SS Rajamouli: చిరు మూవీలో అది కనిపించలేదు.. అందుకే ‘మగధీర’లో ఆ సీన్‌!

SS Rajamouli: రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర’లో గుర్రం కాపాడే సీన్‌ ఎమోషనల్‌గా తీర్చిదిద్దడానికి ‘కొదమ సింహం’ కారణమని అగ్ర దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో పంచుకున్నారు.

Published : 06 Jun 2023 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెండితెరపై సినిమా చూస్తున్న ప్రేక్షకుడి భావోద్వేగాలను పతాకస్థాయికి తీసుకెళ్లడంలో అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(SS Rajamouli)ది అందెవేసిన చేయి. అందుకే ఆయన అపజయం ఎరుగని దర్శక ధీరుడు అయ్యారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మగధీర’. కాజల్‌ కథానాయిక. ఇందులో రామ్‌చరణ్‌, దేవ్‌గిల్‌ మధ్య జరిగే పోటీ ఉత్కంఠగా సాగుతుంది. ఆ సన్నివేశాన్ని తీయడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని జక్కన్న ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘ఒకరోజు చిరంజీవిగారి ‘కొదమ సింహం’ (Kodama Simham)చూస్తున్నా. విలన్స్‌ ఆయన్ను ఇసుకలో పీకల్లోతు పాతి పెట్టేస్తారు. అదే సమయంలో ఆయన గుర్రం వచ్చి సాయం చేస్తుంది. ఆ సన్నివేశం చూస్తూ నేను చాలా ఎమోషనల్‌ అయ్యా. ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్లు ఆగలేదు. గుర్రం సాయంతో చిరంజీవిగారు (Chiranjeevi) బయటపడిన తర్వాత ఆయనకూ గుర్రానికి ఎలాంటి ఇంటరాక్షన్‌ ఉండదు. అది చూసి చాలా నిరాశపడ్డాను. ఆ సమయంలో నాకు అది గుర్రంలా అనిపించలేదు. అదొక వ్యక్తిలా అనిపించింది. మనకు సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పకపోతే ఆ ఎమోషన్‌ ప్రేక్షకుడి గుండెను తాకదు. అది నాకు మైండ్‌లో బాగా ఉండిపోయింది. ఒక సగటు ప్రేక్షకుడిగా అది నాకు సంతృప్తినివ్వలేదు. దాని నుంచి వచ్చిందే ‘మగధీర’ (Magadheera)లోని సన్నివేశం. ఇందులో కూడా రామ్‌చరణ్‌  (Ram charan) ఇసుక ఊబిలో కూరుకుపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన గుర్రం అక్కడకు వచ్చి, సాయం చేస్తుంది. ఆ ఆపద నుంచి బయట పడిన తర్వాత ఆ గుర్రం దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని, కృతజ్ఞత చూపిస్తాడు. అది ప్రేక్షకుడికి విపరీతమైన కిక్‌ ఇచ్చింది. ‘కొదమ సింహం’ చూస్తూ నేను ఏది ఫీల్‌ అవ్వలేకపోయానో దాన్నే, ‘మగధీర’తో పూర్తి చేశా.  నాలాంటి సగటు ప్రేక్షకుడు కోరుకునే భావోద్వేగాలనే నా సినిమాలోనూ ఉండేలా చూసుకుంటాను’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. పూర్తి యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో ఏయే లొకేషన్లలో సినిమా తీయాలన్న దానిపై చిత్ర యూనిట్‌ చర్చిస్తోంది. త్రివిక్రమ్‌తో సినిమా అయిపోయిన వెంటనే మహేశ్‌, రాజమౌళి సినిమా మొదలవుతుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని