Srivishnu: అది ఈ కథకి సరిపోతుంది

శ్రీవిష్ణు సినిమా అనగానే అందులో కొత్త కథ ఉంటుందనే ఓ నమ్మకం. మధ్యలో పరాజయాలు ఎదురైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ప్రయాణం చేస్తున్నారాయన. ఇటీవల చైతన్య దంతులూరి

Updated : 06 May 2022 13:53 IST

శ్రీవిష్ణు సినిమా అనగానే అందులో కొత్త కథ ఉంటుందనే ఓ నమ్మకం. మధ్యలో పరాజయాలు ఎదురైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ప్రయాణం చేస్తున్నారాయన. ఇటీవల చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘భళా తందనాన’ చేశారు. ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శ్రీవిష్ణు. ఆయన చెప్పిన విషయాలివీ...

‘‘నా సినిమాలకి వీలైనంత వరకు తెలుగు పేర్లు పెట్టడానికే ప్రయత్నిస్తుంటాం. ఆంగ్లం ప్రభావంతో కొన్ని తెలుగు పదాలు  మరిచిపోతున్నాం. అందుకే అర్థం కాదేమో అనిపించినా, ఎలాగోలా తెలుసుకుంటారనే ధైర్యంతో తెలుగు పేర్లపైనే మొగ్గు చూపుతుంటా. ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’... ఇలా తెలుగు పేర్లతోనే సినిమాలు చేశా. ‘భళా తందనాన’ తెలుగు పదమే. మనందరికీ తెలిసిన పాట. అన్నమయ్య రాసిన కీర్తనల్లో ఎక్కువగా భక్తి భావాన్నీ, మంచి చెడుని ఆవిష్కరించేవే. భళా తందనాన అనే పాటలో విప్లవభావం స్ఫురిస్తుంది. మనుషులంతా ఒక్కటే, అందరికీ భూమి, సూర్యుడు ఒక్కటే అని రాశారు. భళా తందనాన పాట ఈ కథకి సరిపోయేలా ఉంటుంది. అదెలా అనేది తెరపైనే చూడాలి’’.

* ‘‘ఓ సామాన్య యువకుడు, ఓ పాత్రికేయురాలు నేపథ్యంలో సాగే కథ ఇది. సామాన్య యువకుడిగా కనిపించే నేను కొన్ని పనులు చేయాలనుకుంటాను. అందుకోసం పాత్రికేయురాలు సహాయం తీసుకుంటాను. ఆ ప్రయత్నంలో ఏం జరిగింది? సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించిందనేది ఆసక్తికరం. చైతన్య దంతులూరి ‘బాణం’ చేసినప్పుడు ఆ ప్రయాణం మొత్తంలో నేనున్నాను. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాం. ఇన్నాళ్లకి కుదిరింది. నేరంతోపాటు థ్రిల్లింగ్‌ అంశాలు, హాస్యం మేళవించిన ఓ మంచి కథ ఇది’’.

* ‘‘ఓ సినిమా బాగోలేదనే టాక్‌ బయటికి రాగానే అందరిలోనూ డబ్బు పోయిందనే బాధ కలుగుతుంది. నా విషయంలో మాత్రం సినిమా ఇబ్బంది పడినా సరే, నిర్మాత డబ్బు పోదు. అలాంటి ప్రణాళికతో సినిమాలు చేస్తుంటాను. ఫ్లాప్‌ వచ్చిందంటే దాన్నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటా. కథానాయకుడిగానే కాకుండా, బలమైన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. మంచి పాత్రని దేన్నీ వదిలిపెట్టలేదు’’.

* ‘‘విజయాలొచ్చాయి, పరాజయాలొచ్చాయి కానీ, నా కెరీర్‌లో సంచలనాల్ని చూడలేదు. ఈ ఏడాది కచ్చితంగా ఓ సంచలనం ఉంటుంది. ఓ పోలీస్‌ అధికారి బయోపిక్‌గా ‘అల్లూరి’ అనే సినిమా చేస్తున్నా. అది ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తుంది. అది కాకుండా మరో మూడు కొత్త ప్రాజెక్టులు చేస్తున్నా. అందులో ఒకటి హసిత్‌ గోలి దర్శకత్వంలో చేస్తున్నా. ఆ సినిమాలో నాది త్రిపాత్రాభినయం. ప్రతీ సినిమా ఓ కొత్త రకమైన జోనర్‌లో సాగుతుంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని