SS Rajamouli: ఆ ప్రశ్న జక్కన్న జీవితాన్ని మార్చింది!

కథలరాయుడి నుంచి కలెక్షన్ల రారాజు దాకా జక్కన్న సాగించిన ప్రయాణంపై ఓ కథనం. 

Updated : 10 Oct 2021 11:26 IST

కెరీర్‌లో ఒకటో, రెండో ఇండస్ట్రీ హిట్లుంటే టాప్‌ డైరెక్టర్‌ అంటారు. తీసినవన్నీ బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లైతే ఆయన్నే జక్కన్న అని పిలుస్తారు.  ‘స్టూడెంట్‌ నెం.1’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన ఎస్‌ఎస్‌ రాజమౌళి.. ‘సింహాద్రి’, ‘మగధీర’ మొదలుకొని ‘బాహుబలి: ది బిగినింగ్’‌, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకంగా సగర్వంగా నిలబడ్డారు. అక్టోబరు 10న ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా కథలరాయుడి నుంచి కలెక్షన్ల రారాజు దాకా జక్కన్న సాగించిన ప్రయాణంపై ఓ కథనం. 

చిన్నప్పుడు కథలరాయుడు

రాజమౌళి కర్ణాటకలోని రాయచూర్‌లో జన్మించారు. అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కుటుంబమంతా అక్కడే ఉండేది. రాజమౌళి మాత్రం తన సోదరితో కలిసి కొవ్వూరులో నానమ్మ దగ్గర ఉండేవాళ్లు. బాల్యమంతా అక్కడే సాగింది. ఆ ఊరిలోనే ఒక గ్రంథాలయం ఉండేది. చాలా కథల పుస్తకాలొచ్చేవి. వాటన్నింట్లోకి  ‘అమరచిత్ర కథలు’ అంటే విపరీతమైన అభిమానం. అవి చదువుతూ వేరే లోకాల్లో విహరించేవాడు బాల జక్కన్న. బాలభారతం, రామాయణం, బాల భాగవతం.. ఇలా ఏ పుస్తకమైనా వదిలే ప్రసక్తే లేదన్నట్లు చదివేవాడు. అలా పుస్తకాల సహవాసం చేశాడు. హోం వర్క్‌ చేయమని వాళ్లమ్మ ఏరోజూ ఒత్తిడి చేయలేదు. ఖాళీగా ఉంటే మాత్రం కథల పుస్తకమైనా చదువు, లేదా బయటకెళ్లైనా ఆడుకో, అంతేకానీ స్థిరంగా కదలకుండా కూర్చోకు అని చెప్పేవారు. అలా అమ్మ ప్రోత్సాహంతో కథలపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారాయన. 


వామ్మో కథ మొదలెడ్తాడ్రా

నాన్నమ్మ నుంచే కథలు చెప్పే అలవాటు అబ్బింది. అలాంటి ఇలాంటి కథలు కాదు. అన్ని భారీ కథలే.  సాధారణంగా పిల్లలు కథలు చదివి ఊరుకుంటారు లేదా తోటివారికి చెబుతారు. రాజమౌళి అలా కాదు.. ఆ కథలను తనకు నచ్చినట్టుగా మార్చేసి, కొత్తకొత్త వింతలూ విశేషాలు జోడించి చెబితే అంతా ఆసక్తిగా వినేవారు. క్రమంగా క్రియేటివిటీ ఎక్కవైపోయేసరికి మొదట్లో ఆశ్చర్యపోయి విన్నవాళ్లు ఆ తర్వాత విసుగొచ్చి వెక్కిరించడం మొదలుపెట్టారు. నేను కథలు చెప్పడానికి వెళ్తుంటే ‘వామ్మో వీడు మళ్లీ కథ మొదలుపెడ్తాడ్రా’ అని విసుక్కునేవారు. అది కొంత ఇబ్బంది అనిపించి, ఆ ఊరు వదిలి మరెక్కడికైనా వెళ్లిపోతే బాగుణ్ణు అని చాలా సార్లు అనుకునేవాడు. 


ఆ పేరు వల్లే చదువుకు స్వస్తి 

సరిగ్గా అదే సమయంలో.. ఏలూరులో ఉండే అత్తయ్య రాజమౌళిని తీసుకెళ్లింది. కొవ్వూరులో జరిగిన అవమానాలతో కథలరాయుడు తాత్కాలికంగా నిద్రపోయాడు. కానీ ఆ కథలు నిద్రపోనిచ్చేవి కాదు. ఏవేవో ఫాంటసీలతో జక్కన్నలోని కలలరాయిడు నిద్రలేచాడు. ఏలూరుకి వచ్చాక నాలుగో తరగతి నుంచి నేరుగా ఏడో తరగతిలో చేరిపోయాడు. అప్పుడు రికార్డుల్లో జక్కన్న పేరేంటో తెలుసా? విజయ అప్పారావు. అది వాళ్ల తాతయ్య పేరు. మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత అంతా అప్పారావు అని పిలుస్తుంటే తెగ ఫీలయిపోయేవాడు. చదువు మధ్యలోనే ఆపేయడానికి ముఖ్యకారణం ఆ పేరేనని చెబుతాడు రాజమౌళి.  ఇంటర్‌ ఫస్టియర్‌కి వచ్చేసరికి విజయేంద్రప్రసాద్‌ రచయితగా చెన్నైలో స్థిరపడటంతో చదువు మానేసి ఛలో చెన్నై అని అక్కడ వాలిపోయాడు.


వదిన రాకతో జీవితంలో మార్పు

చెన్నైకి వెళ్లాక రోజూ కీరవాణి రికార్డింగ్‌ థియేటర్‌కి కల్యాణ్‌ మాలిక్‌తో కలిసి వెళ్లి వస్తుండేవారు. ఆ తర్వాత ఇంటర్‌ ఎలాగో పాసయ్యారు. అక్కడ మళ్లీ కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది.  అదే సమయంలో కీరవాణికి పెళ్లై వదిన శ్రీవల్లి రాక జక్కన్న జీవితాన్ని మార్చేసింది. ‘అసలు లైఫ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నారు’ అని శ్రీవల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకలేదు. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. విజేయంద్రప్రసాద్‌ చొరవతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా చేరిపోయారు. క్రాంతికుమార్‌ దగ్గర సహాయకుడిగానూ పనిచేశారు. విజయేంద్రప్రసాద్‌కి మంచి పేరు రావడంతో ఎక్కడో పనిచేయడం ఎందుకుని ఆయన దగ్గరే అసిస్టెంట్‌గా చేరారు. ముందుగా చెప్పిన కథతో పోల్చితే తెరమీద సినిమాలు పేలవంగా అనిపించిన సందర్భాలున్నాయి. తానైతే ఇంకా బాగా తీసేవాడినని పలుమార్లు అనుకున్నాడు. ఆ అనిపించడంలోనే డైరెక్టర్‌ కావాలనే ఆలోచన ఆయనలో బలంగా నాటుకుపోయింది. 


కాన్సెప్ట్‌కి ఐదువేలు

నాన్న దగ్గర చేస్తే సొంత గుర్తింపు ఉండదని, హైదరాబాద్‌కు వచ్చి గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఇక్కడ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటితో కలిసి హైదరాబాద్‌లో తిరిగేవారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర వాళ్లిద్దరూ చేరిపోయారు. వీరితోపాటే ‘నా అల్లుడు’ డైరెక్టర్‌ ముళ్లపూడి వర కూడా సహాయకుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు దర్శకేంద్రుడికి నచ్చేలా కాన్సెప్ట్‌ తయారు చేస్తే ఒక ప్రకటనకు రూ.ఐదువేలిచ్చేవారు. అదే జక్కన్నకు తొలిసంపాదన. ఏడాదికి పాతిక ప్రకటనలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 


ఆ కష్టం చూసే అవకాశం

ప్రకటనలు విజయవంతం అయ్యాక ‘శాంతినివాసం’ సీరియల్‌కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్లపూడి వర, రాజమౌళి ఇద్దరితో రాఘవేంద్రరావు ఆ సీరియల్‌ మొదలుపెట్టారు.  జక్కన్న చెప్పే పనిచేసే తీరు దర్శకేంద్రుడికి నచ్చింది. విసుగు చెందకుండా పనిచేస్తాడు. ‘శాంతి నివాసం’ సమయంలో ఏడాదిన్నరపాటు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవాడు.  ఆ కష్టం ఊరికే పోలేదు. ప్రపంచం మెచ్చే దర్శకుడిగా మారాడు.  


స్టూడెంట్‌ నెం. 1 కి ఇద్దరు దర్శకులు!

సీరియల్‌ పూర్తయిన ఏడాదికి అంటే 2002లో ‘స్టూడెంట్‌ నెంబర్‌1’ వచ్చింది. నిజానికి ఆ సినిమాను కూడా ముళ్లపూడి వర, రాజమౌళి కలిసి చేయాల్సింది. కానీ ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వర తప్పుకున్నాడు. రాజమౌళి తొలిసారి సినీ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అయితే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేసిన సినిమా అది. అందులో తన ముద్ర లేదనిపించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌తో ‘విజయసింహా’ అనే సినిమా చేయాలనుకున్నారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ‘ స్టూడెంట్‌ నెం.1’ తర్వాత ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నారు. ఆ సమయంలో తనని తాను తెలుసుకున్నారు జక్కన్న. అప్పుడే విజయేంద్రప్రసాద్‌ ‘సింహాద్రి’ కథను వినిపించారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాదరామన్న’, ‘ఈగ’ వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్లతో దూసుకొచ్చారు. ‘బాహుబలి’తో టాలీవుడ్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వచ్చే సంక్రాంతి బరిలోకి దిగనున్న జక్కన్న మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆశిస్తూ దర్శకధీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని