవి  కుమార్తె సుష్మిత‌, అల్లుడు విష్ణు క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. ప్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ఎలా ఉంది? (Sridevi Shoban Babu Movie Review) సంతోష్‌ ఖాతాలో విజయం పడిందా?

క‌థేంటంటే: శ్రీదేవి (గౌరి జి.కిష‌న్‌) ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. వృత్తి ప‌ర‌మైన ప‌నుల్లో  భాగంగా అర‌కు వెళ్తానంటుంది. తండ్రి (నాగ‌బాబు) వద్ద‌ని వారిస్తాడు. అక్క‌డ త‌న చెల్లెలు క‌మ‌ల (రోహిణి)తో జ‌రిగిన గొడ‌వ గురించి వివ‌రిస్తాడు. దాంతో త‌న అత్త‌పై కోపం పెంచుకున్న శ్రీదేవి ప్రతీకారం కోసం అర‌కు బ‌య‌ల్దేరి వెళ్తుంది. అక్క‌డికి వెళ్లాక శోభ‌న్‌బాబు (సంతోష్ శోభ‌న్‌)ని కలుస్తుంది. మ‌రి ఆమె  త‌న ప్ర‌తీకారం తీర్చుకుందా?  అస‌లు గ‌తంలో ఆమె కుటుంబంలో ఏం జ‌రిగింది?  ఈ శోభ‌న్‌బాబు ఎవ‌రు? అత‌ణ్ని క‌లిశాక శ్రీదేవి  జీవితం ఎలా మారింది?  (Shoban Babu Movie Review) త‌న చిన్న త‌నంలో విడిపోయిన రెండు కుటుంబాలు మ‌ళ్లీ క‌లుసుకున్నాయా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ నేప‌థ్యంలో సాగే క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తూనే ఉన్నాయి.  క‌థ కొత్త‌దేమీ కాక‌పోయినా... భావోద్వేగాలు,  త‌గుపాళ్ల‌లో వినోదం మేళ‌వించి ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దితే  ఇప్ప‌టికీ చూడ‌టానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉన్నార‌ని కొన్ని సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి.  (Shoban Babu Movie Review) కుటుంబ బంధాలు, ఆ భావోద్వేగాల్లో ఉన్న గొప్ప‌త‌నం అదే. కానీ తెలిసిన ఆ క‌థ‌ని సైతం... అదే పాత ప‌ద్ధ‌తుల్లోనే తెర‌పైకి తీసుకొచ్చిన‌ప్పుడే స‌మ‌స్య‌లొస్తాయి. ఈ సినిమా విష‌యంలో అదే జరిగింది. ప్ర‌థ‌మార్ధం మొత్తం  హాస్య స‌న్నివేశాల‌తోనే సాగుతుంది. కానీ ఆ హాస్యంలో కొత్త‌ద‌నం లేదు. చాలా స‌న్నివేశాలు మ‌రీ సాదాసీదాగా అనిపిస్తాయి. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ కోణాన్ని కూడా కొత్త‌గా ఆవిష్క‌రించ‌లేక‌పోవ‌డం సినిమాకి ఇబ్బందిని క‌లిగిస్తుంది. ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అన్నాచెల్లెల మ‌ధ్య సెంటిమెంట్ నేప‌థ్యం అక్క‌డ‌క్క‌డా  భావోద్వేగాలు  పండించినా అవి సినిమాపై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. మోతాదు స‌రిపోక‌పోగా,  అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన‌ట్టు అనిపిస్తుంది. (Shoban Babu Movie Review) నాయ‌కానాయిక‌లు, రోహిణిల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ద్వితీయార్ధంలో కీల‌కం.  పాట‌లు,  వాటి చిత్రీకర‌ణ కూడా మెప్పిస్తాయి.  క‌థ‌నం ప‌రంగా మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉండ‌గా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేద‌నిపిస్తుంది. వాణిజ్యాంశాలేవీ ఫ‌లితాన్నివ్వ‌క‌పోవ‌డంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: రొమాంటిక్ కామెడీ క‌థ‌లకి ప్ర‌ధాన జంట మ‌ధ్య కెమిస్ట్రీ కీల‌కం. ఇందులో సంతోష్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండింది. కానీ, దాన్ని మ‌రింత హైలైట్ చేసేలా స‌న్నివేశాలు లేక‌పోవ‌డ‌మే మైన‌స్‌. సంతోష్ శోభన్ పల్లెటూరి కుర్రాడిగా బాగా నటించాడు. గౌరీ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. ద్వితీయార్ధంలో భావోద్వేగాల్ని పండించే స‌న్నివేశాల్లో వాళ్ల ప‌నిత‌నం మెప్పిస్తుంది. నాగ‌బాబు, రోహిణిల పాత్ర‌ల్లో సంఘ‌ర్ష‌ణ సినిమాకి చాల‌లేదు. వాళ్ల‌కి అల‌వాటైన పాత్ర‌లే అవి. వాటి ప‌రిధి మేర‌కు ప్ర‌భావ‌వంతంగానే న‌టించారు.  ఇత‌ర పాత్ర‌లకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. (Shoban Babu Movie Review) సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా మెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడు భావోద్వేగాల‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించినా  క‌థ‌నం, హాస్యం విష‌యంలో తేలిపోయాడు. బ‌ల‌హీన‌మైన ర‌చ‌న చిత్ర ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు: 👍 ద్వితీయార్ధం; 👍 కొన్ని పాట‌లు; 👍 నాయ‌కానాయిక‌లు

బ‌ల‌హీన‌త‌లు: 👎కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం; 👎 హాస్యం పండ‌క‌పోవ‌డం

చివ‌రిగా: ‘శ‌్రీదేవి శోభ‌న్‌బాబు’... జోడీ బాగుందంతే! 👩‍❤️‍👨

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని