RRR: ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఖాతాలో మరో ఘనత.. రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు

శాటర్న్‌, సన్‌సెట్‌ సర్కిల్‌ వంటి అంతర్జాతీయ అవార్డులను సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ఇప్పుడు మరో విశేష ఘనత సొంతం చేసుకుంది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డును దక్కించుకుంది.

Updated : 03 Dec 2022 10:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) మరో ఘనత దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. వార్తా పత్రికలు, మ్యాగజైన్స్‌, ఆన్‌లైన్‌ పబ్లికేషన్స్‌కు సంబంధించిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి 1935 నుంచి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తున్నారు.

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి సుమారు రూ.1200 కోట్లు వసూళ్లు రాబట్టిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ఈ సినిమా ఇప్పటికే శాటర్న్‌, సన్‌సెట్‌ సర్కిల్‌ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా ‘ఆస్కార్‌’ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దాదాపు 14 విభాగాల్లో ఇది ఆస్కార్‌ వేదికగా పోటీ పడనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని