Srinivas Avasarala: ఇకపై దర్శకత్వంపైనే ఎక్కువ దృష్టిపెడతా

‘‘ఇదివరకు అవకాశాలు అంత సులభంగా దక్కేవి కాదు. ఇప్పుడు కథ చెప్పాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఓ వేదిక దొరుకుతోంది’’ అన్నారు శ్రీనివాస్‌ అవసరాల.

Published : 05 Mar 2023 15:51 IST

‘‘ఇదివరకు అవకాశాలు అంత సులభంగా దక్కేవి కాదు. ఇప్పుడు కథ చెప్పాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఓ వేదిక దొరుకుతోంది’’ అన్నారు శ్రీనివాస్‌ అవసరాల (Srinivas Avasarala). నటుడిగా, రచయితగా, దర్శకుడిగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్నారాయన. ఇటీవల  ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi) చిత్రాన్ని తెరకెక్కించారు. నాగశౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్‌ (Malvika Nair) జంటగా...  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న రానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ అవసరాల విలేకర్లతో ముచ్చటించారు.

అందుకే ఆ టైటిల్‌ పెట్టాం!

‘‘ఇందులోని పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఈ సినిమా ఉంటుంది. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అంత సహజమైన సినిమాకి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ లాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. మొదట దీనిని వర్కింగ్ అనుకుంటున్నా అయితే ఈ టైటిల్ నిర్మాతలకు ఎంతగానో నచ్చి వెంటనే రిజిస్టర్ చేయించారు.  ప్రతి సినిమాకి ఓ శైలి ఉంటుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.’’

అందుకే నెమ్మదిగా సినిమాలు చేస్తున్నా!

‘‘నేను కథ రాయడానికి ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటా. ఈ సినిమా 2019లో మొదలుపెట్టాను. కొవిడ్‌ కారణంగా విదేశాల్లో షూటింగ్‌ సాధ్యపడలేదు. ఎట్టకేలకు 2022లో యూకే వెళ్లి షూటింగ్ పూర్తి చేశాం. అప్పుడు కూడా 40 మందికి వీసాలకు దరఖాస్తు చేస్తే పదిమందికే ఇచ్చారు’’

ఆ అనుబంధం వల్లే మంచి అవుట్‌పుట్‌

‘‘కళ్యాణ్ మాలిక్ ‘అష్టాచమ్మా’ నుంచే తెలుసు. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఒకరికొకరికి తెలుసు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు సంగీత దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సినిమాలో ‘కనుల చాటు మేఘమా’ పాటను కీరవాణి గారి లాంటి దిగ్గజం సహా అందరూ ప్రశంసించడంతో కళ్యాణ్ మాలిక్ ఎంతో ఆనందంగా ఉన్నారు’’

నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేశాడు

‘‘నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. యూకేలో షూటింగ్‌కి పదిమందితోనే వెళ్లడంతో అక్కడ మేం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నాగశౌర్య తన నటనతో ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవాడు. రోజూ అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి కలిగేది. నాగశౌర్య ఎంత బాగా నటించాడనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. అయితే నేను కథ రాసుకునేటప్పుడు ఫలానా నటుడిని దృష్టిలో పెట్టుకొని రాయను. కథ రాసుకున్నాక దానికి తగ్గ నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటాను.  18 నుంచి 28 ఏళ్ల వరకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రయాణమే ఈ చిత్ర కథ. ఒకొక్క ఛాప్టర్‌ 20 నిమిషాల నిడివితో మొత్తం  ఏడు ఛాప్టర్లుగా సినిమా ఉంటుంది. నా గత చిత్రాలకి పూర్తి భిన్నమైనది. టీజర్‌లో కనిపిస్తున్న ముద్దు సన్నివేశం సహా అన్నీ ముందే మాళవికకు చెప్పా. ఆ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి కచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు చేయడానికి సిద్ధపడతారనేది నా అభిప్రాయం.

అలా ఆ అవకాశం వచ్చింది!

‘‘ఒకసారి టీమ్ ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’కు సంభాషణలు రాస్తారా అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు తెలుసు. నాగార్జున గారు కూడా నటిస్తున్నారని తెలుసు. పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యే సినిమా కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాను. ఆ సినిమా చూసి నాకు అవతార్-2 అవకాశం ఇచ్చారు. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని అవతార్-2 కి రాశాను. ఇక తదుపరి సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఒక కథ అనుకుంటున్నాను. ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. నానితో మంచి అనుబంధముంది. ఆయనతో సినిమా చేయాలని ఉంది. కానీ దానికి సమయముంది. నటుడిగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలోనే విడుదల కానుంది. నటుడిగా తృప్తినిచ్ఛే పాత్రలు మాత్రమే చేస్తూ ఎక్కువగా రచన, దర్శకత్వం మీద దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు