Srikanth: నా కెరీర్‌లో ఇదే తొలిసారి

‘‘విభిన్నమైన పాత్రలపైనే నా దృష్టి. ‘అఖండ’ తర్వాత మరో కొత్త రకమైన పాత్ర చేయాలనుకున్నా. ఆ సమయంలోనే ‘వారసుడు’ అవకాశం వచ్చింది.

Updated : 04 Jan 2023 07:00 IST

‘‘విభిన్నమైన పాత్రలపైనే నా దృష్టి. ‘అఖండ’ తర్వాత మరో కొత్త రకమైన పాత్ర చేయాలనుకున్నా. ఆ సమయంలోనే ‘వారసుడు’ (Vaarasudu) అవకాశం వచ్చింది. ఇందులో విజయ్‌కి సోదరుడిగా కనిపిస్తా’’ అన్నారు  ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth). కథానాయకుడిగా అలరించిన ఆయన, ఈమధ్య ప్రతినాయకుడిగా, సహ నటుడిగా కీలకమైన పాత్రల్లో సందడి చేస్తున్నారు. ఇటీవల ‘వారసుడు’లో నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆ సినిమా గురించి శ్రీకాంత్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘కుటుంబ వినోదంతో రూపొందిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందినప్పటికీ ఇది పక్కా తెలుగు నేటివిటీ చిత్రంలా ఉంటుంది. భావోద్వేగాలు, విజువల్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సోదరుల మధ్య ఎలాంటి భావోద్వేగాలుంటాయో వాటిని చాలా బాగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. విజయ్‌ ఈమధ్య కాలంలో కుటుంబ వినోదాత్మక చిత్రాలు చేయలేదు. పండగకి ఓ పండగలాంటి సినిమా వస్తోంది. తమిళ చిత్రం చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. విజయ్‌లాంటి ఓ స్టార్‌ హీరోతో ఓ మంచి చిత్రంతో తమిళంలో పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది. ఆరంభం నుంచి చివరి వరకూ నా పాత్ర కనిపిస్తుంది. విజయ్‌ ఎక్కువగా మాట్లాడరు. సెల్‌ఫోన్‌ దగ్గర ఉండదు. కార్‌వ్యాన్‌ వాడరు. ఒక్కసారి సెట్లో అడుగు పెట్టారంటే ప్యాకప్‌ చెప్పేవరకు కదలడు. అంత అంకిత భావంతో పనిచేస్తారు’’.

* ‘‘కథ, పాత్ర నచ్చితే విభిన్నమైన పాత్రలు చేయడానికి నేను సిద్ధమే. ‘అఖండ’ తర్వాత అందులోని పాత్రకి భిన్నమైన సినిమాలు చేయాలనుకున్నా. అప్పుడే రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమా అవకాశం వచ్చింది. ఆ వెంటనే ‘వారసుడు’ వచ్చింది. ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా దిల్‌రాజు నిర్మాణ సంస్థలో సినిమాలు చేయలేదు. ఒకేసారి ఆయన నిర్మాణంలో రెండు సినిమాలు చేయడం తృప్తినిచ్చింది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని