Mahesh babu: మహేశ్‌బాబుతో రాజమౌళి మూవీ.. నేపథ్యం ఇదే!

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ నేపథ్యం ఏంటో చెప్పేసిన జక్కన్న..

Published : 13 Sep 2022 12:47 IST

హైదరాబాద్‌: కొన్ని కాంబినేషన్లు చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో మహేశ్‌బాబు (Mahesh babu) - రాజమౌళి (Rajamouli) ప్రాజెక్టు ఒకటి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... రాజమౌళి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను జక్కన్న మొదలుపెట్టారు. మరోవైపు మహేశ్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించారు. ఆ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేశ్‌. కాగా, ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో నటించే విషయమై ఇప్పటికే మహేశ్‌బాబు తన స్పందన తెలియజేశారు. ‘‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు రెండు కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. పూర్తి స్క్రిప్ట్‌ అయిన తర్వాత మహేశ్‌ - రాజమౌళి స్థాయిలకు తగిన కథను ఎంపిక చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని