Published : 28 Mar 2022 17:52 IST

Oscar 2022: ఆ ఘనత పొందిన మూడో మహిళగా జేన్‌.. ‘కొడా’ విజయకేతనం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆస్కార్‌’ అవార్డు అందుకున్న మహిళా డైరెక్టర్స్‌ జాబితాలో మరొకరు నిలిచారు. మరికొందరు మహిళలు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా మారారు. ఆమె ఎవరో కాదు జేన్‌ క్యాంపియిన్‌. ‘ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌’ సినిమాగానూ ఆమె బెస్ట్‌ డైరెక్టర్‌గా ఈ పురస్కారం స్వీకరించారు. మరోవైపు, ఉత్తమ చిత్రంగా ‘కొడా’ నిలిచింది. ఈ సినిమా నేపథ్యం, జేన్‌ క్యాంపియిన్‌ గురించి తెలుసుకుందామా..

ఇదీ కొడా కథ..

94వ ఆస్కార్‌ పురస్కారాలకు ‘డ్యూన్‌’, ‘బెల్‌ఫాస్ట్‌’, ‘డోంట్‌ లుక్‌ అప్‌’, ‘లికోరైస్‌ పిజ్జా’, ‘కింగ్‌ రిచర్డ్‌’, ‘నైట్‌మెర్‌ అలే’, ‘డ్రైవ్‌ మై కార్‌’, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌’, ‘కొడా’.. ఉత్తమ చిత్రాలుగా నామినేట్‌ అయ్యాయి. వీటిల్లో ‘కొడా’ విజయం సాధించింది. ఫ్రెంచ్‌ సినిమా ‘లా ఫామిల్లె బెలియర్‌’కు రీమేక్‌గా సియాన్‌ హెడర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా. సంగీతానికి అధిక ప్రాధాన్యముంటుంది. రూబీ అనే యువతి కథగా ఈ చిత్రం సాగుతుంది. ఆమె కుటుంబంలో తనకి తప్ప మిగతా అందరికీ వినికిడికి సమస్య ఉంటుంది. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకునేందుకు చేపల వేటలో తల్లిదండ్రులకు సాయం చేస్తుంటుంది. మరోవైపు సంగీతంలో రాణించాలన్న తపనతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే బెర్ల్కీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌కు వెళ్లాలనుకుంటుంది. ఇటు తల్లిదండ్రుల్ని వదిలివెళ్లలేక.. అటు సంగీతాన్ని వదులుకోలేక మానసికంగా నలిగిపోతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? తన కలని నిజం చేసుకోవడానికి రూబీ ఏం చేసిందన్నది చిత్ర కథాంశం.


మూడో దర్శకురాలిగా.. 

కత్రియిన్‌ బిగెలో, క్లోయి ఝవో తర్వాత బెస్ట్‌ డైరెక్టర్‌ ఆస్కార్‌ అందుకున్న మహిళగా జేన్‌ క్యాంపియిన్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ వంటి దిగ్గజ దర్శకులతో పోటీపడి విజయకేతనం ఎగరేశారు. న్యూజిలాండ్‌కు చెందిన జేన్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘స్వీటీ’. 1989లో విడుదలైన ఆ చిత్రం మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘యాన్‌ ఏంజెల్‌ ఎట్‌ మై టేబుల్‌’, ‘ది పియానో’, ‘హోలీ స్మోక్‌’, ‘ఇన్‌ ది కట్‌’, ‘బ్రైట్‌ స్టార్‌’ తదితర చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. తృతీయ ప్రయత్నంగా రూపొందించిన ‘ది పియానో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ గెలుచుకున్నారు. అన్ని సినిమాల్లోని ప్రతి ఫ్రేములో జేన్‌ దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి కథలు చెప్పడమే కాదు నటుల ఎంపికలోనూ ఆమె తనదైన ముద్రవేశారు.

‘ఎప్పటికైనా ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ సాధించాలి’ అనే తన కల ‘ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌’తో నెరవేరింది. ఈ చిత్రం విభిన్నమైన పాత్రల కలబోతగా సాగుతుంది. సైకలాజికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు జేన్‌. ఇద్దరు అన్నదమ్ముల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫిల్‌ పాత్ర పోషించిన బెనిడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌ ఉత్తమ నటుల రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని