Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయానికి అదే కారణమని నమ్ముతున్నా..: రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను విదేశీయులు కూడా ఆదరిస్తున్నారని రాజమౌళి అన్నారు. ఆ సినిమాలో ఉన్న యాక్షన్‌ సన్నివేశాలే అందుకు కారణమని ఆయన తెలిపారు.  

Published : 27 Oct 2022 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ సినిమా ఇటీవలే జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సత్తా చాటుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు హాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రాజమౌళి.. అద్భుతమైన హీరోయిజమే ఈ సినిమా విజయానికి కారణమన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు ఉన్నారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని అనుకున్నా. కానీ, విదేశీయులు కూడా ఈ చిత్రంపై ఎంతో అభిమానం చూపిస్తున్నారు. ఇది నేను ఊహించలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు, అద్భుతమైన హీరోయిజం వల్లే ఈ సినిమా గొప్ప విజయం సాధించిందని నేను నమ్ముతున్నా’’ అని రాజమౌళి అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా హాలీవుడ్‌ చిత్రాలకిచ్చే ప్రముఖ శాటర్న్‌ అవార్డును తన ఖాతాలో వేసుకొంది. ఈ సంవత్సరం ఆస్కార్‌ బరిలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిలవనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని