రూ.85లక్షల బడ్జెట్‌.. రూ.15కోట్ల కలెక్షన్స్‌

తెలుగు లోగిళ్లలో ఎవరి ఇంట పెళ్లి జరిగినా వారి ఇంటి పేరు తర్వాత కనపడే పదం ‘పెళ్లి సందడి’. ఈ పదం లేకుండా పెళ్లి మంటపాల

Updated : 06 Jul 2021 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు లోగిళ్లలో ఎవరి ఇంట పెళ్లి జరిగినా వారి ఇంటి పేరు తర్వాత కనపడే పదం ‘పెళ్లి సందడి’. ఈ పదం లేకుండా పెళ్లి మంటపాల వద్ద బ్యానర్లు కనిపించేవి కాదంటే అతిశయోక్తి లేదు. అంతలా తెలుగువారి పెళ్లిళ్లలో మమేకమైపోయింది. ‘పెళ్లి సందడి’ అంటే నిజంగానే ఇలా ఉంటుందా? అనిపించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పెళ్లి సందడి’. జనవరి 12 1996న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జామపండు, పుట్టు మచ్చ, తాళాల గుత్తి, సౌందర్యలహరి ఎక్కడ విన్నా ఈ పదాలే. ఏ ఫంక్షన్‌కు, తిరునాళ్లకు వెళ్లినా ఈ సినిమా పాటలే. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరినీ అలరించిన ఈ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘పెళ్లి సందడి’గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

అలా పట్టాలెక్కింది!

అప్పటివరకూ అగ్ర హీరోలతో సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఈ సారి ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నారు. అందుకు తగినట్లుగా కథా, కథనాలు సిద్ధం చేసుకున్నారు. మళ్లీ పెద్ద హీరోతో సినిమా తీసేకన్నా నలుగురు నిర్మాతలను కలుపుకొని చిన్న సినిమా తీయాలని భావించారు. దీని వల్ల కొత్త నటీనటులకు అవకాశం లభించడంతో పాటు, పొరపాటున సినిమా ఫ్లాప్‌ అయినా పెద్దగా నష్టపోయేది ఉండదని భావించారు. అందులో భాగంగానే అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, జగదీశ్‌ ప్రసాద్‌లను కలుపుకొని సినిమా నిర్మించాలని అనుకున్నారు. మరి హీరో ఎవరు? అన్న ప్రశ్న తలెత్తగానే పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేస్తున్న శ్రీకాంత్‌.. రాఘవేంద్రరావు కంటబడ్డారు. దీంతో ఆయన హీరోగా సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ముక్కోణపు ప్రేమకథను సిద్ధం చేసుకుని కథానాయికలుగా రవళి, దీప్తి భట్నాగర్‌లను తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఆస్థాన విద్వాంసుడు కీరవాణిని ఎంపిక చేసుకున్నారు.

కథేంటంటే: విజయ్‌ కృష్ణ(శ్రీకాంత్‌) సంగీత కళాకారుడు. తండ్రి(సత్యనారాయణ), అక్కా-బావలు(బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, శివాజీరాజా)లతో కలిసి ఇంట్లోనే ఉంటాడు. విజయ్‌కు పెళ్లి చేస్తే ఓ పనైపోతుందని తండ్రి భావిస్తుంటాడు. అయితే, విజయ్‌ మాత్రం తన కలల సుందరి(దీప్తి భట్నాగర్‌) మాత్రమే చేసుకుంటానని పట్టుబడతాడు. ఒకరోజు విజయ్‌ తండ్రి అతన్ని పిలిచి కల్యాణి(రవళి) ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లమని బలవంతపెడతాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కల్యాణి ఇంటికి వెళతాడు. ఆ తర్వాత విజయ్‌కు ఊటీలో మ్యూజిక్‌ టీచర్‌గా ఉద్యోగం వస్తుంది. అక్కడే అతనికి తన కలల సుందరి స్వప్న(దీప్తి భట్నాగర్‌) కనిపిస్తుంది. ఇరువురి మధ్య పరిచయం పెరిగి, ప్రేమించుకుంటారు. మరోవైపు కల్యాణి ఇష్టపడిన విజయ్‌ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అతనికి దూరమవడానికి స్వప్న ప్రయత్నిస్తుంది. త్వరలోనే తాను చనిపోతానని, అందుకనే కల్యాణిని చేసుకోవాలని విజయ్‌ దగ్గర స్వప్న మాట తీసుకుంటుంది. మరి కల్యాణితో విజయ్‌ పెళ్లి జరిగిందా? స్వప్న  ఎందుకు అబద్ధం చెప్పింది? ముక్కోణపు ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ‘పెళ్లి సందడి’.

‘పెళ్లి సందడి’.. ఆసక్తికర విశేషాలు

* ‘పెళ్లి సందడి’ సినిమాను ‘సరిగమపదనిస రాగం’ పాటతో మొదలు పెట్టారు. ఆ సన్నివేశానికి బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ క్లాప్‌ కొట్టారు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి కుటుంబం.. అమ్మాయి కుటుంబం కలిసి పాడుకునే పాట ఇది.

* ‘ఈ పాట బాగా వస్తే, రవళి హీరోయిన్‌గా ఉంటుంది లేకపోతే సినిమా నుంచి తీసేస్తాం’ అని చెప్పారట.

* తమిళంలో విజయకాంత్‌ సినిమాలో నటిస్తున్న రవళిని కథానాయికగా తీసుకుంటే, ‘ఆ అమ్మాయి ఎందుకు’ అని రాఘవేంద్రరావుకు చెప్పారట. అయినా, ఛాలెంజింగ్‌గా తీసుకుని కల్యాణి పాత్రను తీర్చిదిద్దారు.

* రవళి హీరోయిన్‌ అంటే ఎవరూ నమ్మలేదు. తొలిరోజు షూటింగ్‌కు హాజరైతే, రవళి కాస్ట్యూమ్స్‌ కనిపించలేదు. ఆరా తీస్తే నటి రజిత హీరోయిన్‌ అనుకుని యూనిట్‌ ఆమె గదిలో పెట్టారట. రవళి వచ్చిన తర్వాత పొరపాటు తెలుసుకుని తీసుకొని వచ్చారట.

* ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌ లేరు. రాఘవేంద్రరావు స్వయంగా నృత్యాలు సమకూర్చారు. ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.

* కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? అంటూ చిట్టిబాబు, అనంత్‌లు పెళ్లికి వచ్చిన వారిని అడుగుతూ ఉంటారు. సీరియస్‌గా సాగుతున్న కథనంలో కాస్త బ్రేక్‌ ఇవ్వడానికి ఈ జోడీని పెట్టారట రాఘవేంద్రరావు. ఈ సినిమా తర్వాత చిట్టిబాబు, అనంత్‌లను పెళ్లిళ్లకు పిలిచి నటించి వెళ్లమనేవారట.

* శ్రీకాంత్‌, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, శివాజీరాజా ఈ నలుగురిని కలిపి చిత్ర యూనిట్‌ ‘కుప్ప’ అని పిలిచేవారట.

* స్వప్న సుందరిగా కనిపించిన దీప్తి భట్నాగర్‌ను వెతకడానికి గుర్తుగా నడుముపై మచ్చ, తాళాల గుత్తిని సింబాలిక్‌గా తీసుకున్నారు దర్శకుడు. తాళాల గుత్తి కాన్సెప్ట్‌ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నుంచి తీసుకున్నారు. ఆ సినిమాలో ‘అబ్బని తీయని దెబ్బ’ పాటలో శ్రీదేవి తన నడుముకు తాళాల గుత్తి పెట్టుకుని ఆ సాంగ్‌ చేశారు. ఆ కాన్సెప్ట్‌ను ఎప్పుడైనా వాడుకోవాలనుకున్న దర్శకేంద్రుడు ఈ సినిమాలో పెట్టుకున్నారు.

* ‘సౌందర్యలహరి’ పాటను 40రోజుల పాటు తీశారు. షూటింగ్‌ జరిగే ప్రతి చోటా ఈ పాటలో కొంత భాగం తీశారట. ఒక్కో చోట ఒక్కో షాట్‌ తీశారు.

* అసలు స్వప్న సుందరి ఎలా ఉంటుంది? అని విజయ్‌ను అతని బావలు నాలుగు ప్రశ్నలు అడగటం, ఆ తర్వాత ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ నాలుగు డైలాగ్‌లు చెబితే సరిపోతుందని అనుకున్నారట. అయితే, హీరోయిన్‌ల అందరి పేర్లతో ఓ సాంగ్‌ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి, ‘రమ్యకృష్ణలాగా ఉంటదా’ రాయించారు.

* ‘అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి’ పాటను ఉదయం 9గంటలకు మొదలుపెట్టి, మధ్యాహ్నం 1గంటకు ముగించారు.

* 85లక్షలతో తీసిన ఈ సినిమా రూ.15కోట్లు వసూలు చేసింది.  అత్యధికంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో రూ.1.20కోట్లు వసూలు చేసింది.

* విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ రోజుకు నాలుగు ఆటలు చొప్పున 301 రోజులు 1204 ఆటలు ఆడటం ఆల్‌టైమ్‌ రికార్డు.

* 27 సెంటర్స్‌లో రోజులు నాలుగు ఆటలు చొప్పున జూబ్లీ ఆడిన సినిమా ‘పెళ్లి సందడి’ అప్పటికీ ఇప్పటికీ  ఈ సినిమాదే రికార్డు.

* ఫస్ట్‌ రిలీజ్‌గా 34 సెంటర్స్‌లో విడుదల చేయగా, అన్నిచోట్లా 100రోజులు ఆడింది. సెకండ్‌ బ్యాచ్‌లో 25 సెంటర్స్‌ విడుదల చేయగా, అన్ని చోట్లా 100 రోజులు ఆడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని