Srikanth Meka: ఆ ఉద్దేశంతోనే ‘వారసుడు’లో నటించా: శ్రీకాంత్‌

నటుడు శ్రీకాంత్‌ ఇంటర్వ్యూ. విజయ్‌ హీరోగా తెరకెక్కించిన ‘వారసుడు’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Published : 03 Jan 2023 22:33 IST

హైదరాబాద్‌: విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతోనే తాను ‘వారసుడు’ (తమిళంలో వారిసు) సినిమాలో నటించానని నటుడు శ్రీకాంత్‌ (Srikanth Meka) అన్నారు. తమిళ హీరో విజయ్‌ (Vijay) ప్రధాన పాత్రధారిగా టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమిది (Varisu). రష్మిక కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రయాణం అలా మొదలైంది..

‘‘నా కెరీర్‌లో నేను నటించిన తొలి తమిళ చిత్రమిది. దర్శకుడు వంశీ కథ చెప్పగానే బాగా నచ్చింది. నటించేందుకు వెంటనే ఓకే చెప్పా. ఈ చిత్రంలో విజయ్‌కు నేను సోదరుడిగా నటించా. నా పాత్ర చాలా కీలకం. ‘వారసుడు’ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. తమిళంలో తెరకెక్కినా పక్కా తెలుగు సినిమాలానే ఉంటుంది. ఈ చిత్రంలో యాక్షన్‌ కూడా ఉంటుంది. అయితే, అది నేను చేయలేదు (నవ్వుతూ..). ఇందులోని పోరాట సన్నివేశాలూ ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకత్వంలో వంశీకి చాలా స్పష్టత ఉంది. అనుకున్న ఔట్‌పుట్‌ కోసం ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తారు’’

నా పాత్ర ఇలా ఉంటుంది..

‘‘సోదరుల మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్‌ ఇందులో కనిపిస్తాయి. చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకూ నా క్యారెక్టర్‌ కొనసాగుతూనే ఉంటుంది. విజయ్‌లాంటి స్టార్‌ హీరోకు సోదరుడిగా నటించడం, ఈ సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌ ఫ్యామిలీ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. ఆ లోటును ఈ సినిమా తీరుస్తుంది. ఇది పండగకు పండగలాంటి చిత్రం’’

అలాంటి పాత్రల్లోనే కనిపించాలనుకుంటున్నా..

‘అఖండ’ సినిమాలోని పాత్రకు పూర్తి విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ‘వారసుడు’లో నటించా. రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #RC15 (వర్కింగ్‌ టైటిల్‌)లో విభిన్న పాత్ర పోషిస్తున్నా. వైవిధ్యభరిత పాత్రలు చేయాలనుకుంటున్నా. కథలు నచ్చితే తప్పకుండా నటిస్తా.

విజయ్‌ ఇలా ఉంటారు..

‘‘విజయ్‌ను గతంలో కొన్ని వేడుకల్లో కలిశా. కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. కారవ్యాన్‌ వినియోగించరు. సెల్‌ఫోన్‌ ఆయన దగ్గర ఉండదు. ఒకసారి సెట్‌లో అడుగుపెడితే ప్యాకప్‌ చెప్పేంతవరకూ అక్కడి నుంచి ఎటూ కదలరు. అంకితభావంతో పనిచేస్తారు’’ అని శ్రీకాంత్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని