Sriwass: ఎన్టీఆర్ ఆ కథ ఓకే చేసుంటే.. ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ వచ్చేవి కాదు: శ్రీవాస్‌

‘లక్ష్యం’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘లౌక్యం’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీవాస్‌. గోపీచంద్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘రామబాణం’ త్వరలో విడుదలకాబోతున్న సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 12 Apr 2023 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ (NTR)కు గతంలో తానో కథను వినిపించానని, దానికి ఆయన ఓకే చెప్పి ఉంటే ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘మహర్షి’ (Maharshi), ‘శతమానం భవతి’ (Sathamanam Bhavati) చిత్రాలు తెరకెక్కి ఉండేవి కాదని దర్శకుడు శ్రీవాస్‌ (Sriwass) అన్నారు. తాను రాసుకున్న కథలో ఆ మూడు చిత్రాల నేపథ్యాలు మిళితమై ఉన్నాయని తెలిపారు. తన తాజా చిత్రం ‘రామబాణం’ (Rama Banam) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘నా తొలి చిత్రం ‘లక్ష్యం’ విడుదలైన తర్వాత నిర్మాత దిల్‌రాజుతో ఓ సినిమా విషయమై చర్చలు జరిపా. స్టార్‌ హీరోతో ఆ కథను తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఎన్టీఆర్‌ను సంప్రదించా. బేసిక్‌ పాయింట్‌ను ఆయనకు వినిపిస్తే ఇటీవల ఇలాంటి నేపథ్యమున్న సినిమాలు రాలేదని, చాలా మంచి సబ్జెక్ట్‌ అని అన్నారు. ఆయన ఆ మాట అనడంతో కొన్ని నెలలు కష్టపడి స్క్రిప్టు పూర్తి చేశా. అనంతరం, ఎన్టీఆర్‌ని కలవగా కారణమేంటో తెలియదుగానీ ఆ కథ తనకు వర్కౌట్‌ కాదేమోనని సందేహించారు. అప్పుడు నాకేం చేయాలో తెలియలేదు. ఒకవేళ ఆ స్టోరీ కార్యరూపం దాల్చి ఉంటే శ్రీమంతుడు, మహర్షి, శతమానం భవతి సినిమాలు తెరకెక్కేవి కాదు. ఎన్టీఆర్‌ నో చెప్పిన కొన్ని రోజుల తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ఆ స్టోరీ గురించి చెప్పా. చాలా బాగుందన్న ఆయన కూడా అనివార్య కారణాల వల్ల చేయలేదు. ఎప్పటికైనా ఈ కథతో సినిమా చేస్తా. దానికి సంబంధించిన హంగులు ఇతర సినిమాల్లో కనిపించాయిగానీ సోల్‌ అలానే ఉంది’’ అని శ్రీవాస్‌ తెలిపారు.

తొలి ప్రయత్నం ‘లక్ష్యం’ చిత్రంతోనే దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు శ్రీవాస్‌. ఆ తర్వాత, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘లౌక్యం’, ‘డిక్టేటర్‌’, ‘సాక్ష్యం’ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. మే 5న ‘రామబాణం’ను విడుదల చేయబోతున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత శ్రీవాస్‌- హీరో గోపీచంద్‌ (Gopi Chand) కాంబినేషన్‌తో రూపొందిన చిత్రమది. డింపుల్‌ హయాతి కథానాయిక. జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని