మేల్కొలపడానికి..‘మరో రౌండ్‌’

వేడుకలాంటి జీవితాన్ని తెరకెక్కించాలని కలగంటే .. ఓ కారు ప్రమాదం నా కూతుర్ని బలిగొని తీరని విషాదాన్ని మిగిల్చింది.’’- తన కూతురు ఐడాకు ఆస్కార్‌ని, సినిమానీ అంకితమిస్తూ దర్శకుడు...

Published : 28 Apr 2021 10:00 IST

ఆస్కార్‌ సినిమా-8

చిత్రం: అనదర్‌ రౌండ్‌; భాష: డానిష్‌; దర్శకుడు: థామస్‌ వింటెబర్గ్‌; తారాగణం: మ్యాడ్స్‌ మెకెల్సెన్, థామస్‌ బో లార్సెన్‌, తదితరులు; విడుదల: 2020; నిడివి: 117నిమిషాలు; విశేషం: ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆస్కార్‌(ఈ విభాగంలోనే మన దేశం నుంచి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ పోటీ పడింది. నామినేట్‌ అయిన తుది జాబితాలోనూ నిలువలేకపోయింది.)

‘వేడుకలాంటి జీవితాన్ని తెరకెక్కించాలని కలగంటే .. ఓ కారు ప్రమాదం నా కూతుర్ని బలిగొని తీరని విషాదాన్ని మిగిల్చింది.’’- తన కూతురు ఐడాకు ఆస్కార్‌ని, సినిమానీ అంకితమిస్తూ దర్శకుడు పలికిన మాటలకు హాలంతా బరువెక్కింది. ఆయన భావోద్వేగ ప్రసంగం వేడుకకు హాజరైన ప్రముఖలందరి  గుండెలను తడిపేసింది. ‘ఇవి అద్భుత క్షణాలు.. ఈ అద్భుతంలో నువ్వూ భాగమే’ అని కూతురిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు దర్శకుడు థామస్‌ వింటెబర్గ్‌. సినిమా ప్రారంభించిన 4 రోజులకే తన 19 ఏళ్ల కూతురు ఐడా కారు ప్రమాదంలో మరణించింది. కంట్లోంచి ఉప్పొంగే కన్నీళ్లని, గుండెల్లోంచి తన్నుకొచ్చే బాధను ఆపుకొని మరీ ‘అనదర్‌ రౌండ్‌’ చిత్రీకరణ పూర్తిచేశాడు. ఆ బాధకి కాస్త ఊరటనిస్తూ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో దానికి ఆస్కార్‌ పురస్కారం దక్కింది. ఆ చిత్ర విశేషాలివి..

డానిష్‌ యువతలో మద్యం సంస్కృతిపై తన కుమార్తె ఐడా పలుమార్లు చెప్పిన కథల ఆధారంగా దర్శకుడు థామస్‌ ముందు ఓ నాటకాన్ని రాసుకున్నాడు. కూతురు ప్రోద్బలంతో  దాన్ని సినిమాగా మార్చాలని నిర్ణయానికొచ్చాడు. అంతేకాదు ఇందులో మార్టిన్‌ (మ్యాడ్స్‌ మికెలెసన్‌) పాత్రకు కూతురుగా ఐడా నటించాల్సి ఉంది. కానీ ఆమె ప్రమాదంలో మరణించి, తెరంగేట్రం చేయకుండానే ఈ లోకాన్ని వీడింది. మద్యం చుట్టూనే తిరిగే కథతోనే తెరకెక్కిన ఈ చిత్రం జీవితాన్ని జాగృతం చేస్తుందంటాడు దర్శకుడు. సినిమా అంతా తన కూతురు చదివిన తరగతి గదిలో, ఆమె స్నేహితుల మధ్యే తెరకెక్కించాడాయన. ది సెలబ్రేషన్‌(1998), సబ్మరినో(2010), ‘ది హంట్‌’ లాంటి చిత్రాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరుందాయనకు. ‘ది హంట్‌’లో నటించిన మ్యాడ్స్‌ మికెలెసన్‌తోనే మరోసారి ‘అనదర్‌ రౌండ్‌’ చిత్రం కోసం జత కలిశాడు. 93వ ఆస్కార్‌కి ఉత్తమ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ విభాగాలకి నామినేట్‌ అయిన ఈ చిత్రం ఒక ఆస్కార్‌ను తన ఖాతాలో వేసుకుంది.

కథ: మధ్య వయసు సంక్షోభంలో చిక్కుకున్న నలుగురు స్నేహితుల కథ ఇది. మార్టిన్, టామీ, పీటర్,   నికోలజ్‌ ఈ నలుగురు ఓ స్కూల్‌లో ఉపాధ్యాయులు. వ్యక్తి, వృత్తిగత జీవితమంతా నిస్తేజంగా మారి విరక్తితో కాలం నెట్టుకొస్తుంటారు. ఓ రోజు రక్తంలో ఆల్కహాల్‌ శాతం, దాని ఫలితాలపై నలుగురి మధ్య చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ అధ్యయనం గురించి మాట్లాడుకుంటారు. కొంత శాతం మద్యాన్ని తాగితే.. యవ్వనపు ఉత్తేజాన్ని అందుకోవచ్చని, వృత్తిలో సృజనాత్మకంగా మారొచ్చని అనుకుంటారు. ఈ మేరకు ప్రయోగానికి సిద్ధమవుతారు. అలా తొలుత ప్రయత్నించడానికి అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న మార్టిన్‌ ముందుకొస్తాడు. పనివేళల్లోనే కొంత ఆల్కహాల్‌ తీసుకొని విధులకు హాజరవుతాడు. మార్టిన్‌ను మిగతా వారూ అనుసరిస్తారు. అనుకున్నట్లుగానే  మార్టిన్‌ సోషల్‌ టీచర్‌గా కొంతమేర ఫలితాలు సాధిస్తాడు. ఆ తర్వాత ఆల్కాహాల్‌ శాతాన్ని మోతాదు పెంచి తీసుకుంటారు. తదుపరి ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి? నలుగురి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అన్నదే మిగతా కథ. ఈ సందర్భంగా దర్శకుడు అత్యంత సహజమైన సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. మ్యాడ్స్‌ తన నటనతో అబ్బురపరిచాడు.

మితిమీరితే కష్టమే: మద్యం అలవాటు ఎప్పటికైనా ప్రమాదమే. దీనివల్ల సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తి, వృత్తిగతంగా తలెత్తే ఇబ్బందులపై ఈ సినిమాలో చూపించారు. ఈ అలవాటు మితిమీరితే ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాలో చెప్పాడు దర్శకుడు.

డికాప్రియోకి నచ్చి.. హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియోకు ‘అనదర్‌ రౌండ్‌’ కథ, కథనం  బాగా నచ్చాయి. అందుకే దీన్ని హాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. థామస్‌ నుంచి ఈ చిత్ర హక్కులు కొన్నాడని, మ్యాడ్స్‌ మికెల్సెన్‌ పాత్రలో డికాప్రియో మెరవనున్నారని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని