Srivalli: సంచలన గీతం ‘శ్రీవల్లి’.. ఇంగ్లిష్‌ వెర్షన్‌ విన్నారా..!

‘శ్రీవల్లి’ ఇంగ్లిష్‌ వెర్షన్‌. ఎమ్మా హీస్టర్స్‌ పాడిన శ్రీవల్లి పాట సంగీత శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది.

Published : 07 Feb 2022 11:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే రాగాన్ని ఎవరు స్వరపరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు ఈ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు డచ్‌ గాయని ఎమ్మా హీస్టర్స్‌ అవుననిపిస్తోంది. అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లోని సంచలన గీతం ‘శ్రీవల్లి’ని ఇంగ్లిష్‌లో తనదైన శైలిలో పాడి సంగీత శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే’ అని తెలుగులోనూ ఆలపించి ఫిదా చేస్తోంది. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్‌ ఎమ్మా వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘శ్రీవల్లి ఇంగ్లిష్‌ వెర్షన్‌ చాలా బాగుంది’, ‘సంగీతానికి ఎల్లలు లేవు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నెదర్లాండ్స్‌కు చెందిన ఎమ్మాకు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ. మ్యూజిక్‌ టీచర్‌ అయిన తన తల్లి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటూ పెరిగింది. చదువు పూర్తయ్యాక స్వయంగా కవర్‌ సాంగ్స్‌ చేయటం ప్రారంభించింది. యూట్యూబ్‌ వేదికగా సంగీత ప్రపంచానికి తన ప్రతిభను పరిచయం చేసింది. అనతికాలంలోనే అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లును సొంతం చేసుకుంది. ఎక్కువగా ఇంగ్లిష్‌ పాటలతో ఆకట్టుకునే ఎమ్మా తొలిసారి తెలుగు పాటను ఆలపించటం విశేషం. చంద్రబోస్‌ (తెలుగు) రచించిన ఈ పాటను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో సిధ్‌ శ్రీరామ్‌ పాడగా హిందీలో జావేద్‌ అలీ అలపించారు. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా కనిపించి కనువిందు చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని