Srinidhi Shetty: యశ్‌ మంచివాడు కాదంటూ ఆరోపణలు.. శ్రీనిధి శెట్టి క్లారిటీ

యశ్‌ మంచివాడు కాదంటూ తాను చెప్పినట్లు సోషల్‌మీడియాలో వస్తోన్న వదంతులపై నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) స్పందించారు. యశ్‌ (Yash) మంచి వాడని, ఆయనపై తనకెంతో గౌరవం ఉందని చెప్పారు.

Published : 18 Mar 2023 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌’ (KGF) స్టార్‌ యశ్‌(Yash)ను ఉద్దేశిస్తూ వచ్చిన ఓ ట్వీట్‌ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. యశ్‌ మంచివాడు కాదంటూ తనతో ఇకపై వర్క్‌ చేయనని ఆయన కో-స్టార్‌ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) చెప్పినట్లు ఉన్న ఈ ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై నటి శ్రీనిధి నెట్టి స్పందించారు. యశ్‌ అంటే తనకెంతో అభిమానమని చెప్పారు. ఆయనతో మళ్లీ పనిచేయాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా ఫేమ్‌ను దెబ్బతీయడానికే కొంతమంది వ్యక్తులు ఇలాంటి ట్వీట్స్‌ చేస్తుంటారని అన్నారు.

‘‘సోషల్‌మీడియాను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. వాడే మనిషిపై అది ఆధారపడి ఉంటుంది. కొంతమంది మంచి పనుల కోసం ఉపయోగిస్తుంటే.. మరికొంతమంది మాత్రం వదంతులు సృష్టించడానికి వాడుతున్నారు. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారిపై ప్రేమాభిమానాన్ని చూపించడం కోసమే దీన్ని ఉపయోగించాలనుకుంటున్నా. ‘కేజీయఫ్‌’ వంటి అద్భుతమైన ప్రపంచంలో యశ్‌తో కలిసి పనిచేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నా దృష్టిలో ఆయనొక జెంటిల్మెన్‌, గురువు, స్నేహితుడు, స్ఫూర్తి. యశ్‌.. నేను ఎప్పటికీ నీ అభిమానినే’’ అని రాసుకొచ్చారు.

దుమారం రేపిన ఉమర్‌సంధు

తానొక సెన్సార్‌ బోర్డు సభ్యుడినని చెబుతూ ఉమర్‌ సంధు అనే వ్యక్తి.. గత కొంతకాలంగా ట్విటర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు. దక్షిణాది పరిశ్రమలో తెరకెక్కే సినిమాలు.. ఇక్కడ నటీనటుల పరువుకు భంగం కలిగేలా ట్వీట్లు చేయడం ఇతడి పని. ఈ క్రమంలోనే ఇటీవల యశ్‌ (Yash) గురించి ఓ ట్వీట్‌ పెట్టాడు. యశ్‌ మంచి వాడు కాదని.. ఆయన ప్రవర్తన వల్ల తాను ఇబ్బందిపడ్డానని.. అతడితో మరోసారి పనిచేయాలని లేదని శ్రీనిధి చెప్పినట్లు ఉమర్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇది కాస్త నెట్టింట దుమారం రేపింది. దీనిని చూసిన యశ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే  శ్రీనిధి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విడుదల కాకముందే ఆ సినిమాపై రివ్యూ పెట్టి సుహాసినితో ఇతడు తిట్లు తిన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని