NTR: శత వసంతాల మహోన్నత నట శిఖరం

ఎన్నెన్నో సవాళ్లు... ఎన్టీఆర్‌ పట్టుదలకు ఆనవాళ్లు! చేతిలో  బి.ఎ.డిగ్రీ, ఊరికి దగ్గరగా ప్రభుత్వ ఉద్యోగం, నచ్చిన నాటక సమాజం, కడుపులో చల్లకదలకుండా సాగిపోయే వైవాహిక జీవితం - వీటికి మించిందేదో ఆయనకు వెండి తెర మీద కనిపించింది.

Updated : 28 May 2023 13:30 IST

ఎన్నెన్నో సవాళ్లు... ఎన్టీఆర్‌ పట్టుదలకు ఆనవాళ్లు! చేతిలో  బి.ఎ.డిగ్రీ, ఊరికి దగ్గరగా ప్రభుత్వ ఉద్యోగం, నచ్చిన నాటక సమాజం, కడుపులో చల్లకదలకుండా సాగిపోయే వైవాహిక జీవితం - వీటికి మించిందేదో ఆయనకు వెండి తెర మీద కనిపించింది. మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంత ఒలక బోసుకోవడం దేనికని ఆయన అనుకోని ఉంటే నూరేళ్ల చరిత్ర ఉండేది కాదు! ఇష్టమైన సినిమా నట జీవితం కోసం ఎన్టీఆర్‌ ఎన్నో సవాళ్లను స్వీకరించారు. క్రమశిక్షణ పాటించారు...కలలు సాకారం చేసుకున్నారు...కళాగ్రేసరుడిగా నిలిచారు!

పట్టుదలతో చెట్టపట్టాలు...

తొలి చిత్రం ‘మనదేశం’...పోలీసు డ్రెస్సులో లాఠీ చార్జ్‌ సన్నివేశం...ఆయనకి పూనకం వచ్చింది. దాంతో ‘‘నటన అంటే పాత్రలో లీనం కావడం కాదు..’’ అని దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ మందలించాల్సి వచ్చింది. రెండో చిత్రం ‘పల్లెటూరి పిల్ల’లో హీరో వేషం. పోట్ల గిత్తతో పోట్లాడే సన్నివేశంలో ‘డూప్‌’ ని కాదని, సొంతంగా ఎద్దు కొమ్ములు వంచబోయి, చెయ్యి విరిగినా చలించ లేదాయన! సరదా ఆటలో సైతం ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌లోని పట్టుదలే కె.వి.రెడ్డిని ఆకర్షించి, ‘పాతాళ భైరవి’ లో తోట రాముడి పాత్రకు ఎంపిక చేసింది. కోటేరు ముక్కుతో కుదురైనా రూపం ‘మాయాబజార్‌’లో కృష్ణుడిగా నిలబెట్టింది. ఆ పాత్రలో ఎన్టీఆర్‌ తప్ప ఇంకొకరిని స్వీకరించలేని స్థాయికి చేర్చింది. ‘ఎన్‌.ఎ.టి’ సంస్థ నెలకొల్పి, హీరోగా తన గ్లామర్‌ ని పెంచుకోకుండా, సామాజిక సందేశాలతో ‘పిచ్చి పుల్లయ్య’, ‘తోడు దొంగలు’ లాంటి చిత్రాలు తీసి, డబ్బులు పోగొట్టుకున్న పట్టుదల ఆయనది. ‘‘నువ్వు రాముడో, కృష్ణుడో వెయ్యాలిగానీ, రావణుడి పాత్ర వెయ్యడమేంటి?’’ అంటూ తాను గురుతుల్యుడిగా భావించే కె.వి.రెడ్డి ‘సీతారామకళ్యాణం’ సినిమా దర్శకత్వ బాధ్యతలను సున్నితంగా నిరాకరించినప్పుడు, ఆయన వద్దన్న వేషం వేసి, దర్శకత్వం కూడా చేసి, తెర మీద తన పేరు వేసుకోకపోవడం ఆయనకు మాత్రమే చెల్లింది. అదే కె.వి. రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలుసుకుని ‘శ్రీ కృష్ణ సత్య’ చిత్రానికి దర్శకత్వం చేయమని ఆహ్వానించి, ఫ్లోర్‌లో ఆయన్ని కూర్చోబెట్టి, అన్ని బాధ్యతలూ తానే చూసుకుని, టైటిల్స్‌లో పెద్దాయన పేరు వేసిన గురుభక్తి సైతం రామారావుదే!
బి.ఎన్‌. రెడ్డి లాంటి దర్శకుడి మాటను తోసిరాజని, నిజమైన కత్తులతో పోరాట దృశ్యంలో పాల్గొన్నా, రావణ, దుర్యోధన పాత్రల కోసం ‘మణుగుల కొద్దీ బరువున్న’ కిరీటాల్నీ, ఆయుధాల్ని మోస్తూ, పేజీల కొద్దీ సంభాషణల్ని అవలీలగా, అలవోకగా చెప్పి, ప్రేక్షకుల చేత ఈలలు వేయించినా, శ్రీకృష్ణుడి లాంటి సాత్విక పాత్రలో సైతం ‘రాయబారం’ ఘట్టంలో, ఆవేశపూరితమైన భావ ప్రకటన కోసం- తొడ మీద తట్లు తేలేలా మురళితో పదే పదే చరచుకోవాల్సి వచ్చినా అవన్నీ ఆయనకు మాత్రమే సాధ్యాలు!

ప్రజలతో మమేకం..

సమస్యల పట్ల స్పందించే లక్షణం ఎన్టీఆర్‌లో ఉంది. రాయల సీమ క్షామ నిధి, పోలీసు సంక్షేమ నిధి, సరిహద్దుల్లో సమర భేరీ మోగిన సందర్భాల్లో సైనిక సహాయ నిధి, తుపాను బాధితుల నిధి లాంటి కార్యక్రమాలు సమాజం పట్ల ఆయన స్పందనకు తార్కాణాలు. వరుస విజయాలతో పారితోషికం గరిష్ఠ స్థాయికి చేరుకున్న రోజుల్లో అరవయ్యో పడి సమీపిస్తున్న సమయంలో ఆయన మనసు మార్చుకున్నారు. గట్టు మీద నిలబడి నీతులు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, పదవిలో కూర్చొని, పగ్గాలు పడితేనే పరిష్కారం వీలవుతుందని రామారావు భావించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. పార్టీ నెలకొల్పి, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో సుడిగాలిలా పర్యటించి, కొద్ది నెలలలోనే పదవిని చేపట్టారు. కనీ, వినీ ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరంలోనే, ఆయన నెలకొల్పిన ఎన్‌.ఎ.టి సంస్థ ‘సప్తతి’ - డెబ్భయ్యేళ్ల వేడుక కలసి రావడం విశేషం! భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘ఎన్టీఆర్‌’ ఓ చెక్కు చెదరని అధ్యాయం...మూడు సువర్ణాక్షరాల ముచ్చటైన సంతకం!!

సెకండ్‌ ఇన్నింగ్స్‌....

తనదైన శైలి ముద్ర సుస్థిరంగా కొనసాగుతున్న దశలో మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా యాభయ్యో పడిలో సైతం ‘సై’ అనడం ఎన్టీఆర్‌ స్వీకరించిన మరో సవాల్‌! 1975లో అశ్వనీదత్‌

స్థాపించిన సంస్థకు ‘వైజయంతీ మూవీస్‌’ అని పేరు పెట్టిన ఎన్టీఆర్‌- ఆ సంస్థ తొలి చిత్రం ‘ఎదురు లేని మనిషి’లో సరికొత్త ఆహార్యం, వస్త్రధారణ, ఆట, పాటల గురించి కాస్త సందేహించినా, ‘‘ఓ అభిమానిగా మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాను..’’ అన్న యువ నిర్మాత కోరిక విని, అభిమానుల నాడిని గ్రహించారు. ఆ నిర్ణయం ఎన్టీఆర్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌కి తెర తీసింది.

ఏ పాత్రలోనైనా దిట్టే

ముసలి పాత్రలూ, ఏడుపుగొట్టు వేషాలూ వద్దన్న చక్రపాణి లాంటి అనుభవజ్ఞుల హితబోధలు పెడచెవిన పెట్టి ‘భీష్మ’, ‘రక్త సంబంధం’ లాంటి చిత్రాల్ని రక్తి కట్టించిన దిట్టతనం సైతం ఎన్టీఆర్‌లో ఉంది! అలాగే తన మనసుకు నచ్చిన వేషం వచ్చినప్పుడు నిర్మాతకు సహకరించి, ప్రాజెక్టును పట్టాలకెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. ‘బడి పంతులు’ చిత్ర నిర్మాణానికి గడువు సమీపిస్తున్నా, అడ్వాన్స్‌ తీసుకున్న ఆత్రేయ స్క్రిప్ట్‌ ఇవ్వకుండా నిర్మాతను తిప్పిస్తున్నప్పుడు, డి.వి.నరసరాజును ఒప్పించి, సకాలంలో సంభాషణలు సిద్ధం చేయించింది ఎన్టీఆరే! అలాగే కెరీర్‌ ముగింపులో సైతం గ్లామర్‌ వేషాలకు పెద్ద మొత్తంలో పారితోషికాలు లభిస్తున్నా సరే మనసుకు నచ్చితే చాలు వృద్ధ పాత్రను కూడా ఆయన హృదయపూర్వకంగా అంగీకరించిన సందర్భం ఉంది. వృద్ధ దంపతులు ప్రధాన పాత్రలుగా ‘బస్తీలో బహు కుటుంబీకుడు’ పేరుతో నరసరాజు రాసిన రేడియో నాటకం స్క్రిప్ట్‌ రచయిత చేత చదివించుకుని, లక్షల కొద్దీ పారితోషికం ముట్ట చెప్పి, తన చేత ముసలి వేషం వేయించడానికి బయటి నిర్మాతలు ముందుకు రారని తెలిసి, ‘పుణ్య దంపతులు’ పేరుతో సొంత బ్యానర్‌ మీద తీయడానికి స్క్రిప్ట్‌ సిద్ధం చేయించిన పట్టుదల ఎన్టీఆర్‌ది. కాకపోతే ఆ చిత్రం కార్య రూపం ధరించక పోవడం వేరే కథ.

ఓలేటి శ్రీనివాసభాను

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని