RRR: ఆ రెండు చిత్రాలే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు స్ఫూర్తి: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాకు తీయడానికి రెండు సినిమాలు ఎంతో ప్రేరణనిచ్చాయని తెలిపారు. ఆ సినిమాలు చూశాక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తీయగలననే నమ్మకం కలిగిందని అన్నారు.

Published : 17 Feb 2023 19:05 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో భారతీయ సినిమా పేరును అంతర్జాతీయ వేదికలపై వినిపించేలా చేశారు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. తాజాగా తనకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తీయడానికి రెండు సినిమాలు స్ఫూర్తి అని తెలిపారు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన అలనాటి చిత్రం ‘మాయాబజార్‌’ (Mayabazar) సినిమాలోని చాలా సన్నివేశాలు తనను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేయడానికి ప్రేరేపించాయని చెప్పారు. అలాగే మెల్‌ గిబ్సన్‌ (Mel Gibson) తీసిన సినిమాలోని సన్నివేశాలు ‘కొమురం భీం’ పాటకు ఎంతో ప్రేరణ అని అన్నారు.

వీటి గురించి మాట్లాడుతూ.. ‘‘గతంలో పురాణాల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ఉపయోగించిన భాష ఆధునిక భాషకు దగ్గరగా లేదు. అందులో వాడిన భాష, పదాలు షేక్‌స్పియర్‌ భాషను పోలి ఉంటాయి. కానీ, మాయాబజార్‌లోని డైలాగ్‌లు వర్తమాన భాషకు దగ్గరగా ఉంటాయి. అలా చేయడానికి దర్శకుడికి చాలా ధైర్యం కావాలి. నేను ఆయన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అప్పట్లో తెలుగు పరిశ్రమలో ఉన్న చాలా మంది  స్టార్స్ ‘మాయాబజార్‌’ సినిమాలో ఉన్నారు. అలాంటి చాలా మంది స్టార్స్‌తో చేసిన ప్రయోగమే ‘మాయాబజార్‌’. ఆ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రేరణనిచ్చింది’’ అన్నారు.

‘‘అలాగే ‘ప్యాషన్‌ ఆఫ్‌ ది క్రైస్ట్‌’ (Passion of the Christ) సినిమా మొత్తాన్ని నేను ఒకేసారి చూడలేకపోయాను. ఆ సినిమా నాకు చాలా హింసాత్మకంగా అనిపించింది. అందులోని కొన్ని సన్నివేశాలు మాత్రం అద్భుతంగా అనిపించాయి. ‘కొమురం భీం’ పాటలో కొరడాతో కొట్టే సన్నివేశానికి ఆ సినిమానే స్ఫూర్తి’’ అని రాజమౌళి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని