Kamal Hassan: దశావతారం తెరకెక్కిందిలా..!

అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ నట విశ్వరూపాన్ని ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువ చేసిన చిత్రం ‘దశావతారం’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం....

Published : 14 Jun 2021 17:12 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన చిత్రం ‘దశావతారం’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌హాసన్‌ పది విభిన్నమైన పాత్రల్లో నటించి రికార్డు సృష్టించారు. 2008లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీగా వసూళ్లు రాబట్టింది. ‘దశావతారం’ విడుదలై ఈ ఏడాదితో 13 ఏళ్లైన సందర్భంగా కమల్‌హాసన్‌.. ఈ సినిమా పట్టాలెక్కడం వెనుకున్న కథను వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

ఎవ్వరికీ అర్థం కాలేదు

‘‘దశావతారం’.. ఇదొక అద్భుతమైన కథ. అప్పుడు ఇప్పుడు అనే తేడా లేకుండా ఏ సమయానికైనా ఇది చక్కగా నప్పే సినిమా. ‘దశావతారం’ కథ రాసిన తర్వాత దర్శకత్వం విషయమై ఎంతో మంది డైరెక్టర్లను సంప్రదించగా.. ‘మాకు ఈ కథ అస్సలు అర్థం కాలేదు.  మేము ఈ ప్రాజెక్ట్‌ చేయలేము’ అని చెప్పేసి సున్నితంగా తప్పుకున్నారు. అలాంటి సమయంలో ఓ సారి రవికుమార్‌ నాకు ఫోన్‌ చేయగా.. ఈ కథ గురించి చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. అలా, ఈ ప్రాజెక్ట్‌ అతని ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగలిగింది’

ఆయన మాట విన్నా!

‘ప్రతి సినిమా విషయంలో ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం నాకెంతో ఆసక్తి. అదే విధంగా ‘దశావతారం’ కోసం ప్రముఖ దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ అభిప్రాయం అడిగి తెలుసుకున్నాను. ఈ కథ గురించి ఆయనకు చెప్పగానే బాగుందని చెప్పారు. ‘కమల్‌ ఈ ప్రాజెక్ట్‌ నీకు బిడ్డ లాంటిది. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నువ్వే దగ్గరుండి చూసుకో. నువ్వు కనుక షాట్‌ తీసే సమయానికి వస్తానంటే ఈ బిడ్డ చచ్చిపోతుంది. ప్రాజెక్ట్‌ విషయంలో నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం సరిగ్గా రాదు’ అని శ్రీనివాసన్‌ చెప్పడంతో నేను కూడా ఎక్కువ సమయాన్ని సినిమా కోసమే వెచ్చించాను. అనంతరం స్క్రిప్ట్ బృందం(సుజాత, మదన్‌, రమేశ్‌ అరవింద్‌, క్రేజీ మోహన్‌)తో చర్చించి.. ‘దశావతారం’ స్టోరీ లైన్‌ని సినిమా కథగా మార్చగలిగాం’

21రోజులు యూఎస్‌ టూర్‌

‘కథ, స్క్రిప్ట్‌, ప్రొడక్షన్‌.. అన్ని సమకూరిన తర్వాత లుక్‌ టెస్ట్‌ కోసం దర్శకుడు రవికుమార్‌తో కలిసి నేను అమెరికా వెళ్లాను. ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ మిస్టర్ మైఖేల్ వెస్ట్‌మోర్‌ బెంట్ లుక్స్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు రవికుమార్‌ 250 డాలర్లు చెల్లించి రోజూ మేకప్‌ లుక్స్‌తో ఫొటోషూట్‌ పెట్టించారు. ఆ ఫొటోలు చూసిన మా నిర్మాత ఎంతో సంతోషించి.. సినిమా షూట్‌ కంటే ముందే వాటిని విడుదల చేస్తానని అన్నాడు. అలా వద్దని.. సినిమా విడుదలయ్యే వరకూ వేచి ఉండమని చెప్పాను. దానికి అతను అంగీకారం తెలిపారు. మేకప్‌ విషయంలో వెస్ట్‌మోర్‌కు తిరుగులేదు. అన్ని పాత్రలను అతను అర్థం చేసుకున్నాడు. ప్రతి పాత్రకు ప్రాణం పెట్టి మేకప్‌ చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే మా సినిమాకు అతను 11వ అవతారం. అతను లేనిదే తెరపై మనం చూస్తున్న 10 అవతారాలు సాధ్యమయ్యేవి కావు. 10 పాత్రల్లో నాయుడు పాత్ర సులభమైంది. వృద్ధురాలి పాత్ర అత్యంత కష్టంగా అనిపించింది.

క్లైమాక్స్‌కి రూ.కోటి ఎక్స్‌ట్రా

‘మేము ముందు అనుకున్న దానికంటే.. కేవలం క్లైమాక్స్‌ చిత్రీకరించడానికి రూ.కోటిపైనే అదనంగా ఖర్చు అయ్యింది. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో రూ.కోటి అంటే మామూలు విషయం కాదు. సునామీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉండడంతో క్లైమాక్స్‌ మారుస్తానని చెప్పాను. దానికి దర్శకుడు, నిర్మాత ఇద్దరూ ఒప్పుకోలేదు. దర్శకుడు రవికుమార్‌కు స్క్రిప్ట్‌పై పూర్తి అవగాహన ఉంది. ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలో ఆయనకు తెలుసు. దీంతో మరో ఆలోచన లేకుండా అదనంగా రూ.కోటి పెట్టి క్లైమాక్స్‌ తీసేందుకు మేం వెనుకాడం లేదు. నిర్మాత రవిచంద్రన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో సినిమాలో నా వంతు వాటా కింద కొత్త మొత్తాన్ని పెట్టుబడి పెట్టాను. అలా ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను’

వాళ్ల రియాక్షన్స్‌తో అయోమయంలో పడ్డా!

‘‘దశావతారం’ సినిమాకు అద్భుతమైన టెక్నికల్‌ టీమ్‌ దొరికింది. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. గౌతమి కూడా ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు. సినిమా మొదటి 10 నిమిషాల్లో వచ్చే సీన్లకు ఆర్ట్‌ డైరెక్టర్‌ సమీర్‌ పనిచేశారు. ఇక ఎయిర్‌పోర్ట్‌ సహా సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలకు తోట తరణి, ప్రభాకర్‌లు పనిచేశారు. జీవాను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఎందుకంటే మొత్తం స్క్రిప్ట్‌ సవాల్‌తో కూడుకున్నది. మొదటి పది నిమిషాల్లో వచ్చే సన్నివేశాల కోసం ఏకంగా రూ.2.5కోట్లు ఖర్చు అయింది. ఇక సీజే టీమ్‌ ఏకంగా 2మిలియన్లు అడిగింది. ఈ విషయంలో వాళ్లకు మాకూ ఎప్పుడూ వాదోపవాదాలు జరుగుతూనే ఉండేవి. బడ్జెట్‌ సహకరించని కారణంగా కొన్ని సన్నివేశాలు అనుకున్నంత బాగా రాలేదు. అసలు సినిమా పూర్తయ్యే సరికి ఎంత బడ్జెట్‌ అవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరూ తమ సొంత సినిమాలా భావించి, పనిచేశారు. ఎన్నో అవమానాలు, వాదనలు, ఒత్తిడితో కూడిన వాతావరణంతో సినిమాను పూర్తి చేశాం. ఈ విషయంలో చిత్ర బృందం కృషి ఎప్పటికీ మరవలేను. అయితే, కొందరు టెక్నీషియన్లు ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయి, విమర్శలు చేయడం బాధించింది. నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకు ‘అపూర్వ సహోదరులు’, ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలే ఉదాహరణ. బడ్జెట్‌ సమస్యలతోనే ఆ రెండు చిత్రాలను తీశారు. అందుకు కారణంగా ఎంతో గొప్ప విజన్‌ ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యాపారవేత్త కారణం.

సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి?

‘‘సంగీత దర్శకుడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఎంతో ఆలోచనలో పడ్డాను. నా కథ గురించి ఎవరికి చెప్పినా వాళ్లు ఇచ్చే రియాక్షన్స్ చూసి నేను అయోమయంలో పడ్డా. నిర్మాత రవిచంద్రన్ చెప్పడంతో హిమేశ్ రేష్మియాని మా బృందంలోకి తీసుకున్నాం. అతను ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఆ రోజుల్లో సరైన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ లేకపోవడంతో హిమేశ్‌కు అంత గుర్తింపు రాలేదు. ‘ముకుంద.. ముకుంద’ ఇక, నేపథ్య సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్‌.. ఎనర్జీ గురించి అందరికీ తెలిసిన విషయమే. అతనితో కలిసి వర్క్‌ చేయడం సూపర్‌ కూల్‌గా సాగింది. అంతర్జాతీయ స్థాయి నటులు, టెక్నిషియన్లను పెట్టుకోవడానికి మా వద్ద సరైన బడ్జెట్‌ లేదు. అయితే, ఈ విషయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పనిచేశారు. నా దృష్టిలో ‘దశావతారం’ టెక్నికల్‌గా ఒక మాస్టర్‌ పీస్‌. ఎంతోమంది గొప్పవాళ్ల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా, అంతిమంగా సినిమానే మాస్టర్‌. కొన్ని సార్లు మేము విఫలమైనా ప్రేక్షక దేవుళ్లు వాటిని మన్నించి సినిమాను హిట్ చేశారు’’

లుక్స్‌ విషయంలో కంగారు

‘‘రా’ అధికారి బలరామనాయుడు పాత్ర కోసం ఓ విగ్గు సిద్ధం చేయడానికి రెండు నెలలు సమయం పడింది. దాంతో అనుకున్న షెడ్యూల్‌కి చిత్రీకరణ పూర్తి అవుతుందా? లేదా? అని కంగారుపడ్డాం. ఎన్నో సంవత్సరాల నుంచి నా ట్రైనర్‌గా ఉన్న వ్యక్తి.. బలరామ నాయుడుగా నేను సిద్ధమైన తర్వాత నన్ను గుర్తుపట్టలేకపోయాడు. అలాగే ఆ పాత్ర కోసం నేను ప్రొస్థటిక్‌ మేకప్‌ వేసుకున్నాను. ఇక, మిగిలిన లుక్స్ విషయానికి వస్తే .. భువర్‌గన్‌ లుక్‌ చూసి అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అందం అనేది ముఖానికి సంబంధించి కాదని నేను నమ్ముతాను. అలా, చివరికి భువర్‌గన్‌ లుక్‌ని ఓకే చేయించాను. బుష్‌ వెర్షన్‌ విషయంలో దర్శకుడు అంత సంతోషంగా లేరు. ఎందుకంటే ప్రతి పాత్రా ఒక హీరోలా ఉండాలనుకున్నారు. అయితే, రచయితగా నేను ఆ పాత్ర ఒక విలన్‌లా ఉండాలని భావించా.

మర్చిపోలేని సంఘటనలు

ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎన్నో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. అలాంటి వాటిలో సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు. వాటికి సంబంధించి నేను ఎన్నో డిజైన్లు అనుకున్నా.  అయితే వాటిని ఎలా తీస్తామనే దానిపై ఎవరికీ తెలియదు. ఎందుకంటే ‘మరుదనాయగమ్‌’ నాకు మర్చిపోలేని పాఠాలు నేర్పింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోకుండా చాలా అనుకున్నాం. అవేవీ కుదరలేదు. దాంతో ఈ సినిమా విషయంలో ఏదైతే చేయగలమో దాన్నే ప్రామాణికంగా తీసుకున్నాం. మేమొక అద్భుత చిత్రాన్ని తీస్తున్నామనుకున్నాం. బడ్జెట్‌, పేరు ప్రఖ్యాతులు గురించి ఆలోచించలేదు. యాక్షన్‌ సన్నివేశాల కోసం స్టంట్‌ డైరెక్టర్స్‌ బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా ఫ్లెచర్‌, సమురాయ్‌ పాత్రల యాక్షన్‌ సీన్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

‘దశావతారం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించిందంటే దానికి కారణం నేను ఒక్కడ్ని మాత్రమే కాదు. దర్శకుడు రవికుమార్‌, నిర్మాత రవిచంద్రన్‌, సంగీత దర్శకులు, ఇతర చిత్రబృందంతోపాటు నటీనటులు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయడంతోనే మా చిత్రం గొప్ప విజయాన్ని అందుకోగలిగింది’ అని కమల్‌హాసన్‌ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని